పిల్లలూ గుర్తుందా!? వేసవి సెలవులు అయిపోవచ్చాయి..! | Funday Special Cover Story Commemorating The Re-Opening Of Children's Schools | Sakshi
Sakshi News home page

బడికి పోదాం.. చలో చలో! బ్యాగు సర్దాం.. హలో హలో!!

Published Sun, Jun 9 2024 8:23 AM | Last Updated on Sun, Jun 9 2024 1:32 PM

Funday Special Cover Story Commemorating The Re-Opening Of Children's Schools

వేసవి సెలవులు అయిపోవచ్చాయి. స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి. మళ్లీ తరగతి గదులు,  ట్యూషన్లు, హోమ్‌ వర్కులు ఇలా పిల్లల్లో హంగామా మొదలైపోయింది. యూనిఫామ్, టెక్స్‌›్టబుక్స్‌ ఇలా అన్నీ మారుతుంటాయి. ఇదంతా పిల్లల తల్లిదండ్రులకు కూడా పరీక్షే! కొత్త స్కూల్‌ బ్యాగ్‌ కొనడం దగ్గర నుంచి కొత్త పుస్తకాలకు అట్టలు వేయడం వరకూ ప్రతి పనీ పేరెంట్స్‌కి హైరానా కలిగిస్తుంది. అయితే పిల్లల్లో పాత ఫ్రెండ్స్‌ని కలుసుకుంటున్నామని, కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారని, క్లాస్‌ రూమ్‌ మారబోతుందని, కొత్త పాఠాలు నేర్చుకోబోతున్నామని ఇలా మిశ్రమ భావోద్వేగాలు తొంగి చూస్తుంటాయి.

అయితే పిల్లలు తిరిగి స్కూల్‌ వాతావరణానికి అలవాటు పడాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు. పిల్లలు స్కూల్లో ఏది బాగా తింటారు? బాక్సుల్లో ఏం పెట్టాలి? వీటి గురించి కూడా దృష్టి పెట్టాలి. మొదటిసారి స్కూల్‌కి వెళ్తున్న పిల్లల విషయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలి? ఆల్‌రెడీ స్కూల్‌ అలవాటున్న పిల్లలను హాలిడేస్‌ మూడ్‌ నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? అవన్నీ ఇప్పుడు చూద్దాం.

మొదటిసారి స్కూల్‌కి పంపుతున్నారా..?
ప్రీస్కూల్, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీల్లో పిల్లల్ని జాయిన్‌ చేసేటప్పుడు వారిని పేరెంట్స్‌ చాలా ప్రిపేర్‌ చేయాల్సి ఉంటుంది. కొంతమంది పిల్లలు ఈ మార్పును ఆనందంగా అంగీకరిస్తారు. కానీ మరికొందరికి అలవాటు పడటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. పిల్లల ఎడ్యుకేషన్‌ స్టార్ట్‌ అయ్యిందంటే తల్లిదండ్రులకు టెన్షన్ ్స మొదలైపోయినట్లే! మరి దానిని సులభం చేయడానికి ఈ చిట్కాలను పాటిస్తే మంచిది.

  • చిన్నచిన్న పిల్లలకు స్కూల్‌ ఎలా ఉంటుందో చూపించడానికి ’టాయ్‌ స్కూల్‌’ని తయారు చెయ్యాలి. బొమ్మలతో చిన్న నమూనా పాఠశాలను ఏర్పాటు చెయ్యాలి. మామూలుగా  పాఠశాల రోజున ఏమి జరుగుతుందనే దాని గురించి చిన్నగా మాట్లాడుతూనే వారితో కలిసి ఆడుకోవాలి.

  • పాఠశాల ప్రారంభానికి ముందు పిల్లలకు వీలయినన్ని ఎక్కువ  పుస్తకాలను చదివి వినిపించాలి. లేదా వారితో చదివించాలి. పిల్లలు వారి కొత్త పాఠశాలలో చేయగలిగే సంగతులు గురించి చర్చించాలి. వారు కలుసుకోబోయే స్నేహితులు, అక్కడుండే వినోదం గురించి మాట్లాడుతూ ఉండాలి.

  • క్లాస్‌ రూముల్లో పిల్లలు స్వయంగా చెయ్యగలిగే పనులను ఇంట్లో ఉన్నప్పటి నుంచే చక్కగా ప్రాక్టీస్‌ చేయించాలి. లంచ్‌ బాక్స్, జ్యూస్‌ లేదా వాటర్‌ బాటిల్‌ మూతలు తెరవడం, తిరిగి మూతలు పెట్టడం.. తమంతట తామే షూస్‌ తియ్యడం, తిరిగి తొడుక్కోవడం, స్పూన్‌తో అన్నం తినడం ఇలాంటి సాధారణ పనులను నేర్పించాలి.

  • స్కూల్లో ఏదైనా విషయం గురించి పిల్లలు ఇబ్బంది పడితే ఆ విషయం గురించి టీచర్‌కి ఎలా చెప్పాలి? ఎలా పర్మిషన్‌ అడగాలి? వంటివి కూడా అలవాటు 
    చెయ్యాలి.

  • స్కూల్‌ ప్రారంభమయ్యే ముందురోజుల్లో పిల్లలను తీసుకుని షాపింగ్‌ వెళ్తే మంచిది. ఆ షాపింగ్‌లో వాళ్లకు నచ్చిన స్కూల్‌ బ్యాగ్, పెన్సిల్‌ కేస్, యూనిఫాం, లంచ్‌ బాక్స్, వాటర్‌ బాటిల్‌ ఇలా అన్నీ కొనిస్తే వారిలో ఉత్సాహం 
    పెరుగుతుంది.

  • ఇక చిన్నారులను స్కూల్‌కి పంపించే నాటికి స్వయంగా టాయిలెట్‌కి వెళ్లగలరా లేదా నిర్ధారించుకోవాలి. లేదంటే కనీసం టాయిలెట్‌ వస్తుందని టీచర్‌కి చెప్పడం అయినా నేర్పించాలి.

  • చిన్న పిల్లలకు షేరింగ్‌ కూడా అలవాటు చెయ్యాలి. స్కూల్లో ఇతర పిల్లల దగ్గర లాక్కోకుండా ఉండటంతో పాటు పక్కపిల్లలకు తమ దగ్గరున్నది షేర్‌ చేసే విధానం నేర్పాలి. స్కూల్లో ఏదైనా పంచిపెడుతున్నప్పుడు తమ వంతు వచ్చే వరకూ వేచి చూడటం గురించి వివరించాలి. దాని వల్ల పిల్లలకు స్నేహితులు పెరుగుతారు.

  • ఇక స్కూల్లో జాయిన్‌ అయిన తర్వాత కూడా పిల్లలతో కలిసి పేరెంట్స్‌ పాఠశాలకు వెళ్లడం, స్కూల్‌ దగ్గర ఆగి ప్లే గ్రౌండ్‌ని పరిశీలించడం, వారి క్లాస్‌ టీచర్‌తో, ఇతర విద్యార్థులతో మాట్లాడటం మంచిది. ఆ సమయంలోనే పిల్లలకు వారి తరగతి గదిలో ఏది బాగా నచ్చుతుందో తెలుసుకోవచ్చు.

  • పాఠశాలలో మొదటి రోజు ఒత్తిడి లేకుండా పిల్లలను సిద్ధం చేయడానికి స్కూల్‌ తెరిచే ముందే మీ పిల్లల తరగతిలో జాయిన్‌ కాబోతున్న ఇతర పిల్లలకు మీ పిల్లలను పరిచయం చెయ్యాలి. అవసరం అయితే ఆ విద్యార్థి కుటుంబాన్ని కలుసుకోవాలి. దాని వల్ల స్కూల్‌లో జాయిన్‌ అయిన రోజు క్లాసులో మీ పిల్లలకు తెలిసి వ్యక్తి ఒకరైనా ఉంటారు. దాంతో ఆ స్కూల్‌ తమకు తెలియని చోటు అనే బెరుకు తగ్గుతుంది.

  • కొద్ది సమయం పాటు మీ నుంచి దూరంగా ఉండేలా వారికి ముందే అలవాటు చెయ్యాలి. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు లేదా మీరు విశ్వసించే పెద్దవారితో మీరు లేకపోయినా మీ పిల్లలు కలిసి ఉండేలా చూసుకోవాలి.

పై తరగతులకు వెళ్లే పిల్లల కోసం..

  • చదువులో కాస్త డల్‌గా ఉండి టీచర్స్‌కి భయపడే పిల్లలకు స్కూల్స్‌ ప్రారంభం అంటే కాస్త బెరుకు ఉంటుంది. అలాంటి పిల్లలతో పేరెంట్స్‌ మనసు విప్పి మాట్లాడాలి. వారిలో మానసిక ధైర్యాన్ని కలిగించాలి.

  • పిల్లలు మొదటిరోజు కోసం ఎదురుచూడటంలో సానుకూల అంశాల గురించి పేరెంట్స్‌ చర్చించాలి. వారి పాత ఫ్రెండ్స్‌ని గుర్తు చేస్తూ, కొత్త ఫ్రెండ్స్‌ వస్తే ఎలా కలుస్తారో తెలుసుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడాలి.

  • పిల్లలు స్కూల్‌కి నడిచి వెళ్తున్నా, బస్సు లేదా ఆటోలో ప్రయాణిస్తున్నా వారితో పాటు ఉండే వారి స్నేహితుల్ని పరిచయం చేసుకోవడం మంచిది. మొదటిరోజు మాత్రం వీలైతే స్వయంగా స్కూల్లో డ్రాప్‌ చేసి పికప్‌ చేసుకోవడం మంచిది. వారిలోని ఒత్తిడికి దూరం చేసినట్లు అవుతుంది.

  • కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు నుంచే స్కూల్‌ షెడ్యూల్‌ని బట్టి వారి నిద్ర వేళలను నిర్ణయించి, అలానే నిద్రపోయేలా చెయ్యాలి. సరైన నిద్ర అందకపోతే స్కూల్లో వారు యాక్టివ్‌గా ఉండలేరు. అలాగే వారికి స్నానం చేయించడం, స్కూల్‌కి రెడీ చేయించడం, స్కూల్‌ నుంచి రాగానే స్కూల్లో సంగతులు అడిగి తెలుసుకోవడం, అవసరం అయితే వారి ఆలోచనలను సరిచేయడం, హోమ్‌ వర్క్‌ చేయించడం వంటి పనుల్లో వారి కోసం సమయాన్ని కేటాయించాలి. అలాగే పిల్లలు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంటిని వీలైనంత నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి.

  • పిల్లలు స్కూల్‌కి వెళ్లే దారిల్లో ఏ షాపులు ఎక్కడ ఉన్నాయి? ఎటు వెళ్తే స్కూల్‌ వస్తుంది? అలాగే స్కూల్‌ నుంచి ఇంటికి ఏయే దారుల్లో రావచ్చు.. అవన్నీ ప్రాక్టీస్‌ చేయించాలి. వారితో కూడా వెళ్తున్నప్పుడు వారినే దారి చెప్పమని అడగటం, లేదంటే ఇంట్లో కూర్చోబెట్టి ఆ దారి గురించి చర్చించడం లాంటివి చెయ్యాలి. అలా చేయడం వల్ల వారు ప్రమాదంలో పడినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినా క్షేమంగా ఇంటికి చేరుకోగలరు.

  • బస్సులు లేదా ఆటోలు ఎక్కుతున్నప్పుడు ఆగి దిగాలని, నిదానంగా ఎక్కాలని పిల్లలకు సూచించాలి. అలాగే పిల్లల్ని తీసుకెళ్లే డ్రైవర్‌తో కూడా పిల్లలను ఓ కంట కనిపెట్టమని చెబుతుండాలి. మీ పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? ఎలా కూర్చుంటారు? అన్నీ డ్రైవర్‌ని ఆరా తియ్యాలి.

  • అలాగే స్కూల్‌కి వెళ్తున్న పిల్లలకు రోడ్డు దాటే సమయాల్లో ఇరువైపులా చూసుకోవడం నేర్పించాలి. ఏవైనా వాహనాలు వస్తుంటే పక్కకు ఆగి, అవి వెళ్లిన తర్వాతే నడవడం గురించి చెప్పాలి. ఇవన్నీ దగ్గరుండి ప్రాక్టీస్‌ చెయ్యించాలి.

  • ఏది తిన్నా రోడ్డు మీద ఆరుబయట తినొద్దని, ఇంటికి తెచ్చుకునైనా, లేదా స్కూల్లోనైనా తినాలని చెప్పాలి. అలాగే చేతులు కడుక్కున్న తర్వాతే తినడం అలవాటు చెయ్యాలి. లేదంటే అలర్జీలు, జలుబులు వస్తుంటాయని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.

  • పిల్లల్లో ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దాని గురించి ముందుగానే ఆ స్కూల్‌ టీచర్స్‌తో, ఆయాలతో వివరంగా చెప్పి అత్యవసర పరిస్థితిల్లో సమాచారం ఇవ్వమనాలి.

  • ఇక స్కూల్‌కి సైకిల్‌ మీద వెళ్లే పిల్లల(టీనేజ్‌ వారు) విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. రద్దీప్రదేశాల్లో వెళ్తుంటే హెల్మెట్‌ తప్పసరి ధరించేలా చూడాలి.

  • అపరిచితులు ఇచ్చిన ఆహారం తినొద్దని పిల్లలకు చెప్పడంతో పాటు తింటే దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి చెప్పాలి. అవసరమైతే కొన్ని ఉదాహరణలను వివరించాలి. అపరిచితులు పిల్లలను కిడ్నాప్‌ చేస్తారని.. తిరిగి ఇంటికి రాకుండా తీసుకునిపోతారని డైరెక్ట్‌గా చెప్పకుండా.. కొన్ని పేర్లు ఊహించి చెబుతూ.. ఓ కథ రూపంలో వారికి చెబుతుండాలి. అలా చేస్తే వారి మనసుల్లో నాటుకునిపోతుంది.

  • పిల్లలు స్కూల్లో లేదా బయట లేదా బస్సుల్లో ఏవైనా బెదిరింపులకు లోనవుతున్నా, ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్నా, అలాంటి విషయాలను ఎప్పటికప్పుడు గమనించు కుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ గురించి ఆడపిల్లలతో పాటు మగ పిల్లలకు కూడా చెప్పాల్సిందే. సమస్యను మీదకు తెచ్చుకోకుండా ఎలా ఉండాలో చెప్పడంతో పాటు సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడాలో కూడా నేర్పించాలి. ఒకవేళ ఇతర పిల్లలకు మీ పిల్లల వల్లే సమస్య ఏర్పడుతుంటే దాన్ని కూడా సున్నితంగానే తీసుకోవాలి. పిల్లల దూకుడు ప్రవర్తనకు కొన్ని పరిమితులు విధించి వారిని నెమ్మదిగా మార్చాలి.

  • హోమ్‌వర్క్‌ సమయంలో టీవీ లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులన్నింటినీ ఆపెయ్యాలి. పెద్దవారు అవుతున్న పిల్లల విషయంలో ఇంటర్నెట్‌ వినియోగాన్ని గమనిస్తూ ఉండాలి.

  • పిల్లల్లో కళ్లు, మెడ, తల అలసటకు గురవుతుంటే దాన్ని గుర్తించి, చదువుతున్నప్పుడు వారికి కాసేపు విరామం ఇస్తుండాలి. కనీసం ఒక పది నిమిషాలు వారికి నచ్చినట్లుగా ఉండనివ్వాలి.

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ రెసిపీలు..
పిల్లలు ఆకలికి ఎక్కువగా ఆగలేరు. పైగా బయట చూసిన తినుబండారాలను చూస్తే అసలు ఆగరు. అందుకే వారికి కావాల్సిన భోజనంతో పాటు స్నాక్స్‌ కూడా సిద్ధం చేసి బాక్సుల్లో పెట్టడం మంచిది. ఒకవేళ మధ్యాహ్నం భోజనాన్ని స్కూల్‌లో ఉచితంగా అందిస్తున్నా, ఇలాంటి స్నాక్స్‌ బాక్స్‌ల్లో పెడితే పిల్లలు దృఢంగా పెరుగుతారు. ఈజీగా సిద్ధమయ్యే కొన్ని రెసిపీస్‌ ఇప్పుడు చూద్దాం.

రాగి కుకీలు..
కావాల్సినవి..
రాగి పిండి– ఒకటిన్నర కప్పులు
ఏలకుల పొడి– అర టేబుల్‌ స్పూన్‌
గుడ్డు– 1
ఉప్పు– తగినంత
అల్లం పొడి– కొద్దిగా
కొబ్బరి పాలు, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ – పావు కప్పు చొప్పున

తయారీ..
ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. ఒక పాన్ లో రాగి పిండి, ఏలకుల పొడి వేసుకుని దోరగా వేయించాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి.. దానిలో గుడ్డు, అల్లం పొడి, రైస్‌ బ్రాన్‌ ఆయిల్, కొబ్బరి పాలు వేసుకుని మిక్సీ పట్టాలి. దాని వల్ల ఆ మిశ్రమం మొత్తం ముద్దలా మారిపోతుంది. అనంతరం కుకీస్‌లా చేసుకుని.. ఓవెన్ లో 180 డిగ్రీలసెల్సియస్‌లో.. 8 నిమిషాల పాటు బేక్‌ చేస్తే సరిపోతుంది.

ఓట్స్‌ ఇడ్లీ..
కావాల్సినవి..
ఓట్స్‌– 2 కప్పులు (దోరగా వేయించి, మిక్సీ పట్టుకోవాలి)
నూనె– అర టేబుల్‌ స్పూన్‌
మినప పొడి– 1 టేబుల్‌ స్పూన్‌
శనగపిండి– అర టేబుల్‌ స్పూన్‌
పెరుగు– 2 కప్పులు
పసుపు, కారం– కొద్దికొద్దిగా

తయారీ..
ముందుగా ఒక బౌల్‌లో ఓట్స్‌ పౌడర్, నూనె, మినప పొడి, శనగపిండి, పెరుగు వేసుకుని బాగా కలిపి.. అవసరం అయితే కొద్దిగా నీళ్లు పోసుకుని, ఇడ్లీ రేకుల్లో కొద్దికొద్దిగా వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. అభిరుచిని బట్టి ఇడ్లీ పిండిలో క్యారెట్‌ తురుము, కొత్తిమీర తురుము కూడా కలుపుకోవచ్చు.

ఖర్జూరం– జీడిపప్పు లడ్డూ..
కావాల్సినవి..
ఖర్జూరాలు, జీడిపప్పు– 1 కప్పు,
కొబ్బరి తురుము– అర కప్పు,
ఉప్పు– తగినంత,
నూనె– 1 టేబుల్‌ స్పూన్‌

తయారీ..
ముందు ఖర్జూరాలను ఒక గంట నీటిలో నానబెట్టి, గింజ తీసి.. ఆరబెట్టాలి. అనంతరం ఒక మిక్సీ బౌల్‌లో ఖర్జూరాలు, జీడిపప్పు, కొబ్బరి కోరు, తగినంత ఉప్పు, నూనె వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని, నేయి రాసుకున్న చేతులతో చిన్న చిన్న ఉండల్లా చేసుకోవచ్చు.

హెర్బ్‌డ్‌ పొటాటోస్‌..
కావాల్సినవి..
బంగాళదుంపలు– 2 పెద్దవి(తొక్క తీసి.. కడగాలి, వాటిని సన్నని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి),
ఆలివ్‌ నూనె– 1 టేబుల్‌ స్పూన్,
వెల్లుల్లి తురుము– కొద్దిగా
తులసి ఆకుల తురుము – కొద్దిగా(అభిరుచిని బట్టి),
చిల్లీ ఫ్లేక్స్‌– అర టేబుల్‌ స్పూన్‌
ఒరేగానో తురుము– 1 టేబుల్‌ స్పూన్‌ (మార్కెట్‌లో దొరుకుతుంది)
తేనె– 2 టేబుల్‌ స్పూన్లు
ఉప్పు– తగినంత

తయారీ..
ఒక బౌల్‌లో బంగాళాదుంప ముక్కలు వేసుకుని చిల్లీ ఫ్లేక్, ఆలివ్‌ నూనె, వెల్లుల్లి తురుము, తులసి ఆకుల తురుము, తేనె, ఒరేగానో తురుము ఇలా అన్నీ కలిపి గిన్నెను బాగా కుదపాలి. అనంతర వాటిని బేకింగ్‌ ట్రేలో పెట్టి.. 200 డిగ్రీల సెల్సియస్‌లో 10–15 నిమిషాలు బేక్‌ చేస్తే సరిపోతుంది.

స్టీమ్డ్‌ ధోక్లా..
కావాల్సినవి..
శనగపిండి – 1 కప్పు,
ఓట్స్, జొన్నపిండి – పావు కప్పు చొప్పున,
పంచదార – 1 టేబుల్‌ స్పూన్,
పసుపు–  1 టీస్పూన్,
నిమ్మరసం– 1 టేబుల్‌ స్పూన్,
ఉప్పు– తగినంత,
బేకింగ్‌ పౌడర్‌– 1 టేబుల్‌ స్పూన్‌
నీళ్లు–  సరిపడా,
నూనె– 1 టీ స్పూన్‌

తయారీ..
శనగపిండి, ఓట్స్, జొన్నపిండి, పంచదార, పసుపు, నిమ్మరసం, బేకింగ్‌ పౌడర్, నూనె వేసుకుని బాగా కలిపి.. కొద్దిగా ఉప్పు తగినంత నీళ్లు పోసుకుని బాగా మిక్స్‌ చెయ్యాలి. అనంతరం ఒక బౌల్‌ తీసుకుని దానిలో ఈ మిశ్రమాన్ని వేసుకుని ఆవిరిపై ఉడికించాలి. ఆవాలు, కొత్తిమీర తాళింపు వేసుకుని.. కొత్తి మీర చట్నీతో కలిపి బాక్స్‌లో పెడితే సరిపోతుంది.

మొత్తానికి పిల్లలకు నచ్చేవిధంగా, వారు మెచ్చే విధంగా స్కూల్‌కి పంపించగలిగితే వారి వ్యక్తిత్వ వికాసం బాగుంటుంది. వారిలో కొత్త ఉత్సాహం పొంగుకొస్తుంది. దాంతో వారు పెద్దల మాటను వినడంలో, శ్రద్ధగా చదవడంలో, వినయ విధేయలతో పెరగడంలో నంబర్‌ వన్‌ అవుతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement