సరెండర్‌తో పాటు సస్పెన్షన్
► డీఈఓ, ఏడీపై స్కూల్ డెరైక్టర్‌కు
►కలెక్టర్ సిఫార్సు అధికారుల సస్పెన్షన్‌తో విద్యాశాఖలో కలకలం
► కార్యాలయానికి పలువురి డుమ్మా
ఆర్వీఎం పీఓకుఅదనపు బాధ్యతలురాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న నరసారెడ్డికి ఇన్‌చార్జి డీఈఓ అదనపు బాధ్యతలను కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
నెల్లూరు(టౌన్): డీఈఓ ఆంజనేయులు, ఏడీ విజయను సరెండర్ చేసి సస్పెండ్ చేయాలంటూ స్కూల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్‌కు కలెక్టర్ జానకి సిఫార్సు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, సీనియర్ అసిస్టెంట్లు రాజేంద్రప్రసాద్, రామాచంద్, వింజమూరు శ్రీనివాసులును సస్పెండ్ చేయడంతో ఆ శాఖలో కలకలం రేగింది. జిల్లాలో ఒకే శాఖలో ఆరుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి.
అధికారులపై చర్యలు తీసుకోవడంతో శుక్రవారం పలువురు ఉద్యోగులు కార్యాలయానికి డుమ్మా కొట్టారు. విధులకు హాజరైన ఉద్యోగులు కూడా అంతంతమాత్రంగానే పని చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. విద్యాశాఖలో పని కావాలంటే ఫైల్ కింద డబ్బులు పెట్టనిదే చేయరని పలు పాఠశాలల యజమానులు ఆరోపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
అనుమసముద్రంపేట మండలం గుంపర్లపాడు హైస్కూల్లో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌గా ఇంగిలాల పవన్‌కుమార్ పనిచేస్తున్నారు. పవన్‌కుమార్ మొదటి భార్య ఆత్మహత్య చేసుకుందని పలువురు పేర్కొంటున్నారు. అనంతరం రెండో వివాహం చేసుకోగా, ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై 2014 ఆగస్ట్ 29న సీసీ నంబర్ 161 / 2014 కింద ఏఎస్‌పేటలో కేసు నమోదు చేశారు. ఆమె బంధువులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అదే ఏడాది సెప్టెంబర్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పవన్‌కుమార్‌పై కేసు నమోదు కావడంతో అప్పటి కలెక్టర్ శ్రీకాంత్ ఆయన్ను సస్పెండ్ చేసి మేజిస్టీరియల్ విచారణ జరపాలంటూ ఆత్మకూరు ఆర్డీఓను ఆదేశించారు. విచారణ చేపట్టిన ఆర్డీఓ అదనపు కట్నం కోసం వేధించిన కారణంగానే మృతిచెందిందని నివేదిక పంపారు.
ఆ సమయంలో కలెక్టర్‌గా ఉన్న జానకి 2015 జూన్ 23న విధుల నుంచి ఉపాధ్యాయుడు పవన్‌కుమార్‌ను తొలగించాలని డీఈఓకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తన సస్పెన్షన్‌ను ఎత్తేసేందుకు అధికార పార్టీ నాయకుల నుంచి కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. దీంతో పాటు ఈ నెల ఆరో తేదీన గ్రీవెన్స్‌డేలో కలెక్టర్‌ను కలిసి తన సస్పెన్షన్‌ను ఎత్తేయాలని మొరపెట్టుకున్నట్లు తెలిసింది.
లోపాలను కప్పిపుచ్చుకునేందుకు యత్నం
పవన్‌కుమార్‌కు సంబంధించిన ఫైల్‌ను తన ముందు ఉంచాలంటూ కలెక్టర్ ఆదేశించడం తో విద్యాశాఖాధికారులు తమ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు యత్నాలు ప్రారంభించారు. మే 28నే విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఫైల్‌ను కలెక్టర్ ముందు ఉంచడంతో విద్యాశాఖాధికారుల తప్పులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు విధుల నుంచి తొలగించని పవన్‌కుమార్‌ను గత నెల్లో ఏ విధంగా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డీఈఓ, ఏడీ ని సరెండర్ చేయడంతో పాటు సస్పెండ్ చేయాలని స్కూల్ డెరైక్టర్‌కు సిఫార్సు చేశా రు. కార్యాలయంలో పనిచేస్తున్న సూపరిం టెండెంట్, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లపై వేటు వేశారు.