బడికి తాళం!
♦ పల్లెల్లో 1,300కుపైగా ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ల మూతకు రంగం సిద్ధం
♦ ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణ కసరత్తు షురూ
♦ పది మందిలోపు విద్యార్థులున్న పాఠశాలల టీచర్లు ఇతర స్కూళ్లకు..
♦ 30 మందిలోపు ఉంటే సమీపంలోని స్కూళ్లలో విలీనం!
♦ బడి ఉండాలంటే ప్రజలు, మేనేజ్‌మెంట్ కమిటీల తీర్మానం తప్పనిసరి
♦ ప్రాథమికోన్నత విద్యా వ్యవస్థ రద్దుపైనా కసరత్తు
♦ అసెంబ్లీకి ఇచ్చిన వివరణ పత్రం మేరకు హేతుబద్ధీకరణ
♦ బాగా తగ్గిపోనున్న ఉపాధ్యాయ పోస్టులు
♦ 10 వేల పోస్టుల భర్తీ కూడా కష్టమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమవుతోంది. 10 మందిలోపు విద్యార్థులున్న బడులన్నింటికీ శాశ్వతంగా తాళం పడనుంది. ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణతో ఏకంగా 1,300కుపైగా స్కూళ్లు మూతపడనున్నాయి. అంతేకాదు ప్రాథమికోన్నత పాఠశాలల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయనుంది. ఆ స్కూళ్లన్నీ సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరంలోగానే ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఈసారి ఆన్‌లైన్ ఆధారిత విధానంలో హేతుబద్ధీకరణ చేపట్టనుంది. ఇందుకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తోంది.
10 మంది లోపుంటే మూతే..: హేతుబద్ధీకరణలో భాగంగా ఒక్క విద్యార్థీ లేని 405 పాఠశాలలను మూసివేయడంతో పాటు 10 మందిలోపు విద్యార్థులున్న 991 పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేసే అవకాశముంది. 30 మంది కంటే తక్కువగా విద్యార్థులున్న పాఠశాలల నిర్వహణ కష్టతరమని, ఆర్థిక భారమని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో అలాంటి కొన్ని స్కూళ్లను ఇతర పాఠశాలల్లో విలీనం చేయనుంది. ఇలా మొత్తంగా 1,300కు పైగా పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది.
ప్రాథమికోన్నత పాఠశాలలు మాయం!
రాష్ట్రంలో రెండు రకాల విద్యా వ్యవస్థ మాత్రమే ఉండాలన్న నిర్ణయానికి ప్రభుత్వం ఇదివరకే వచ్చింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వ్యవస్థ కాకుండా ప్రాథమిక, ఉన్నత పాఠశాలల వ్యవస్థను మాత్రమే కొనసాగించేందుకు చర్యలు చేపడుతోంది. దీంతో 3,224 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎక్కువ శాతం స్కూళ్లు సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి. 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలేదీ లేకపోతే...అక్కడి ప్రాథమికోన్నత స్కూళ్లను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయనుంది.
30మంది కంటే తక్కువుంటే కష్టమే
పాఠశాలలో 30 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే ఆ పాఠశాలల నిర్వహణ కష్టమని అసెంబ్లీకి ఇచ్చిన వివరణ పత్రంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. జనావాసాలకు కిలోమీటర్ పరిధిలో కచ్చితంగా పాఠశాల ఉండాలన్న నిబంధనను సవరించాలని పేర్కొంది. తక్కువ సంఖ్యలో నమోదు ఉన్న పాఠశాలల విద్యార్థులు.. దూరంలోని స్కూళ్లకు వెళ్లడం కోసం రవాణా సదుపాయం కల్పించాలని భావిస్తోంది. తద్వారా తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లన్నీ సమీపంలోని పాఠశాలల్లో విలీనం కానున్నాయి. 20 మంది కంటే తక్కువగా విద్యార్థులున్న పాఠశాలలను విలీనం చేస్తే... పెద్ద సంఖ్యలో పాఠశాలలు కనుమరుగవుతాయి. కొండ ప్రాంతాల్లో పాఠశాలలను మాత్రం అలాగే కొనసాగించే అవకాశముంది.
కొనసాగాలంటే హామీ ఇవ్వాలి
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఏదైనా పాఠశాలను కొనసాగించాలంటే.. అందుకు ప్రత్యేక నిబంధనలను విధించనున్నారు. తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పిస్తామని, విద్యార్థుల సంఖ్యను పెంచుతామని టీచర్లు... తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తామని ప్రజలు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు వేర్వేరుగా తీర్మానాలు చేసి పంపించాల్సి ఉంది. మండల విద్యాధికారి (ఎంఈవో) నేతృత్వంలో గ్రామసభలు నిర్వహించి, తీర్మానాలు చేస్తే ఆ పాఠశాలను యథాతథంగా కొనసాగిస్తారు.
జీఐఎస్ ఆధారిత హేతుబద్ధీకరణ
ఈసారి జియోగ్రాఫిక్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) ఆధారంగా హేతుబద్ధీకరణ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రతి గ్రామానికి ఒక స్కూల్ ఎడ్యుకేషనల్ రిపోర్టు తయారు చేయనున్నారు. గ్రామ పంచాయతీలు, ప్రస్తుతమున్న పాఠశాలల వివరాలు, ఒక్కో గ్రామంలో 6-14 ఏళ్ల వయసున్న పిల్లలు, వారిలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్న వారు, ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న వారి వివరాలను అందులో నమోదు చేసి, జీఐఎస్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక హేతుబద్ధీకరణ నిబంధనలను జారీ చేయాలని భావిస్తున్నారు. ఆ నిబంధనల మేరకు ఆన్‌లైన్ ఆధారిత హేతుబద్ధీకరణను చేపట్టనున్నారు.
నిరుద్యోగుల ఆశలు గల్లంతు
ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణతో రాష్ట్రంలోని ఉపాధ్యాయ అభ్యర్థుల ఆశలు ఆవిరవుతున్నాయి. భారీ ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ ప్రస్తుతం ఆ స్థాయిలో ఉపాధ్యాయ ఖాళీలుండే పరిస్థితి కనిపించడం లేదు. పాఠశాలల విలీనం, మూసివేత, ప్రాథమికోన్నత వ్యవస్థ రద్దు ద్వారా వాటిలో పనిచేసే టీచర్లను విద్యార్థులు ఎక్కువగా ఉన్న ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. దీంతో ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. మూడు నెలల కింద ప్రభుత్వం రాష్ట్రంలో విద్యాశాఖతోపాటు ఇతర గురుకులాల్లో 15,628 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు తేల్చింది. కానీ ఇప్పుడు 10 వేల పోస్టులు కూడా ఉండే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు.