సాధారణంగా చాలామంది పిల్లలు ఆడుకోవడంలోనూ, ఫోన్‌లో వీడియోలు చూడటంలోనూ, వీడియో గేమ్‌లు లేదా ఆటలు ఆడుకోవడంలోనూ చూపినంత శ్రద్ధ చదువుకోవడంలో, హోంవర్క్ చేయడంలో చూపించరు. కొందరు సిసింద్రీలు మాత్రం హోం వర్క్ చేయడానికి మొండికేస్తుంటారు. అలాంటి గడుగ్గాయిలతో హోం వర్క్ చేయించడానికి తంటాలు పడలేక అదేదో మనమే చేసేస్తే పోలా... అనుకుని కొందరు పేరెంట్స్ పిల్లలకిచ్చిన హోమ్ వర్క్‌ను తామే చేసేస్తుంటారు. అయితే అది చాలా పొరపాటు. మీ చిన్నారి హోంవర్క్ చేయడానికి మొండికేస్తుంటే.. ఈ చిట్కాలు పాటించి చూడండి!
పని వాతావరణాన్ని సృష్టించండి..
పిల్లల చదువులో హోంవర్క్ కీలకమైన అంశం. ఇది క్లాస్ రూమ్ అభ్యాసాన్ని బలోపేతం చేస్తుంది, అధ్యయన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది, బాధ్యతను అలవాటు చేస్తుంది. అందువల్ల మీ పిల్లల హోమ్‌వర్క్‌ను మీరు చేయొద్దు. దానిబదులు వాళ్లు హోంవర్క్ చేయడానికి తగిన వాతావరణాన్ని సృష్టించండి. వారికి అవసరమైన పెన్నులు, బుక్స్, పేపర్స్, రిఫరెన్స్ మెటీరియల్స్ వంటివాటిని అందుబాటులో ఉంచండి. అప్పుడు వారే హోమ్‌వర్క్ చేయడానికి ఇష్టపడతారు.
దండించ వద్దు
సాధారణంగా చాలామంది పేరెంట్స్ చేసే పని.. పిల్లలు హోంవర్క్ చేయనని మొండికేస్తే తిట్టడం లేదా కొట్టడం. ఇలా చేస్తే పిల్లలు దారికి రారు సరికదా, మరింత మొండిగా తయారవుతారు కాబట్టి వారిని తిట్టి లేదా నాలుగు దెబ్బలు వేసి బలవంతానా హోం వర్క్ చేయించడానికి బదులు ప్రేమగా మాట్లాడుతూనే ఇంటి పని పూర్తి చేసేలా చూడటం చాలా మేలు చేస్తుంది.
అలవాటుగా మార్చేయండి!
చాలామంది పిల్లలు హోం వర్క్ అనగానే ఆడుకున్న తరవాత చేస్తాం, తిన్న తర్వాత చేస్తాం, పొద్దున్నే లేచి పూర్తి చేస్తాం.. అంటూ రకరకాల సాకులు చెబుతుంటారు. హోమ్ వర్క్‌ను వాయిదా చేయకుండా.. రోజూ ఒకే పద్ధతి ఫాలో అయ్యేలా తయారు చేయడం మంచిది. కొందరు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయడానికి ఇష్టపడుతుంటారు, కొందరు ఆడుకున్న తర్వాత హోం వర్క్ చేయాలనుకుంటారు. మీ పిల్లలకు నచ్చిన సమయంలోనే వర్క్ చేసుకునేలా సెట్ చేయండి. రోజూ దీనినే అనుసరిస్తుంటే అదే అలవాటుగా మారిపోతుంది.
తేలికవి ముందుగా...
స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అవగానే వాళ్లకు తినడానికి ఏమైనా పెట్టి ఆ రోజు స్కూల్‌లో జరిగిన విషయాల గురించి అడిగి తెలుసుకోండి. ఆ మాటల్లోనే హోం వర్క్ ఏమిచ్చారో కనుక్కోండి. తేలిగ్గా లేదా తక్కువగా ఉన్న వర్క్‌ని ముందుగా చేసేయమని చెప్పండి. కాస్త ఎక్కువ టైమ్ తీసుకునే పనులను మెల్లగా చేయించండి.
సాయం చేయండి కానీ... మీరు చేయద్దు!
పిల్లలు హోం వర్క్ చేయకపోతే రేపు బడికెళ్లగానే టీచర్లు కొడతారని కొంతమంది తల్లులే చేసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు హోం వర్క్ చేయడానికి ఆసక్తి చూపించరు. వాళ్లలో నేర్చుకునే శక్తి కూడా తగ్గుతుంది. వాళ్లకు సహాయం కావలిస్తే చేయాలి గానీ మీరు మాత్రం చేయవద్దు.
ఏ రోజుది ఆ రోజే!
హోమ్‌వర్క్ ఏమీ ఇవ్వకపోతే రీడింగ్ వర్క్ చేయించండి. ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకుంటే కలిగే లాభాల గురించి తెలియజెప్పి ఎప్పటి పాఠం అప్పుడు చదువుకునేలా చేయండి.
Comments
Please login to add a commentAdd a comment