ఉత్తరాదిన ఎండలు దంచికొడుతున్నాయి. తాజాగా బీహార్‌లోని షేక్‌పురా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎండ వేడిమికి తాళలేక 50 మందికి పైగా విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయారు. వీరి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో పాఠశాలలో కలకలం చెలరేగింది.
అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రభుత్వ ఆరోగ్య శాఖను సంప్రదించారు. ఎంతసేపటికి అంబులెన్స్ రాకపోవడంతో ఆ విద్యార్థినులందరినీ పాఠశాల సిబ్బంది ప్రైవేట్ వాహనాల్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్థూ స్థానికులు రోడ్డుపై ధర్నాకుదిగారు.
బీహార్‌లోని పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంతటి ఎండ వేడిమిలోనూ రాష్ట్రంలోని పాఠశాలలు పనిచేస్తున్నాయి. బుధవారం ఉదయం మండుటెండల కారణంగా అరియారి బ్లాక్‌లోని మన్‌కౌల్ మిడిల్ స్కూల్‌లో విద్యార్థినులు అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు.
ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రార్థనల అనంతరం పదుల సంఖ్యలో చిన్నారులు స్పృహతప్పి పడిపోయారని తెలిపారు. దీంతో పిల్లలందరినీ ప్రైవేట్ వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ చిన్నారులంతా డీహైడ్రేషన్ బారిన పడ్డారని వైద్యుడు సత్యేంద్ర కుమార్ తెలిపారు. పిల్లలకు చికిత్స అందిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment