సాక్షి, హైదరాబాద్: రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కె.చంద్రశేఖర్‌రావు తొలి అధికారిక సమీక్షను సాగునీటి ప్రాజెక్టులతో ఆరంభించనున్నారు. శనివారం ఉదయం ప్రగతిభవన్‌లో కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాలపై సమీక్షించనున్నారు. సమీక్షకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శితోపాటు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ప్రాజెక్టుల పరిధిలోని పనుల పురోగతి, అవాంతరాలు, కోర్టు కేసులు, అవసరమయ్యే బడ్జెట్ వంటి అంశాలపై చర్చించనున్నారు.
కాళేశ్వరంపై ఫోకస్..
గోదావరిలో రాష్ట్రానికి ఉన్న నిర్ణీత వాటా నీటిని వినియోగంలోకి తెచ్చే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులు ముగింపుదశకు వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో మొత్తంగా 85 గేట్లు అమర్చాల్సి ఉండగా, ఇందులో ఇప్పటికే 6 గేట్లను అమర్చారు. ఇక్కడి పంప్‌హౌస్‌లో 3 మోటా ర్లు అమర్చారు. అన్నారం బ్యారేజీలో 66, సుందిళ్లలో 74 గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తయింది. అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌ల పరిధిలో రెండేసి మోటార్లు అమర్చే ప్రక్రియను పూర్తి చేశారు.ట్రయల్‌రన్‌కు అంతా సిద్ధం చేసినా, గ్రావిటీ కెనాల్‌లో పనులకు ఆటంకం కలుగుతుందని నిలిపివేశారు.
దీనిపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశముంది. ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6, 8లోని మోటార్లు సిద్ధంగా ఉన్నా, ప్యాకేజీ–7లో టన్నెల్‌లో లైనింగ్‌పనులు జరుగుతున్నాయి. ఈ పనుల పూర్తిపై సీఎం లక్ష్యాలను విధించనున్నా రు. వచ్చే మార్చి నాటికి ట్రయల్‌రన్ పూర్తి చేసి, జూన్‌లో ఖరీఫ్ మొదలయ్యే నాటికి మేడిగడ్డ నుంచి గోదావరి నీటిని ఎల్లంపల్లి దిగువకు తరలించే ప్రణా ళికలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రాజెక్టు కోసం అవసరమయ్యే నిధులపై అధికారులు వివరా లు సిద్ధం చేశారు. ప్రాజెక్టుకు రూ.33 వేల కోట్ల మేర రుణాలు అవసరమని లెక్కించగా, ఇందులో ఇప్పటి కే వివిధ బ్యాంకుల నుంచి రూ.27,240 కోట్ల రుణా లు తీసుకున్నారు.
వీటిలో ఇప్పటికే రూ.22,790 కోట్లు ఖర్చు పెట్టారు. మరో రూ.5,700 కోట్ల మేర రుణాలకు మాత్రమే అవకాశం ఉంది. మిగతా నిధులను ఎలా సమకూర్చుకోవాలన్న దానిపై సీఎం పలు సూచనలు చేసే అవకాశం ఉంది. సీతారామ ఎత్తిపోతల కింద 70.40 టీఎంసీలతో 7 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో పనులు చేపట్టినా అవి ముం దుకు కదల్లేదు. సీతారామ ప్రాజెక్టుకు ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే రూ.832 కోట్ల మేర నిధుల సేకరణ జరగ్గా, మున్ముందు అవసరమైన నిధులు, ఈ ప్రాజెక్టు పరిధిలో ఇంకా కేంద్ర సంస్థల నుంచి రావాల్సిన అనుమతులపై శనివారం నాటి భేటీలో చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment