international university
-
ప్రపంచ ర్యాంకింగ్స్లో భారతీయ వర్సిటీల హవా
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఇటీవలికాలంలో బాగా మెరుగయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు దశాబ్దకాలంలో అంతర్జాతీయ వర్సిటీ ర్యాంకింగ్స్లో పెరిగిన భారతీయ వర్సిటీల సంఖ్యను ప్రబల తార్కాణంగా ప్రభుత్వం చూపించింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 2015 ఏడాదిలో కేవలం 11 భారతీయ విశ్వవిద్యాలయాలు మాత్రమే ర్యాంక్లు సాధిస్తే ప్రస్తుత సంవత్సరంలో ఏకంగా 46 వర్సిటీలు ర్యాంక్లు సాధించడం విశేషం. అంటే దశాబ్దకాలంలో భారత వర్సిటీలు 318 శాతం వృద్ధిని సాధించాయి. జీ20 సభ్యదేశాల్లో ఇంతటి వృద్ధిని సాధించిన ఏకైక దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర విద్యాశాఖ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంటే 1950–51 కాలంలో పాఠశాల్లో చేరే వారి సంఖ్య(గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో–జీఈఆర్) కేవలం 0. 4 శాతంగా నమోదైతే ఇప్పుడు 2021–22 నాటికి 71 రెట్లు పెరిగి ఏకంగా 28.4 శాతానికి చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2035 నాటికి 50శాతం జీఈఆర్ లక్ష్యంగా ముందుకు అడుగులు వేçస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రభుత్వ వర్సిటీల ద్వారా 3.25 కోట్ల మందికి విద్య రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారి సంఖ్య సైతం గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్ తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి పదో తేదీన నీతి ఆయోగ్ ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 3.25 కోట్ల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 2035 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంతో నూతన జాతీయ విద్య విధానం, 2020ను అమలుచేస్తున్నామని విద్యాశాఖ తెలిపింది. ‘1857లో కోల్కతా, ముంబై, మద్రాస్లలో తొలి విశ్వవిద్యాలయాలు స్థాపించబడినప్పటి నుంచి దేశ ఉన్నత విద్యావ్యవస్థ గణనీయంగా విస్తరించింది. 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల ద్వారా 2.38 లక్షల మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. అక్ష్యరాస్యత రేటు 14 శాతం ఉండటంతో ఆరోజుల్లో విద్య వ్యవస్థ ఆందోళనకరంగా ఉండేది. ఆనాటి రోజుల నుంచి విద్యలో పురోగతి సాధిస్తూ ఈ విశ్వవిద్యాలయాల ద్వారా 81 శాతం విద్యార్థుల నమోదును సాధించాం’’అని కేంద్రం వివరించింది. ఎస్పీయూల ద్వారా పురోగతి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2011–12లో 2.34 కోట్ల మంది విద్యార్థులు ప్రభుత్వ వర్సిటీల్లో చదువుకుంటే 2021–22 నాటికి ఆ విద్యార్థుల సంఖ్య 3.24కోట్లకు పెరిగింది. ఓబీసీ విద్యార్థుల్లో వృద్ధి 80.9 శాతం మంది కాగా ఎస్సీ విద్యార్తుల్లో 76.3 శాతం వృద్ధి కనిపించింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో దాదాపు 16 లక్షల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వరిస్తున్నారు. వీరిలో 68 శాతం మంది లెక్చరర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. రీడర్లు/అసోసియేట్ ప్రొఫెసర్లు 10శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే భారత్ నుంచి పరిశోధనా పత్రాలు సైతం గణనీయంగా పెరిగాయి. 2017లో మొత్తం పరిశోధనా పత్రాల్లో భారత్ వాటా కేవలం 3.5 శాతం ఉండగా 2024 ఏడాదిలో అది 5.2 శాతానికి పెరిగింది. -
ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ వర్సిటీ సాధ్యమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం నియమించిన కమిటీ పలు సిఫారసులు చేసింది. ప్రస్తుతం మాదాపూర్లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్)ను విశ్వవిద్యాలయం స్థాయికి పెంచేందుకు వీలుగా సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఇటీవల ఓ కమిటీని నియమించింది. రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి చైర్మన్గా ఉండే ఈ కమిటీలో న్యాక్ డైరెక్టర్ జనరల్ సభ్యకార్యదర్శిగా, క్రెడాయ్ నుంచి ముగ్గురు, బిల్డర్స్ అసోసియేషన్ నుంచి ఇద్దరు ప్రతినిధులు, సీఐఐ నుంచి ఒకరు చొప్పున సభ్యులుగా ఉన్న కమిటీ లోతుగా పరిశీలించి తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. యూనివర్సిటీ స్థాయికి ఎదిగే అన్ని అర్హతలు, సామర్థ్యాలు న్యాక్కు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే వర్సిటీని స్థాపించేందుకు ఏర్పాట్లు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వం అనుమతించిన తర్వాత వర్సిటీ ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నివేదికలో పొందుపరిచిన అంశాల్లో కొన్ని ఇలా ఉన్నాయి. ► దీన్ని గ్లోబల్ కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ లేదా ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ యూనివర్సిటీగా పేర్కొనాలి. విదేశాల నుంచి కూడా సివిల్ ఇంజనీర్లు ఇం దులో చేరే స్థాయికి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ► ఇందులో స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ కన్స్ట్రక్షన్, స్కూల్ ఆఫ్ సస్టెయినబుల్ కన్స్ట్రక్షన్ ఫర్ అర్బన్ ప్లానింగ్, డిజిటల్ కన్స్ట్రక్షన్ స్కూల్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ స్కూల్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, స్కూల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్ఛర్ ఇంజనీరింగ్.. ఇలా ఐదు రకాల విభాగాల కింద స్పెషల్ కోర్సులు ఏర్పాటు చేయాలి. ► సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 40 ఏళ్ల క్రితం నాటి బోధనే ఇప్పుడూ సాగుతుండటంతో అందులో పురోగతి లేకుండా పోయింది. దాన్ని ఈ యూనివర్సిటీతో భర్తీ చేసి యూరప్, అమె రికా, సింగపూర్ లాంటి దేశాల నిర్మాణ రం గంలో వస్తున్న ఆధునికతను ఈ యూనివర్సిటీ కూడా స్థానికంగా అందిస్తుంది. ► యూనివర్సిటీని ఎంటెక్తో ప్రారంభించాలి. బీటెక్ విద్యార్థులకు పీజీ కోర్సులు అందిస్తూ రెండు, మూడేళ్లలో బీటెక్, ఆ తర్వాత రీసెర్చ్ విభాగాలు ప్రారంభించాలి. -
'కర్నూలులో అంతర్జాతీయ విమానాశ్రయం'
కర్నూలు: వచ్చే ఏడాది నుంచి ఉర్దూ కోసం ప్రత్యేక డీఎస్సీ ని నిర్వహిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్న ఉర్దూ విశ్వవిద్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ జరిగిన సభలో పాల్గొని మాట్లాడారు. ఉర్దూ యూనివర్సిటీ కోసం 125 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నెల నుంచి ఇమామ్ లకు రూ. 5 వేలు ఇస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా షాదీఖానా కోసం స్థలం కేటాయిస్తున్నామన్నారు. కర్నూలులో 900 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుకాబోతుందన్నారు. మరో వైపు కర్నూలు లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. అనంతరం ఆయన గోరుకల్లుకు చేరుకుని అక్కడ రిజర్వాయర్ పరిశీలించారు.