
డిజిటల్ వ్యక్తిగత సమాచార చట్టంలో కొన్ని సెక్షన్లను తొలగించాల్సిందే
విపక్షాల ‘ఇండియా’కూటమి డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవసీని పరిరక్షిస్తున్నామన్న సాకుతో ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాల్సిన సమాచారాన్ని సైతం కేంద్ర ప్రభుత్వం పౌరులకు అందకుండా తొక్కిపెడుతోందని విపక్షాల ‘ఇండియా’కూటమి నేతలు ఆరోపించారు. ప్రజలకు తెలియాల్సిన సమాచారాన్ని దాచేందుకు ఉద్దేశించిన డిజిటల్ ప్రైవసీ డేటా ప్రొటెక్షన్(డీపీడీపీ) చట్టంలోని 44(3)సెక్షన్‌ను తక్షణం తొలగించాలని పలువురు ‘ఇండియా’కూటమి నేతలు గురువారం డిమాండ్‌చేశారు.
ఈ మేరకు ఢిల్లీలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్, డీఎంకే నాయకుడు ఎంఎం అబ్దుల్లా, శివసేన(యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది, సీపీఎం నేత జాన్ బ్రిటాస్, సమాజ్‌వాదీ పార్టీ నేత జావెద్ అలీ ఖాన్, రాష్ట్రీయ జనతాదళ్ నేత నవల్ కిశోర్‌లు సంయుక్త పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘సమాచార హక్కుచట్టం(ఆర్టీఐ) ద్వారా పౌరులకు అందించాల్సిన సమాచారాన్ని ప్రైవసీ తెరలమాటున ప్రభుత్వం దాచేస్తోంది.
ముఖ్యంగా 44(3) సెక్షన్ ఈ దుర్ణితికి దన్నుగా నిలుస్తోంది. అందుకే ఈ సెక్షన్‌ను తొలగించాలి. ఈ డిమాండ్‌తో దాదాపు 120కిపైగా విపక్ష ఎంపీలు సంతకాలు చేసిన మెమోరండంను త్వరలోనే కేంద్ర ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు అందజేస్తాం. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టంలోని సవరణలను విపక్షాలు క్షుణ్ణంగా అధ్యయనంచేశాయి. పౌర హక్కులకు, పత్రికా స్వేచ్ఛకు భంగం కల్గించేలా డీపీడీపీ చట్టంలో సవరణలుచేశారు.
పార్లమెంట్, శాసనసభలకు అందుబాటులో ఉంచాల్సిన ప్రతి సమాచారం ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండాలని ఆర్టీఐ చట్టంలోని సెక్షన్8(1) చెబుతోంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అయితే వ్యక్తిగత సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుందని సెక్షన్ 8(1) ఉద్ఘాటిస్తోంది. అందులో కీలకమైన 8(1)(జే) సెక్షన్‌ను సవరించారు. దీంతో ప్రజాప్రయోజనాలులేని, ఇతర మినహాయింపులులేని వ్యక్తిగత సమాచారాన్ని కోరితే దానిని బహిర్గతం చేయకుండా నిలువరించే అధికారం కేంద్రానికి దఖలుపడిందని విపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.