
ఒడిషాలో ఏడుగురు టీచర్లపై కేసు
పిల్లలను కంటికిరెప్పలా చూసుకొని విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే నీచానికి ఒడిగట్టారు.
కోరాపుట్ (ఒడిశా): పిల్లలను కంటికిరెప్పలా చూసుకొని విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే నీచానికి ఒడిగట్టారు. ఓ ప్రైవేటు స్కూల్‌లో 15 మంది విద్యార్థినులపై ఏడుగురు ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఒడిశా కోరాపూట్ జిల్లాలోని దామన్‌జోడీలో జరిగిన ఈ ఘటనలో నిందితులైన ఏడుగురు ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దామన్‌జోడిలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్న విద్యార్థినుల నుంచి ఫిర్యాదులు రావడంతో జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజాశ్రీ దాస్ ఈ అంశంపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఏడో తరగతి, తొమ్మిదో తరగతి విద్యార్థులు తమపై ఏడుగురు టీచర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. తరగతి గదిలో, లైబ్రరీలో, పాఠశాల ఆవరణలో తమ పట్ల వారు అసభ్యంగా ప్రవర్తించారని అధికారికి తెలిపారు. నిందితులైన ఏడుగురు ఉపాధ్యాయులను వారు గుర్తించారు. దీంతో జిల్లా అధికారుల ఆదేశం మేరకు దామన్ జోడి పోలీసులు నిందితులపై కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు.