ఈ ఏడాది ఏం చేయబోతున్నారు? న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏమిటి? ఈ ప్రశ్న చాలా కామన్. ఆ ప్రశ్న ఎదురయ్యేలోపు మీకో నిర్ణయం ఉండి ఉంటే మంచిదే. లేకపోతే ఇలా ఓ నిర్ణయం తీసుకోవచ్చేమో ఆలోచించండి!
మనదేశంలో మేధకు కొరతలేదు. విద్యావకాశాలకు కొదువ లేదు. కానీ ఈ రెండింటి మధ్య ఉన్న అంతరం అంతా ఇంతా కాదు. మేధకు విద్యావకాశం సులువుగా అందకపోవడమే మనదేశంలో చురుకైన పిల్లలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. మనచుట్టూ ఉండే కుటుంబాల్లో ఓ కుటుంబాన్ని చూద్దాం. నెలకు లక్షకు పైగా జీతం తీసుకునే ఓ కార్పొరేట్ ఉద్యోగి తన కొడుకు ఇంజనీరింగ్ సీటు కోసం లక్షల ఫీజు కట్టి కోచింగ్ ఇప్పిస్తుంటాడు. అయినప్పటికీ ఆ పిల్లాడు ఎంట్రన్స్ టెస్ట్‌లో ఏ యాభైవేల ర్యాంకుతోనో సరిపెట్టుకుంటాడు. కొడుకు సీటు కోసం డొనేషన్ కట్టడానికి సిద్ధమవుతుంటాడా తండ్రి.
అదే ఇంట్లో పాత్రలు కడిగి ఇంటిని శుభ్రం చేసే మహిళ కొడుకు ప్రభుత్వ కాలేజ్‌లో చదివి ఫ్రీ సీటు తెచ్చుకుంటాడు. కానీ ఆ సీటుకు కట్టాల్సిన కనీసపు ఫీజుకు కూడా డబ్బులేక ‘పిల్లాడిని ఏదో ఒక పనిలో పెట్టించండి’ అని ఆ మహిళ యజమాని ఎదుట నిలబడి దీనంగా అడగడమూ జరుగుతుంటుంది. ఇలాంటి క్షణంలో ‘కొంత ఉదారంగా’ ఆలోచించి ఆ పనిమనిషి పిల్లాడిని ఏదో ఒక పనిలో పెట్టించి సంతృప్తి పడడం కూడా ఎప్పుడూ జరిగేదే. సరిగ్గా ఆ క్షణంలోనే ‘మరింత ఉదారంగా’ ఆలోచిస్తే ఎలా ఉంటుంది? ఒక పిల్లాడి భవిష్యత్తుకు బంగారు బాట పడుతుంది. ఫ్రీ సీటుకు కట్టాల్సిన కనీసపు ఫీజు ఈ కార్పొరేట్ ఉద్యోగి కొడుకు చేసే అదనపు ఖర్చుకంటే తక్కువే ఉంటుంది.
చదవండి: పట్టులాంటి జుట్టుకోసం.. ఇవి కలిపి జుట్టుకి పట్టించండి..
ఆ మాత్రం ఖర్చు చేయగలిగిన ఆర్థిక స్థితి ఉన్నప్పుడు డొమెస్టిక్ హెల్పర్ పిల్లవాడిని పనిలో పెట్టించడం కంటే చదువుకు ఫీజు కట్టడమే సరైన ఉదారత అవుతుంది. మనం ఖర్చు చేసిన ఆ డబ్బు ఒక కుర్రాడి భవిష్యత్తుకు ఊతం అవుతుందంటే కలిగే సంతృప్తి చిన్నది కాదు. ఆలోచించండి. ఈ ఏడాది కనీసం ఒక్క విద్యార్థికైనా ఫీజు కట్టాలని నిర్ణయం తీసుకోండి. ఈ ఏడాది ఒక పట్టుచీర తగ్గించుకుంటే చాలు ఒక విద్యార్థికి విద్యాప్రదానం జరుగుతుంది. ఏడాదిలో నాలుగు టూర్లలో ఒక టూర్ తగ్గించుకుంటే చాలు ఒక విద్యార్థి అక్షరతోటలో విహారానికి రెక్కలు విచ్చుకుంటాయి.
చదవండి: శిథిలావస్థలో సావిత్రిబాయి పూలే పాఠశాల.. కొత్త కళను తీసుకువచ్చేందుకు
పెద్ద కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీగా పేద విద్యార్థులను చదివించడానికి ముందుకు వస్తున్నాయి. పెద్ద జీతాలు ఉండి పిల్లల బాధ్యతలు పూర్తయిన వాళ్లు ఒకరిద్దరు స్టూడెంట్స్‌ను ఎడ్యుకేషన్ అడాప్షన్ తీసుకుంటున్నారు. ఎగువ మధ్యతరగతి మహిళల్లో విద్యావంతులు, సామాజిక బాధ్యత భావించేవాళ్లు పేద విద్యార్థుల్లో చురుకైన వాళ్లను గుర్తించి వాళ్లకు పుస్తకాలు కొనిస్తున్నారు. కొంత మంది సంపన్న మహిళలు ఒక బృందంగా ఏర్పడి ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ కోర్సు కోసం మౌలిక వసతులు కల్పిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది. మనసులో ఆలోచన మెదిలితే ఆచరణకు బీజం పడుతుంది. అందుకే ఈ ఏడాది కనీసం ఒక విద్యార్థికి అయినా విద్యాప్రదానం చేద్దాం.
చదవండి: ప్రకృతి అంతా మీ చుట్టూ ఉన్నట్లే.. ఇల్లు సర్దండిలా..
Comments
Please login to add a commentAdd a comment