పోటెత్తుతున్న ప్రాణహిత,ఇంద్రావతి, సీలేరు, తాలిపేరు,కిన్నెరసాని, శబరి ఉప నదులు
భద్రాచలం వద్ద 50.20 అడుగులు దాటిన నీటి మట్టం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం దాకా ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవాహం
నేడు వరద మరింత పెరిగే అవకాశం..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్‌వర్క్: పరీవాహక ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వానలు, పోటెత్తుతున్న ఉప నదులు కలసి దిగువ గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం బరాజ్ వరకు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ గోదావరిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్వల్పంగా 20 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. దానికి దిగువన కడెం ప్రాజెక్టు నుంచి, వాగుల నుంచి వస్తున్న వరదలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం కొనసాగుతోంది.
అయితే దాని దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ఉప నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ (లక్షి్మ) బరాజ్‌కు 9,54,130 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ ప్రవాహానికి ఇతర ఉప నదులు, వాగులు కలసి.. తుపాకులగూడెం (సమ్మక్క), దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బరాజ్‌ల వద్ద మరింత ఎక్కువగా ప్రవాహాలు నమోదవుతున్నాయి.
అర్ధరాత్రి 12 గంటలకు 50.20 అడుగులుగా...
భద్రాచలం వద్దకు వచ్చేసరికి గోదావరి ఉగ్ర రూపం దాల్చు తోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో 50.20 అడుగుల నీటిమట్టంతో 13 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది. భద్రాచలం నుంచి వెళ్తున్న నీరంతా పోలవరం, ధవళేశ్వరం మీదుగా సముద్రంలోకి వెళ్లిపోతోంది.
వరద ప్రమాదకర స్థాయికి పెరిగే చాన్స్
మధ్య గోదావరి సబ్ బేసిన్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో సోమవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ నీళ్లన్నీ గోదావరిలోకి చేరేందుకు ఒక రోజు పడుతుంది. దీంతో మంగళవారం కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకూ గోదావరిలో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరవచ్చని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. భద్రాచలం వద్ద వరద 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే మంగళవారం ఉదయానికల్లా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన
ములుగు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సోమవారం పర్యటించారు. ఏటూరునాగారం మండలంలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి నది, సామాజిక ఆస్పత్రిని, పలు వరద ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
5 రోజుల్లో 200 టీఎంసీలు సముద్రం పాలు
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురిసిన వానలతో గోదావరి నది పోటెత్తుతోంది. కొన్ని నెలలుగా సరిగా వానల్లేక, నీటికి కటకటతో ఇబ్బందిపడగా.. ఇప్పుడు భారీగా వరదలు వస్తున్నాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ గేట్లన్నీ ఎత్తేయడం, నీటి ఎత్తిపోతలు చేపట్టకపోవడంతో నీళ్లన్నీ వృధాగా వెళ్లిపోతున్నాయి. మరోవైపు ఎగువ గోదావరిలో పెద్దగా ప్రవాహాలు లేక ఎల్లంపల్లిలోకి నీటి చేరిక మెల్లగా కొనసాగుతోంది.
మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేస్తే.. అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లిని నింపుకొని, అక్కడి నుంచి మిడ్‌మానేరు, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్ తదితర రిజర్వాయర్లను నింపుకొనే అవకాశం ఉండేదని రైతులు అంటున్నారు. కానీ గోదావరి నీటిని ఒడిసిపట్టే పరిస్థితి లేక వరద అంతా సముద్రం పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారుల అంచనా ప్రకారం.. గోదావరిలో ఈ నెల 17 నుంచి సోమవారం సాయంత్రం వరకు 200 టీఎంసీల మేర నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్లిపోయాయి. ఎగువ నుంచి నీళ్లు రాక, కాళేశ్వరం లిఫ్టింగ్ లేక.. ఈసారి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ తదితర రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు నీటి సరఫరా కష్టమేనన్న చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment