
ప్రతీకాత్మక చిత్రం
డెహ్రాడున్ : మార్నింగ్ వాక్‌కు వెళ్లిన విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి సజీవ దహనం చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం...దినేశ్ సింగ్ బిస్త్ అనే విద్యార్థికి ప్రతిరోజు మార్నింగ్ వాక్‌కి వెళ్లే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం కూడా తన ఇంటి నుంచి బయల్దేరాడు. కొద్ది దూరం వెళ్లగానే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దినేశ్ కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు గమనించి అతడి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. దినేశ్‌పై జరిగిన దాడికి ప్రత్యక్ష సాక్షులెవరూ లేకపోవడంతో అతడి హత్యా లేదా ఆత్మహత్యా అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
తోటి విద్యార్థుల పనేనా..?
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో... ఇద్దరు అబ్బాయిలు తనపై కిరోసిన్ పోసి నిప్పంటినట్లు దినేశ్ చెప్పినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. గతంలో కూడా ఇటువంటి కేసులు నమోదయ్యాయని, దినేశ్‌ను తోటి విద్యార్థులే హత్య చేశారా అన్న కోణంలో కూడా విచారిస్తున్నట్లు డీఎస్పీ వీర్ సింగ్ తెలిపారు. ఈ విషయమై దినేశ్ చదువుతున్న పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించగా.. దినేశ్ యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ ఎప్పుడూ కూడా ఒత్తిడికి లోనయ్యేవాడు కాదని, అందరితో కలివిడిగా ఉండేవాడని చెప్పారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment