శంషాబాద్ రూరల్: బోనాల పండగ పేరుతో ఉపాధ్యాయులు పాఠశాలకు సెలవు ప్రకటించి తాళం వేశారు. వివరాలు.. మండల పరిధిలోని ననాజీపూర్లో ఆది, సోమవారాల్లో బోనాలు నిర్వహించారు. అయితే మంగళవారం కూడా గ్రామంలో బోనాల పండగ ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు. గ్రామంలో ఎలాంటి పండగ లేకున్నా పాఠశాలను మూసివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మాదిరిగా తొండుపల్లిలో కూడా పాఠశాలను మూసి వేయడంపై స్థానిక సర్పంచ్ రత్నం అసహనం వ్యక్తం చేశారు. రెండు చోట్ల పాఠశాలను మూసివేస్తున్నట్లు తమకు సమాచారం లేదని సర్పంచులు శ్రీలత, రత్నం చెప్పారు. ఈ విషయమై ఏఈఓ రాంరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా.. బోనాల పండగను పురష్కరించుకుని పాఠశాలల్లో ఐచ్చిక సెలవులు తీసుకున్నారని చెప్పారు.