సాధారణంగా పామును చూస్తేనే దానికి దూరం పరుగెత్తుతారు. ఒకవేళ పాము కాటుకు గురైతే భయపడిపోయి ప్రాణభయంతో వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి పరుగుతీస్తాం. కానీ బీహార్ ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పాముకాటుకు గురైన మహిళను ఆమె భర్త ఆసుపత్రికి తీసుకురాగా ఆమెతోపాటు కాటు వేసిన పామును కూడా తీసుకురావడంతో వైద్యులు షాక్‌కు గురయ్యారు.
సబౌర్‌లోని జుర్‌ఖురియా గ్రామంలో నిషా అనే మహిళ తన ఇంటిని శుభ్రం చేస్తుండగా పాము కాటుకు గురైంది. సాయం కోసం కేకలు వేయడంతో, భర్త రాహుల్ ఆమె దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. ఈ లోపు పాము పారిపోతుంటే దాని వెంట వెళ్లి ఇంట్లో దేవుడి ఫోటోల వెనక్కి నక్కిన పాము కనిపించింది.
వెంటనే కర్రతో దానిని తీసి బకెట్‌లో వేశాడు. అప్పటికే నిషా స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను తన బైక్‌పై కూర్చోబెట్టి, బకెట్‌లో పాముతోపాటు బైక్ హ్యాండిల్‌కు వేలాడదీశాడు. భాగల్పూర్ జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లిన తర్వాత వైద్యులు మొదట పామును చూసి భయపడిపోయారు.
అయితే ఆ పాము తన భార్యను కరిచిందని చెబుతూ.. ఆమెను కాపాడాల్సిందిగా వైద్యులను వేడుకున్నాడు నిషా భర్త.. అనంతరం దానిని దూరంగా ఉంచమని చెప్పి.. మహిళను చికిత్స కోసం అత్యవసర విభాగానికి పంపారు. ఆ పాము విషాన్ని అంచనా వేయడం ద్వారా ఆమెకు వైద్యులు చికిత్స చేశారు. ప్రస్తుతం నిషా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పామును మళ్లీ అడవిలో విడిచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment