కశ్మీర్‌లో పాఠాలు షురూ | Schools, colleges and government offices to reopen in Jammu Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో పాఠాలు షురూ

Published Tue, Aug 20 2019 3:47 AM | Last Updated on Tue, Aug 20 2019 4:52 AM

Schools, colleges and government offices to reopen in Jammu Kashmir - Sakshi

శ్రీనగర్‌/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌/వాషింగ్టన్‌: కశ్మీర్‌లో సోమవారం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే చాలా పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. శ్రీనగర్‌లో 190 ప్రాథమిక పాఠశాలలు తెరుచుకున్నప్పటికీ శాంతిభద్రతల భయంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపలేదు. అయితే బెమినాలోని పోలీస్‌ పబ్లిక్‌ స్కూల్, ఇతర కేంద్రీయ విద్యాలయాల్లో మాత్రం చెప్పుకోదగ్గ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. కశ్మీర్‌లో ఆంక్షలు సడలించినప్పటికీ బలగాల మోహరింపు మాత్రం తగ్గలేదు. ఈ సందర్భంగా బారాముల్లా జిల్లాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘పట్టన్, పల్హలాన్, సింఘ్‌పొరా, బారాముల్లా, సోపోర్‌ పట్టణాల్లో ఆంక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి.

జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం పాఠశాలలు తెరుచుకున్నాయి’ అని చెప్పారు. శ్రీనగర్‌లో గత 3 రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నందున పాఠశాలలు తెరుచుకోలేదని వ్యాఖ్యానించారు. అయితే నగరంలో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో బారికేడ్లను తొలగించి ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా అధికారులు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని ఈ నెల 5న రద్దుచేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్‌ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా జమ్మూకశ్మీర్‌లో భారీగా బలగాలను మోహరించారు.

భారత రాయబారికి పాక్‌ సమన్లు
భారత డిప్యూటీ హైకమిషనర్‌గా గౌరవ్‌ అహ్లూవాలియాకు పాక్‌ ప్రభుత్వం సోమవారం సమన్లు జారీచేసింది. అహ్లూవాలియాను ఇస్లామాబాద్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకున్న సార్క్‌ డైరెక్టర్‌ జనరల్‌ మొహమ్మద్‌ ఫైజల్‌.. భారత్‌ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. భారత బలగాల తీరుపై తీవ్ర నిరసన తెలియజేశారు. ఆదివారం ఛిక్రీకోట్, హాట్‌స్ప్రింగ్‌ సెక్టార్లపై భారత ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఇద్దరు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2017 నుంచి ఇప్పటివరకూ భారత్‌ 1,970 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని విమర్శించారు.

ట్రంప్‌ పాక్‌వైపు మొగ్గు చూపొద్దు
భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా పొరపాటున కూడా పాక్‌వైపు మొగ్గుచూపరాదని అగ్రరాజ్యానికి చెందిన కౌన్సిల్‌ ఫర్‌ ఫారిన్‌ రిలేషన్స్‌(సీఎఫ్‌ఆర్‌) సంస్థ అధ్యక్షుడు రిచర్డ్‌ ఎన్‌ హాస్‌ సూచించారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాక్‌వైపు ఏమాత్రం మొగ్గుచూపినా భారత్‌ దూరమైపోతుందని హెచ్చరించారు. ఈ విషయమై రిచర్డ్‌ స్పందిస్తూ..‘భారత్‌ను ఎదుర్కోవడానికి కాబూల్‌(అఫ్గానిస్తాన్‌)లో తన మిత్రులు అధికారంలో ఉండాలని పాక్‌ కోరుకుంటోంది. కాబట్టి పాక్‌ను శాసించే సైనిక, నిఘా వ్యవస్థలు తాలిబన్లను నియంత్రిస్తాయనీ, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాయని నమ్మేందుకు చాలాతక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో భారత్‌కు అమెరికా దూరం జరగడం అంత తెలివైన నిర్ణయంకాదు.

ప్రజాస్వామ్య భారత్‌ జనాభా త్వరలోనే చైనాను దాటేస్తుంది. అంతేకాకుండా భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించబోతోంది. కాబట్టి అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే ఇండియావైపు మొగ్గడమే శ్రేయస్కరం. ఆసియాలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారత్‌ అమెరికాకు సహకరిస్తుంది’ అని తెలిపారు. మరోవైపు కశ్మీర్‌ సమస్య కారణంగా తాలిబన్‌–అమెరికాల మధ్య శాంతిచర్చలకు విఘాతం కలుగుతుందన్న పాక్‌ వ్యాఖ్యలపై అఫ్గానిస్తాన్‌ ప్రభుత్వం మండిపడింది. జమ్మూకశ్మీర్‌ భారత్‌–పాక్‌ల ద్వైపాక్షిక సమస్యనీ, దాన్ని అఫ్గాన్‌తో ముడిపెట్టడం పూర్తిగా బాధ్యతారాహిత్యమేనని స్పష్టం చేసింది.  

అమిత్‌ షాతో దోవల్‌ భేటీ
జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌ లోయలో దాదాపు 10 రోజులపాటు పర్యటించిన దోవల్‌.. అక్కడి పరిస్థితిని  షాకు వివరించారు. ఈ సందర్భం గా జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలపై చర్చించారు. హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబాతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement