హోమ్‌వర్క్‌ ఎవరికి కష్టం? | Analysis On School Activity And Students Home Work | Sakshi
Sakshi News home page

హోమ్‌వర్క్‌ ఎవరికి కష్టం?

Published Wed, Jul 3 2024 8:19 AM | Last Updated on Wed, Jul 3 2024 8:19 AM

Analysis On School Activity And Students Home Work

‘పిల్లలు హోమ్‌వర్క్‌ చేయరు.. తల్లిదండ్రులే చేస్తారు.. ఇది తెలిసీ టీచర్లు హోమ్‌వర్క్‌ ఇవ్వడంలో అర్థం లేదు’ అని ఒక భారతీయ తల్లి విడుదల చేసిన వీడియో చర్చ లేవదీసింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే జపాన్‌ తల్లిదండ్రులు వారంలో రెండున్నర గంటలే పిల్లల హోమ్‌వర్క్‌కు కేటాయిస్తుంటే భారతీయులు వారానికి 12 గంటలు కేటాయిస్తున్నారు. కొందరు ఇది భారం అంటున్నా పిల్లలకు హోమ్‌వర్క్‌ లేకపోతే కలత పడే తల్లిదండ్రులే మన దగ్గర ఎక్కువ. హోమ్‌వర్క్‌ మంచి–చెడు...

‘పిల్లలు హోమ్‌వర్క్‌ చేయరనీ తల్లిదండ్రులే దానిని పూర్తి చేస్తారని టీచర్లకు తెలుసు. అయినా సరే వారు  హాలిడే హోమ్‌వర్క్‌ ఇస్తారు. పిల్లలు హాలిడే ఎంజాయ్‌ చేస్తుంటే తల్లిదండ్రులు మాత్రం గంపెడు హోమ్‌వర్క్‌ను ముందేసుకుని కూచోవాల్సి వస్తోంది. ఇక మీదటైనా పిల్లలు సొంతగా ఎంత హోమ్‌వర్క్‌ చేయగలరో అంతే ఇవ్వండి’ అని ఒక తల్లి చేసిన వీడియో ఇన్‌స్టాలో జూన్‌ 30న విడుదలైంది. ఈ వీడియోకు చాలామంది స్పందిస్తున్నారు.

‘ఎనిమిదవ తరగతి వచ్చే వరకు పిల్లలకు హోమ్‌వర్క్‌ ఇవ్వరాదు’ అని ఒకరంటే ‘అవును. టీచర్లు మరీ అన్యాయంగా ఉన్నారు. రెండో తరగతి చదువుతున్న మా అబ్బాయిని మానవ శరీరంలోని భాగాలను గీసుకు రమ్మని చె΄్పారు’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘నేను వేసవి సెలవుల్లో మా అమ్మాయి హోమ్‌వర్క్‌ను పూర్తి చేయడమే సరిపోయింది’ అని మరొక తల్లి అంది. ‘ఇది మరీ విడ్డూరం. తల్లిదండ్రులకు పిల్లలతో సమయం గడిపే వీలు ఉండటం లేదు. వారితో సమయం గడిపే వీలు హోమ్‌వర్క్‌ ఇస్తుంది. పిల్లలతో కూచుని సరదాగా ఎంజాయ్‌ చేస్తూ చదివించాలి. హోమ్‌వర్క్‌ చేయించాలి’ అని మరొక తల్లి అంది.

మన దేశంలోనే..
హోమ్‌వర్క్‌ ఇవ్వడం, తల్లిదండ్రులు పిల్లలతో కూచుని సాయం పట్టడం ప్రతి దేశంలో ఉంది. అయితే మనంత మాత్రం లేదు. హోమ్‌వర్క్‌కు తల్లిదండ్రులు ఎంత సమయం వెచ్చిస్తున్నారని 29 దేశాల్లో అధ్యయనం చేస్తే చిట్టచివరి స్థానంలో జపాన్‌ రెండున్నర గంటలతో నిలిస్తే భారత్‌ మొదటిస్థానంలో 12 గంటలతో నిలిచింది.

అమెరికాలో ఆరు గంటలు,  చైనాలో ఏడు గంటలు, ఫ్రాన్స్‌లో నాలుగు గంటలు తల్లిదండ్రులు వెచ్చిస్తున్నారు. అయితే అన్నీ దేశాల్లోని తల్లిదండ్రులు ప్రభుత్వ/ఉచిత బడులలో అందే విద్య మీద విశ్వాసం కనపరచలేదు. అంటే డబ్బు కట్టి చదివించడం, మళ్లీ స్కూల్లో చెప్పే చదువు మీద నమ్మకం లేక తామే చదివించడం, అందుకు హోమ్‌వర్క్‌ను ఒక మార్గంగా ఎంచుకోవడం అన్నీ దేశాల్లో ఉన్నా మన దేశంలో అత్యధికంగా ఉంది.

బండెడు హోమ్‌వర్క్‌..
పిల్లలకు ఎంత ఎక్కువ హోమ్‌వర్క్‌ ఇస్తే అది అంతమంచి స్కూల్‌ అనే అభి్రపాయం చాలామంది తల్లిదండ్రుల్లో ఉంది. పిల్లలు స్కూల్‌ నుంచి ఇంటికొచ్చాక ఆడుకుంటూ ఉంటే వారు సమయం వృ«థా చేస్తున్నారని, హోమ్‌వర్క్‌ చేస్తూ ఉంటే కనుక బుద్ధిమంతులని అనుకోవడం దాదాపు అందరు తల్లిదండ్రుల్లో ఉంది. ‘మన దేశంలో చదువు ద్వారా వచ్చే ఉద్యోగాల గురించే తల్లిదండ్రుల బెంగ. అందుకే స్కూల్లో, ఇంట్లో చదువు గురించి ఒత్తిడి తెస్తారు.

దీనివల్ల పిల్లల్లో సహజంగా ఉంటే కళాభిరుచి, క్రీడాప్రతిభ, ఇతర టాలెంట్లు నశించిపోతున్నాయి’ అని కొందరు నిపుణులు అంటున్నారు. ‘హోమ్‌వర్క్‌ అనేది క్వాలిటేటివ్‌గా ఉండాలి. ‘క్వాంటిటేటివ్‌గా కాదు. చదివిన పాఠాల గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవడం గురించి హోమ్‌వర్క్‌ ఉండాలి కాని గుడ్డిగా సమయం వెచ్చించేలా ఉండకూడదు’ అని నిపుణులు అంటున్నారు.

ఏది... ఎంత?
హోమ్‌వర్క్‌లు పిల్లలకు అధికమైనా దానివల్ల తల్లిదండ్రుల సమయం అవసరానికి మించి ఇవ్వాల్సి వచ్చినా ఆ తీరును నిరోధించాల్సిందే. హోమ్‌వర్క్‌లు బడిలో చదివింది మరింత బాగా అర్థం చేయించేలా ఉండాలి... అలాగే తల్లిదండ్రుల ధోరణి ఆ పాఠాలు పిల్లలకు ఏ మాత్రం అర్థమయ్యాయో చూసి అర్థం చేయించడంలో సాయం పట్టేలా ఉండాలి. ఇక ్రపాజెక్ట్‌ వర్క్‌ లాంటివి పిల్లలతో పాటు తల్లిదండ్రుకూ ఆటవిడుపుగా ఉండాలి.

నిజానికి కుదురు లేని పిల్లలు తల్లిదండ్రుల పక్కన సమయం చేసుకుని కూచోడానికి ఒక మంచి సాధనం హోమ్‌వర్క్‌. ఆ వంకతో తల్లిదండ్రులు పిల్లలతో కూచోవాలి. వారు ఎలా చదువుతున్నారు, క్లాస్‌రూముల్లో ఏం జరుగుతోంది, ఏ విషయాలకు సంతృప్తిగా ఉన్నారు... ఏ విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి, ఏ సబ్జెక్ట్‌లు వారికి ఇష్టం, కష్టంగా ఉన్నాయి... ఇవన్నీ తెలుసుకోవడానికి హోమ్‌వర్క్‌ సమయం సాయం చేస్తుంది.

హోమ్‌వర్క్‌ ఒక తప్పనిసరి భారం చేస్తే దాని నుంచి తప్పించుకోవడానికి ఇంటి నుంచి పారిపోవాలని చూసిన పిల్లలూ ఉన్నారు. అలాగే పిల్లలకు సాయం చేయడానికి సమయంలేక వారి మీద చికాకు పడి ఇంట్లో అశాంతి రేపే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ పీటీఎమ్‌లలో టీచర్లతో చర్చిస్తూ హోమ్‌వర్క్‌ సమయాలను విజ్ఞాన, వినోదదాయకంగా పిల్లలతో గడిపే క్వాలిటీ సమయాలుగా మార్చుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

‘మన దేశంలో చదువు ద్వారా వచ్చే ఉద్యోగాల గురించే తల్లిదండ్రుల బెంగ. అందుకే స్కూల్లో, ఇంట్లో చదువు గురించి ఒత్తిడి తెస్తారు. దీనివల్ల పిల్లల్లో సహజంగా ఉంటే కళాభిరుచి, క్రీడాప్రతిభ, ఇతర టాలెంట్లు నశించిపోతున్నాయి’ అని కొందరు నిపుణులు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement