పన్యా తండాలో నిరూపయోగంగా పాఠశాల భవనం
- నిరూపయోగంగా స్కూలు భవనాలు
- అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలు
- పట్టించుకోని అధికారులు
రామాయంపేట: నిరూపయోగంగా ఉన్న పాఠశాలల భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. మండలంలోని కాట్రియాల పన్యా తండా, రామాయంపేట ఎక్కల దేవుని బండ వద్ద ప్రభుత్వ పాఠశాలలను గతంలోనే ఎత్తివేయడంతో సదరు భవనాలు నిరూపయోగంగా ఉన్నాయి. కొందరు వ్యక్తులు వీటిని అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారు. పిల్లలు రావడంలేదనే ఉద్దేశంతో పన్య తండాలో ఎనిమిదేళ్ల క్రితం, ఎక్కల దేవుని బండ వడ్డెర కాలనీ వద్ద మూడేళ్ల క్రితమే స్కూళ్లు మూతపడ్డాయి.
ఈ భవనాలను ఇతర అవసరాలకు వినియోగించాల్సి ఉండగా, ఆయా పంచాయతీలు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో వృథాగా పడి ఉన్నాయి. ఈ భవనాలు రోజురోజుకు శిథిలావస్థకు చేరుతున్నాయి. వీటిని ఇతర అవసరాలకు వినియోగించాలని రెండు గ్రామాల వారు కోరుతున్నారు. మహిళా సంఘాల నిర్వహణకు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.