నిందితుడిని కోర్టుకు తరలిస్తున్న పోలీసులు
జయపురం (ఒరిస్సా): స్థానిక సమితిలో భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం జరిపిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ఫరారీలో ఉన్నాడు. పట్టుబడిన వ్యక్తి జయపురం సమితి కుములిపుట్ పంచాయతీ కుములిపుట్ ప్రాంతానికి చెందిన మీణా హరిజన్‌గా గుర్తించారు. దీనికి సంబంధించి ఎస్‌డీపీఓ అరూప్‌అభిషేక్ బెహరా వివరాలను బుధవారం వెల్లడించారు. ఘటనపై కాంగ్రెస్, బీజేపీ సహా ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేయడంతో దోషులను పట్టుకొనేందుకు ఎస్‌డీపీఓ నేతృత్వంలో పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.
పాడువ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవిలో ఒక నిందితుడు ఉన్నట్లు సమాచారం అందింది. హుటాహుటిని అక్కడికి చేరుకున్న పోలీసులు.. చాకచక్యంగా హరిజన్‌ను అరెస్టు చేశారు. అతడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 10 కేసులు ఉన్నాయని తెలిపారు. జయపురం సదర్ పోలీసు స్టేషన్‌లో 4 కేసులు, పట్టణ పోలీసు స్టేషన్‌లో 5 కేసులు, కొరాపుట్ సదర్ పరిధిలో ఒక కేసు ఉన్నట్లు వివరించారు. పట్టుబడిన వ్యక్తిని కోర్టుకు తరలించారు. రెండో నిందితుడి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment