న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రమాదపుటంచుల్లో ఉంది. ఢిల్లీని కాలుష్య కారక స్మాగ్ (పొగ+కాలుష్యం) ముంచెత్తింది. దీంతో కాలుష్య అత్యవసర స్థితిని ప్రకటించాల్సిన ప్రమాదకర స్థాయికి ఢిల్లీ కాలుష్యం చేరింది. కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెల్లడించిన వాయు నాణ్యత సూచీ ప్రకారం 500 పాయింట్ల (గరిష్టం) స్కేల్‌లో కాలుష్యం ఇప్పటికే 487 పాయింట్లు దాటింది. మరో 48 గంటల్లో ఈ సూచీ 500 యూనిట్లకు చేరే ప్రమాదం కనిపిస్తోంది. రెండ్రోజులుగా ప్రజాజీవనానికి ఇబ్బంది కలిగించే రీతిలో పెరిగిన వాయు కాలుష్యం.. బుధవారం మరింత ప్రమాదకర స్థితికి చేరింది. ఈ కాలుష్యం ధాటికి శ్వాస, హృద్రోగ సంబంధింత సమస్యలున్నవారు తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు మాస్కులు, ఎయిర్ ప్యూరిఫయర్ల వాడకంపై దృష్టిపెట్టారు. నగరంలో పాఠశాలలకు ఆదివారం వరకు సెలవులు ప్రకటిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు, పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకూ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై పలు వాహనాలు పొగమంచు కారణంగా ఢీకొనగా 22 మందికి గాయాలయ్యాయి. అటు, పంజాబ్‌లో మంచు కారణంగా ఓ ట్రక్కు దూసుకెళ్లటంతో 9మంది విద్యార్థులు దుర్మరణం చెందారు.
వైపరీత్యానికి అడుగుదూరంలో..
ప్రస్తుత పరిస్థితి కొనసాగి 48 గంటల్లో కాలుష్య సూచీ 500 పాయింట్లు దాటితే.. సరి–బేసి (కారు నెంబర్లు) విధానం, నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లో నిర్మాణాలు, భవనాల కూల్చివేతపై నిషేధం తక్షణమే అమల్లోకి రానుంది. దీని వల్ల ఆరోగ్యంగా ఉన్న వారు అనారోగ్యం పాలవుతుండగా.. ఇప్పటికే వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ప్రమాదకర స్థాయిలో పీఎం 2.5, పీఎం10
భూ వాతావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో పీఎం 2.5 తీవ్రత క్యూబిక్ మీటర్‌కు 420 మైక్రో గ్రాములు, పీఎం10 తీవ్రత క్యూబిక్ మీటర్‌కు 678 మైక్రోగ్రాములున్నట్లు వెల్లడైంది. ఢిల్లీలో స్మాగ్ (కాలుష్యం, పొగమంచు కలిపి) ఒక ప్రాంతానికే పరిమితం కాలేదని.. నగరంతోపాటు ఎన్సీఆర్ ప్రాంతంలో దట్టంగా వ్యాపించిందని మంత్రిత్వశాఖ అధికారి మాధవన్ రాజీవన్ వెల్లడించారు. పంజాబ్, హరియాణాల నుంచి నవంబర్ 6 రాత్రి నుంచి హఠాత్తుగా కాలుష్యంతో కూడిన పొగ వ్యాపించటంతోనే ఈ విపత్కర పరిస్థితులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీతోపాటుగా ఫరీదాబాద్, ఘజియాబాద్, గురుగావ్, నోయిడాల్లోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి.
ఆదివారం వరకు స్కూళ్లు బంద్
ప్రమాదకరస్థితికి చేరుతున్న వాతావరణంతో ఢిల్లీలోని అన్ని పాఠశాలలు ఆదివారం వరకు మూసే ఉంచాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. అనారోగ్యంతో బాధపడుతున్నవారు, చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యామంత్రి మనీశ్ సిసోడియా సూచించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. ‘ప్రజారోగ్య ఎమర్జెన్సీ’ ప్రకటించింది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని క్లాసురూముల్లో కాకుండా ఇతర ఔట్‌డోర్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా స్కూలు యాజమాన్యాలను ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరింది. కాగా, హస్తినలో వాతావరణ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సమన్వయంతో పనిచేద్దామని పంజాబ్, హరియాణాల సీఎంలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖలు రాశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రైతులు పంటవ్యర్థాలను కాల్చేయటం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆ లేఖల్లో పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో పరిస్థితిని మాస్కులు, ఎయిర్ ప్యూరిఫయర్లతో సమర్థవంతంగా ఎదుర్కొనలేమని ఏయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా పేర్కొన్నారు.
పొగమంచుకు తొమ్మిది ప్రాణాలు బలి
చండీగఢ్: పంజాబ్‌లో దట్టమైన పొగమంచు తొమ్మిది ప్రాణాలను బలితీసుకుంది. బతిండా–చండీగఢ్ హైవేపై దారి కనిపించకపోవటంతో ఓ సిమెంట్ మిక్సర్ లారీ రోడ్డుపక్కన నిల్చున్న 14మంది విద్యార్థుల పైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బతిండా జిల్లాలో ఉదయం కాలేజీలకు వెళ్లేందుకు కొందరు విద్యార్థులు ఓ బస్సెక్కారు. వీరెక్కిన బస్సు పొగమంచు కారణంగానే వేరే బస్సును ఢీకొంది. దీంతో వీరంతా వేరే బస్సు ఎక్కేందుకు రోడ్డు పక్కన నిలబడ్డారు. అటుగా వస్తున్న సిమెంట్ కాంక్రీటు లారీ డ్రైవరుకు దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డుపైనున్న విద్యార్థులు కనిపించకపోవటంతో వారిపైనుంచే వాహనాన్ని పోనిచ్చాడు. అయితే మరికొందరు విద్యార్థులు ప్రమాదాన్ని పసిగట్టి పక్కకు దూకేయటంతో ప్రాణాలు దక్కించుకున్నారు. రెండు బస్సులు ఢీకొనటం, తర్వాత లారీ వీరిపైనుంచి వెళ్లిన ఘటనలన్నీ కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే జరిగాయని పోలీసులు తెలిపారు. ఇక్కడికి సమీపంలోని ఫ్లైఓవర్‌పై దాదాపు పది వాహనాలు స్వల్పం గా ప్రమాదానికి గురైనట్లు పేర్కొన్నారు.
ఢిల్లీలో పొల్యూషన్ ఎమర్జెన్సీ!
Published Thu, Nov 9 2017 1:21 AM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment