kaleswari
-
ఉగ్ర గోదావరి
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: పరీవాహక ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వానలు, పోటెత్తుతున్న ఉప నదులు కలసి దిగువ గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం బరాజ్ వరకు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ గోదావరిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్వల్పంగా 20 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. దానికి దిగువన కడెం ప్రాజెక్టు నుంచి, వాగుల నుంచి వస్తున్న వరదలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం కొనసాగుతోంది.అయితే దాని దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ఉప నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ (లక్షి్మ) బరాజ్‌కు 9,54,130 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ ప్రవాహానికి ఇతర ఉప నదులు, వాగులు కలసి.. తుపాకులగూడెం (సమ్మక్క), దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బరాజ్‌ల వద్ద మరింత ఎక్కువగా ప్రవాహాలు నమోదవుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు 50.20 అడుగులుగా...భద్రాచలం వద్దకు వచ్చేసరికి గోదావరి ఉగ్ర రూపం దాల్చు తోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో 50.20 అడుగుల నీటిమట్టంతో 13 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది. భద్రాచలం నుంచి వెళ్తున్న నీరంతా పోలవరం, ధవళేశ్వరం మీదుగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. వరద ప్రమాదకర స్థాయికి పెరిగే చాన్స్ మధ్య గోదావరి సబ్ బేసిన్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో సోమవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ నీళ్లన్నీ గోదావరిలోకి చేరేందుకు ఒక రోజు పడుతుంది. దీంతో మంగళవారం కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకూ గోదావరిలో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరవచ్చని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. భద్రాచలం వద్ద వరద 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే మంగళవారం ఉదయానికల్లా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన ములుగు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సోమవారం పర్యటించారు. ఏటూరునాగారం మండలంలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి నది, సామాజిక ఆస్పత్రిని, పలు వరద ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.5 రోజుల్లో 200 టీఎంసీలు సముద్రం పాలుమహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురిసిన వానలతో గోదావరి నది పోటెత్తుతోంది. కొన్ని నెలలుగా సరిగా వానల్లేక, నీటికి కటకటతో ఇబ్బందిపడగా.. ఇప్పుడు భారీగా వరదలు వస్తున్నాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ గేట్లన్నీ ఎత్తేయడం, నీటి ఎత్తిపోతలు చేపట్టకపోవడంతో నీళ్లన్నీ వృధాగా వెళ్లిపోతున్నాయి. మరోవైపు ఎగువ గోదావరిలో పెద్దగా ప్రవాహాలు లేక ఎల్లంపల్లిలోకి నీటి చేరిక మెల్లగా కొనసాగుతోంది.మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేస్తే.. అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లిని నింపుకొని, అక్కడి నుంచి మిడ్‌మానేరు, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్ తదితర రిజర్వాయర్లను నింపుకొనే అవకాశం ఉండేదని రైతులు అంటున్నారు. కానీ గోదావరి నీటిని ఒడిసిపట్టే పరిస్థితి లేక వరద అంతా సముద్రం పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారుల అంచనా ప్రకారం.. గోదావరిలో ఈ నెల 17 నుంచి సోమవారం సాయంత్రం వరకు 200 టీఎంసీల మేర నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్లిపోయాయి. ఎగువ నుంచి నీళ్లు రాక, కాళేశ్వరం లిఫ్టింగ్ లేక.. ఈసారి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ తదితర రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు నీటి సరఫరా కష్టమేనన్న చర్చ జరుగుతోంది. -
‘సాగు’తో తొలి అడుగు!
సాక్షి, హైదరాబాద్: రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కె.చంద్రశేఖర్‌రావు తొలి అధికారిక సమీక్షను సాగునీటి ప్రాజెక్టులతో ఆరంభించనున్నారు. శనివారం ఉదయం ప్రగతిభవన్‌లో కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాలపై సమీక్షించనున్నారు. సమీక్షకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శితోపాటు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ప్రాజెక్టుల పరిధిలోని పనుల పురోగతి, అవాంతరాలు, కోర్టు కేసులు, అవసరమయ్యే బడ్జెట్ వంటి అంశాలపై చర్చించనున్నారు. కాళేశ్వరంపై ఫోకస్.. గోదావరిలో రాష్ట్రానికి ఉన్న నిర్ణీత వాటా నీటిని వినియోగంలోకి తెచ్చే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులు ముగింపుదశకు వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో మొత్తంగా 85 గేట్లు అమర్చాల్సి ఉండగా, ఇందులో ఇప్పటికే 6 గేట్లను అమర్చారు. ఇక్కడి పంప్‌హౌస్‌లో 3 మోటా ర్లు అమర్చారు. అన్నారం బ్యారేజీలో 66, సుందిళ్లలో 74 గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తయింది. అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌ల పరిధిలో రెండేసి మోటార్లు అమర్చే ప్రక్రియను పూర్తి చేశారు.ట్రయల్‌రన్‌కు అంతా సిద్ధం చేసినా, గ్రావిటీ కెనాల్లో పనులకు ఆటంకం కలుగుతుందని నిలిపివేశారు. దీనిపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశముంది. ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6, 8లోని మోటార్లు సిద్ధంగా ఉన్నా, ప్యాకేజీ–7లో టన్నెల్లో లైనింగ్పనులు జరుగుతున్నాయి. ఈ పనుల పూర్తిపై సీఎం లక్ష్యాలను విధించనున్నా రు. వచ్చే మార్చి నాటికి ట్రయల్‌రన్ పూర్తి చేసి, జూన్‌లో ఖరీఫ్ మొదలయ్యే నాటికి మేడిగడ్డ నుంచి గోదావరి నీటిని ఎల్లంపల్లి దిగువకు తరలించే ప్రణా ళికలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రాజెక్టు కోసం అవసరమయ్యే నిధులపై అధికారులు వివరా లు సిద్ధం చేశారు. ప్రాజెక్టుకు రూ.33 వేల కోట్ల మేర రుణాలు అవసరమని లెక్కించగా, ఇందులో ఇప్పటి కే వివిధ బ్యాంకుల నుంచి రూ.27,240 కోట్ల రుణా లు తీసుకున్నారు. వీటిలో ఇప్పటికే రూ.22,790 కోట్లు ఖర్చు పెట్టారు. మరో రూ.5,700 కోట్ల మేర రుణాలకు మాత్రమే అవకాశం ఉంది. మిగతా నిధులను ఎలా సమకూర్చుకోవాలన్న దానిపై సీఎం పలు సూచనలు చేసే అవకాశం ఉంది. సీతారామ ఎత్తిపోతల కింద 70.40 టీఎంసీలతో 7 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో పనులు చేపట్టినా అవి ముం దుకు కదల్లేదు. సీతారామ ప్రాజెక్టుకు ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే రూ.832 కోట్ల మేర నిధుల సేకరణ జరగ్గా, మున్ముందు అవసరమైన నిధులు, ఈ ప్రాజెక్టు పరిధిలో ఇంకా కేంద్ర సంస్థల నుంచి రావాల్సిన అనుమతులపై శనివారం నాటి భేటీలో చర్చించనున్నారు. -
తమిళనాడులో మరో ఘాతుకం
ఆరో తరగతి విద్యార్థిని హత్య మృతదేహాన్ని పూడ్చిపెట్టిన వైనం గొంతు కోసుకుని నిందితుడి ఆత్మహత్యాయత్నం చెన్నై: చెన్నైలో ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతి హత్య ఘటన మరువక ముందే, ఆరో తరగతి విద్యార్థి ఓ కిరాతకుడి చేతిలో హతమైంది. మంగళవారం ఈ ఘటన మానామధురై సమీపంలో కలకలం రేపింది.శివగంగై జిల్లా మానామధురై సమీపంలోని గణపతి తలవాయి గ్రామానికి చెందిన కరుప్పయ్య, జయ దంపతులకు కాళేశ్వరి(11) అనే కుమార్తె ఉంది. కరుప్పయ్య ఇటీవల మరణించడంతో కుమార్తె కాళేశ్వరితో కలిసి జయ నివసిస్తుంది. మేలనట్టూరులోని ప్రభుత్వ పాఠశాలలో కాళేశ్వరి ఆరో తరగతి చదువుతున్నది. సోమవారం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన కాళేశ్వరి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన జయ ఇరుగు పొరుగు వారిని విచారించింది. పాఠశాల పరిసరాల్లో ఆరా తీయగా, కార్తీక్(25) అనే వ్యక్తి కాళేశ్వరిని మోటారు సైకిల్‌పై ఎక్కించుకు వెళ్లినట్టు తెలిసింది. తన ఇంటికి సమీపంలో నివసిస్తున్న కార్తీక్ కోసం కుటుంబీకుల వద్ద జయ ఆరా తీసింది. వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. చివరకు అతడి సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసింది. దీంతో కాళేశ్వరి గొంతు కోసి హత్య చేశానని, ఆమెను పూడ్చి పెట్టి, తాను చచ్చిపోతున్నట్టు సమాధానం ఇచ్చి కార్తీక్ ఫోన్ కట్ చేశాడు. దాంతో తీవ్ర ఆందోళనకు గురైన జయ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన మానా మధురై పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మేలనట్టూరు గ్రామానికి సమీపంలోని చెరువు గట్టు వద్ద కార్తీక్ గొంతు కోసుకుని కొన ఊపిరితో ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అతడిని చికిత్స నిమిత్తం శివగంగై ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా పోలీసులు కాళేశ్వరిని పూడ్చి పెట్టిన ప్రదేశం కోసం గాలించారు. చివరకు మంగళవారం వేకువ జామున నాలుగున్నర గంటల సమయంలో ఆ స్థలాన్ని గుర్తించారు. ఖననం చేయబడ్డ కాళేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానామధురై ఆసుపత్రికి తరలించారు. కార్తీక్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు స్పృహలోకి వస్తే గానీ, ఈ ఘాతుకం వెనుక గల కారణాలు తెలియరావని మానా మధురై పోలీసు ఉన్నతాధికారి వనిత వెల్లడించారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని జయ బంధువులు భావిస్తున్నారు.