అనంతపురం ఎడ్యుకేషన్: ఇన్నాళ్లూ వేసవి సెలవుల్లో ఆటపాటలతో సరదాగా గడిపిన చిన్నారులంతా నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. మంగళవారం పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో విద్యార్థులు కూడా నూతనోత్సాహంతో ఉన్నారు. కాకపోతే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇప్పటికే యూనిఫాంతో పాటు ఆయా విద్యా సంస్థలు పుస్తకాలు సరఫరా చేశాయి. దీంతో వారంతా పాఠశాల తొలిరోజే యూనిఫాంతో సీతాకొక చిలుకల్లా పరుగులు తీసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంతవరకూ పాఠ్య పుస్తకాలు సిద్ధం చేయలేదు. యూనీఫాం ఊసే లేదు. మరోవైపు ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు వెక్కిరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యల నడుమ బడిగంట మోగనుంది.
మౌలిక సదుపాయాలు కరువు
జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న పాఠశాలలు 5,034 ఉన్నాయి. వీటిలో 3043 ప్రాథమిక, 1003 ప్రాథమికోన్నత, 988 ఉన్నత పాఠశాలలున్నాయి. జిల్లాలోని అన్నిపాఠశాలల్లో 5,61,495 మంది పిల్లలు చదువుతున్నారు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేవు. తాగునీరు, మరుగుదొడ్ల సమస్య విద్యార్థులను వెంటాడుతోంది. ముఖ్యంగా విద్యార్థినులు మరుగుదొడ్ల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి సెలవుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ఈ ఇబ్బందులు ఉండేవి కావు. ప్రభుత్వ చర్యలు తీసుకోకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ప్రస్తుతం దాదాపు ప్రతి పాఠశాలలోనూ మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే నిర్వహణ లేక సగం స్కూళ్లలో పని చేయడం లేదు.
అంతంత మాత్రంగానే పాఠ్య పుస్తకాలు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూళ్లు తెరిచే నాటికి పంపిణీ చేసేందుకు ఆయా స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు సిద్ధంగా ఉంచాలి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి రాష్ట్రస్థాయిలోనే ఆలస్యం జరుగుతోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తెలుగు, కన్నడ, ఉర్దూ మీడియం 1–10 తరగతుల విద్యార్థులకు సుమారు 23,80,250 పాఠ్యపుస్తకాలు అవసరం. మిగులుస్టాకు 2,74,621 పుస్తకాలు ఉన్నాయి. ఇవిపోను 21,05,629 పుస్తకాలు అవసరం. ఇటీవల మిగులుస్టాకు మాత్రం కొన్ని మండలాలకు పంపారు. ముద్రణా సంస్థ నుంచి ఇప్పటిదాకా ఆశించినస్థాయిలో పాఠ్యపుస్తకాలు రాలేదు. పూర్తిస్థాయిలో జిల్లాకు చేరి ఇక్కడి నుంచి మండల పాయింట్లకు అక్కడి నుంచి పాఠశాలలకు వెళ్లేలోపు ఎన్ని రోజులవుతుందో ఎవరికీ తెలియడం లేదు.
యూనీఫాం ఇప్పట్లో లేనట్లే
ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న పిల్లలకు ఉచితంగా ఇచ్చే యూనిఫాం ఇప్పట్లో అందేలా లేదు. జిల్లాలో 3,844 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో సుమారు 2,99,632 మంది విద్యార్థులు 1–8 తరగతుల విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల ప్రకారం 5,99,264 జతల యూనిఫాం అవసరం. స్కూళ్లు ప్రారంభం నాటికి పిల్లలకు యూనిఫాం అందజేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పిన మాటలు ఆచరణకు నోచుకోవడం లేదు. యూనిఫాం రెడీ చేసే బాధ్యతను రాష్ట్రస్థాయిలోనే ఆప్కోకు అప్పగించిన అధికారులు... ఇప్పటిదాకా రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. దీంతో యూనిఫాం విద్యార్థులకు అందేలోపు నెలలు పట్టే అవకాశముందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment