ఆరో తరగతి విద్యార్థిని హత్య
మృతదేహాన్ని పూడ్చిపెట్టిన వైనం
గొంతు కోసుకుని నిందితుడి ఆత్మహత్యాయత్నం
చెన్నై: చెన్నైలో ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతి హత్య ఘటన మరువక ముందే, ఆరో తరగతి విద్యార్థి ఓ కిరాతకుడి చేతిలో హతమైంది. మంగళవారం ఈ ఘటన మానామధురై సమీపంలో కలకలం రేపింది.శివగంగై జిల్లా మానామధురై సమీపంలోని గణపతి తలవాయి గ్రామానికి చెందిన కరుప్పయ్య, జయ దంపతులకు కాళేశ్వరి(11) అనే కుమార్తె ఉంది.
కరుప్పయ్య ఇటీవల మరణించడంతో కుమార్తె కాళేశ్వరితో కలిసి జయ నివసిస్తుంది. మేలనట్టూరులోని ప్రభుత్వ పాఠశాలలో కాళేశ్వరి ఆరో తరగతి చదువుతున్నది. సోమవారం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన కాళేశ్వరి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన జయ ఇరుగు పొరుగు వారిని విచారించింది.
పాఠశాల పరిసరాల్లో ఆరా తీయగా, కార్తీక్(25) అనే వ్యక్తి కాళేశ్వరిని మోటారు సైకిల్‌పై ఎక్కించుకు వెళ్లినట్టు తెలిసింది. తన ఇంటికి సమీపంలో నివసిస్తున్న కార్తీక్ కోసం కుటుంబీకుల వద్ద జయ ఆరా తీసింది. వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. చివరకు అతడి సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసింది. దీంతో కాళేశ్వరి గొంతు కోసి హత్య చేశానని, ఆమెను పూడ్చి పెట్టి, తాను చచ్చిపోతున్నట్టు సమాధానం ఇచ్చి కార్తీక్ ఫోన్ కట్ చేశాడు.
దాంతో తీవ్ర ఆందోళనకు గురైన జయ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన మానా మధురై పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మేలనట్టూరు గ్రామానికి సమీపంలోని చెరువు గట్టు వద్ద కార్తీక్ గొంతు కోసుకుని కొన ఊపిరితో ఉండడాన్ని పోలీసులు గుర్తించారు.
అతడిని చికిత్స నిమిత్తం శివగంగై ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా పోలీసులు కాళేశ్వరిని పూడ్చి పెట్టిన ప్రదేశం కోసం గాలించారు. చివరకు మంగళవారం వేకువ జామున నాలుగున్నర గంటల సమయంలో ఆ స్థలాన్ని గుర్తించారు.
ఖననం చేయబడ్డ కాళేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానామధురై ఆసుపత్రికి తరలించారు. కార్తీక్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు స్పృహలోకి వస్తే గానీ, ఈ ఘాతుకం వెనుక గల కారణాలు తెలియరావని మానా మధురై పోలీసు ఉన్నతాధికారి వనిత వెల్లడించారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని జయ బంధువులు భావిస్తున్నారు.