
నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర మధ్య నైజీరియాలో హఠాత్తుగా రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోయింది. తరగతులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 22 మంది విద్యార్థులు మృతి చెందగా, 100 మందికి పైగా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారని తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసుకువచ్చేందుకు రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.
బుసా బుజి కమ్యూనిటీలోని సెయింట్స్ అకాడమీ కాలేజీలో తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికే పాఠశాల భవనం కుప్పకూలింది. ప్రమాదం బారినపడినవారిలో 15 ఏళ్లలోపు విద్యార్థులు ఉన్నారు. శిథిలాల్లో మొత్తం 154 మంది విద్యార్థులు చిక్కుకుపోయారని, 132 మందిని రక్షించామని పోలీసు అధికార ప్రతినిధి ఆల్ఫ్రెడ్ అలబో తెలిపారు. వీరంతా ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు మృతి చెందారు.
నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. పాఠశాల నిర్మాణం బలహీనంగా ఉండడం, నది ఒడ్డున ఉండడం వల్లే ఈ ఘటన జరిగివుంటుందని అధికారులు అంటున్నారు. ప్రమాదం సంగతి తెలియగానే గ్రామస్తులు ముందుకు వచ్చి, సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి విద్యార్థులను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బందికి సహకారం అందించారు. ఆఫ్రికాలోని అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో భవనాలు తరచూ కూలిపోతుండటం గమనార్హం. గత రెండేళ్లలో ఇలాంటి పలు ఘటనలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment