సాక్షి, పెగడపల్లి: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆట స్థలాలు, వ్యాయామ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. మండలంలోని మెజార్టీ పాఠశాలల్లో ఈ రెండు సౌకర్యాలు లేక విద్యార్థులు వికాసానికి దూరమవుతున్నారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. బాల్యంలోనే దాన్ని వెలికితీస్తే వారిలో నైపుణ్యాలు మెరుగయ్యే అవకాశాలుంటాయి. కానీ ఆప్రతిభను తీసి ప్రోత్సహించే వారులేరు. విద్యార్థుల్లో దాగి ఉన్నా ప్రతిభను గుర్తించి వారిని ఆయా క్రీడల్లో సుశిక్షితులుగా చేయాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులపై ఉంటుంది. అందుకు అనుగుణంగా ఆట స్థలాలు కూడా ఉండలి. కానీ చాలా పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు, మైదానం లేక పోవడంతో వారికున్న ప్రతిభ మరుగున పడిపోవడమే కాకుండా చిన్నారులు ఆటలకు దూరమవుతున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి ఎక్కువ ఉంటుంది. వారిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది. వారికి తగిన శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దే వారులేరు. వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి తగిన శిక్షణ ఇస్తే మేము కూడా ఆటల్లో రాణిస్తామని విద్యార్థులు పేర్కొంటున్నారు. పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
మండలంలో ఒకే ఒక్కరు
మండలంలో 6 యూపీఎస్, 6 హైస్కూల్లున్నాయి. మండలంలోని నంచర్ల పాఠశాలలో మినహా మరెక్కడ వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. బతికపల్లి, పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులున్నా భర్తీ కావడం లేదు. గతంలో ఈపాఠశాలల్లో పని చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లి ఏళ్లు గడుస్తున్న వారి స్థానంలో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచన కూడా చేయడం లేదు. మిగితా పాఠశాలల్లో అసలు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల మంజూరు లేదు. పీఈటీల సమస్య ఇలా ఉంటే విద్యార్థులకు తెలిసిస ఆటలు ఆడుకుందామని ఉన్న అందుకు సరిపడు ఆటస్థలం కరువైంది. అన్ని పాఠశాలల్లో ఆట స్థలాలు ఏర్పాటు చేసి విద్యార్థులు క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మండలంలోని బతికపల్లి, నంచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్న వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రతి ఏటా సంబంధిత అధికారులను ఈవిషయమై కోరుతున్నా ఎవ్వరు పట్టించుకోవడం లేదని ఆయా పాఠశాలల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వసతులు కల్పించాలి
ఆటలు ఆడాలని ఉన్నా స్థలంతో పాటు సరైన శిక్షణ లేక క్రీడల్లో రాణించ లేక పోతున్నాం. సరైన శిక్షణ ఉంటే జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణిస్తాం. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభను వెలికి తీయాలి. చాలా చోట్ల పాఠశాలల్లో ప్లే గ్రౌండ్ లేదు. గ్రౌండ్ స్థలం కేటాయించి వసతులు కల్పించాలి.
– రాగళ్ల హరీశ్ బతికపల్లి
ప్రోత్సాహం కరువు
ఆటలు ఆడేందుకు ఆసక్తి ఉన్నా ఆడించే వారులేరు. దీనికితోడు మైదానం కూడా లేదు. ఆటల్లో ప్రోత్సాహం కరవైంది. క్రీడలకు కావాల్సిన వసతులు లేక క్రీడల్లో రాణించలేక పోతున్నాం. ఫలితంగా ఆటలకు దూరమవుతున్నాం. మాకు వ్యాయామ ఉపాధ్యాయుడు, మైదానం ఏర్పాటు చేయాలి.
– రాజ్‌కుమార్ 10వ, తరగతి పెగడపల్లి
సమాచారం సేకరిస్తున్నాం
పాఠశాలల్లో మైదానాలు ఏర్పాటు, పీఈటీల నియామకంపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. యూడైస్ నివేదిక ఆధారంగా హెచ్‌ఎంల ద్వారా పాఠశాలల్లో పూర్తి సమాచారం సేకరిస్తున్నాం. ఆటస్థలం, పీఈటీల కొరతపై వివరాలు యూడైస్ నివేదికలో చేర్చుతాం.
– శ్రీనివాస్, ఎంఈవో
Comments
Please login to add a commentAdd a comment