ప్రపంచ ర్యాంకింగ్స్‌లో  భారతీయ వర్సిటీల హవా | Indian universities rise in QS World University Rankings | Sakshi
Sakshi News home page

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో  భారతీయ వర్సిటీల హవా

Published Mon, Feb 17 2025 6:43 AM | Last Updated on Mon, Feb 17 2025 9:09 AM

Indian universities rise in QS World University Rankings

దశాబ్దకాలంలో ర్యాంకింగ్స్‌లో పెరిగిన భారతీయ వర్సిటీల సంఖ్య 

ఏకంగా 318 శాతం పెరుగుదల 

జీ20దేశాల్లో అత్యధిక వృద్ధి సాధించిన భారత్‌ 

ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ 

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఇటీవలికాలంలో బాగా మెరుగయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు దశాబ్దకాలంలో అంతర్జాతీయ వర్సిటీ ర్యాంకింగ్స్‌లో పెరిగిన భారతీయ వర్సిటీల సంఖ్యను ప్రబల తార్కాణంగా ప్రభుత్వం చూపించింది. క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 2015 ఏడాదిలో కేవలం 11 భారతీయ విశ్వవిద్యాలయాలు మాత్రమే ర్యాంక్‌లు సాధిస్తే ప్రస్తుత సంవత్సరంలో ఏకంగా 46 వర్సిటీలు ర్యాంక్‌లు సాధించడం విశేషం. 

అంటే దశాబ్దకాలంలో భారత వర్సిటీలు 318 శాతం వృద్ధిని సాధించాయి. జీ20 సభ్యదేశాల్లో ఇంతటి వృద్ధిని సాధించిన ఏకైక దేశంగా భారత్‌ నిలిచిందని కేంద్ర విద్యాశాఖ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంటే 1950–51 కాలంలో పాఠశాల్లో చేరే వారి సంఖ్య(గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో–జీఈఆర్‌) కేవలం 0. 4 శాతంగా నమోదైతే ఇప్పుడు 2021–22 నాటికి 71 రెట్లు పెరిగి ఏకంగా 28.4 శాతానికి చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2035 నాటికి 50శాతం జీఈఆర్‌ లక్ష్యంగా ముందుకు అడుగులు వేçస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.  

ప్రభుత్వ వర్సిటీల ద్వారా 3.25 కోట్ల మందికి విద్య 
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారి సంఖ్య సైతం గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్‌ తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి పదో తేదీన నీతి ఆయోగ్‌ ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 3.25 కోట్ల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 2035 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంతో నూతన జాతీయ విద్య విధానం, 2020ను అమలుచేస్తున్నామని విద్యాశాఖ తెలిపింది.

 ‘1857లో కోల్‌కతా, ముంబై, మద్రాస్‌లలో తొలి విశ్వవిద్యాలయాలు స్థాపించబడినప్పటి నుంచి దేశ ఉన్నత విద్యావ్యవస్థ గణనీయంగా విస్తరించింది. 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల ద్వారా 2.38 లక్షల మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. అక్ష్యరాస్యత రేటు 14 శాతం ఉండటంతో ఆరోజుల్లో విద్య వ్యవస్థ ఆందోళనకరంగా ఉండేది. ఆనాటి రోజుల నుంచి విద్యలో పురోగతి సాధిస్తూ ఈ విశ్వవిద్యాలయాల ద్వారా 81 శాతం విద్యార్థుల నమోదును సాధించాం’’అని కేంద్రం వివరించింది. 

ఎస్‌పీయూల ద్వారా పురోగతి 
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2011–12లో 2.34 కోట్ల మంది విద్యార్థులు ప్రభుత్వ వర్సిటీల్లో చదువుకుంటే 2021–22 నాటికి ఆ విద్యార్థుల సంఖ్య 3.24కోట్లకు పెరిగింది. ఓబీసీ విద్యార్థుల్లో వృద్ధి 80.9 శాతం మంది కాగా ఎస్సీ విద్యార్తుల్లో 76.3 శాతం వృద్ధి కనిపించింది. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో దాదాపు 16 లక్షల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వరిస్తున్నారు. వీరిలో 68 శాతం మంది లెక్చరర్లు/అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉన్నారు. రీడర్లు/అసోసియేట్‌ ప్రొఫెసర్లు 10శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే భారత్‌ నుంచి పరిశోధనా పత్రాలు సైతం గణనీయంగా పెరిగాయి. 2017లో మొత్తం పరిశోధనా పత్రాల్లో భారత్‌ వాటా కేవలం 3.5 శాతం ఉండగా 2024 ఏడాదిలో అది 5.2 శాతానికి పెరిగింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement