కాలిన గాయాలతో రవితేజ
అర్ధవీడు(గిద్దలూరు): ఓ యువతికి ఇచ్చిరమ్మన్న లవ్ లెటర్‌ను చించేశాడనే కోపంతో పాఠశాల విద్యార్థిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణం శనివారం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. అర్ధవీడు మండలం అంకభూపాలేనికి చెందిన మెట్ల శేఖర్, వెంకటలక్ష్మమ్మ దంపతుల కుమారుడు రవితేజ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం భోజనం తరువాత స్కూలులో నిరుపయోగంగా ఉండే గదిలోంచి రవితేజ పెద్దగా కేకలు వేయడంతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు పరుగున అక్కడికి వెళ్లారు. మంటల్లో కాలుతున్న రవితేజ ఒంటిపై దుప్పటి కప్పి నీళ్లు చల్లి మంటలార్పారు. అనంతరం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు.
ఘటనపై అనుమానాలెన్నో...
గాయపడిన రవితేజ కంభం ప్రభుత్వ వైద్యశాలలో విలేకర్లతో మాట్లాడుతూ తాను మూత్ర విసర్జన కోసం పాఠశాల బయటకి రాగా రంజిత్ అనే ఇంటర్ విద్యార్థి తనకు ఒక చీటీ (లవ్‌లెటర్)ఇచ్చాడని, స్కూలు ప్రాంగణంలోనే ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే ఓ యువతికి ఇచ్చిరమ్మన్నాడని చెప్పాడు. తాను ఆ కాగితాన్ని చించి వేయడంతో రంజిత్ తన వెంట తెచ్చుకున్న బాటిల్‌లోని పెట్రోల్‌ను తనపై పోసి, నిప్పంటించాడని తెలిపాడు. ఇదిలా ఉండగా రవితేజ ఇంటి నుంచే పెట్రోలు తెచ్చుకున్నాడని, తనే కాల్చుకొని ఉండొచ్చని స్కూలు హెచ్‌ఎం వెంకటేశ్వర్లు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఆయన మాటలను బాధితుడి తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. తమ కుమారుడికి ఏదైనా జరిగితే టీచర్లే బాధ్యత వహించాలని చెప్పారు.
నిందితుడి గుర్తింపు..
సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ రవీంద్రారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితుడు అదే ప్రాంగణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదవుతున్న మాదార్సు రంజిత్‌కుమార్‌గా గుర్తించారు. సీఐ భీమానాయక్ నిందితుడిని అదుపులోకి తీసుకుని మార్కాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా పెట్రోల్ రంజిత్ పోశాడా.. రవితేజ తెచ్చాడా..? లేదా ఆ యువతిపై పోసేందుకు రంజితే తెచ్చాడా..? అనే అంశాలపై విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment