
ఉపాధ్యాయుడి దాడిలో గాయపడిన విద్యార్థి
వైఎస్‌ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : ర్యాంకుల కోసం కార్పొరేట్ పాఠశాలల్లో పెడుతున్న ఒత్తిడికి ఎంతో మంది విద్యార్థులు బలవుతున్నా వారిలో మార్పు రావడం లేదు. ఇదే కోవలో మార్కులు తక్కువగా వచ్చాయన్న కారణంతో ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు విచక్షణా రహితంగా దాడి చేయగా ... విషయాన్ని ప్రిన్సిపల్‌కు తెలిపేందుకు వెళ్ళిన విద్యార్థిపై ప్రిన్సిపల్ సైతం చేయిచేసుకున్నాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో బంధువులతో కలిసి వచ్చి పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. మంగళవారం పట్టణంలోని నారాయణ స్కూల్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబం«ధించి వివరాల్లోకి వెళితే.. స్థానిక విద్యానగర్‌కు చెందిన డి.రమణ, రత్నమ్మల కుమారుడైన డి.వెంకటసాయి తెలుగుగంగకాలనీరోడ్డులోని నారాయణ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఓ సబ్జెక్టులో వెంకటసాయికి మార్కులు తక్కువ వచ్చాయి. దీనిపై ఉపాధ్యాయుడు సాయికుమార్ అందరిలో నిలబెట్టి దూషిస్తుండటంతో మీరే మార్కులు తక్కువ వేశారంటూ సదరు ఉపాధ్యాయుడిని ఆ విద్యార్థి ప్రశ్నించాడు.
దీంతో కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో పాటు కడుపు భాగంలో కాలితో కూడా తన్నినట్లు విద్యార్థి ఆరోపిస్తున్నాడు. ఇదే విషయంపై ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేస్తానని ప్రిన్సిపల్ రూముకు వెళ్లగా చెప్పేది వినకుండానే ప్రిన్సిపల్ కూడా తనపై చేయిచేసుకున్నట్లు విద్యార్థి తెలిపాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుల తీరును నిరసిస్తూ ఆందోళనను నిర్వహించారు. తప్పు చేసినా, చదువులో వెనుకబడినా కొట్టడంలో తప్పులేదని, అలా కాకుండా అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ కాలితో తన్నుకుంటూ బయటకు తీసుకురావడం ఏమిటని, ఉపాధ్యాయులుగా కాకుండా వీధిరౌడీలుగా ప్రవర్తించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంతలో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థితో, పాఠశాల యాజమాన్యంతో వేరువేరుగా మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని తెలపడంతో విద్యార్థి తల్లిదండ్రులు వెళ్లి అర్బన్ స్టేషన్‌లో ఉపాధ్యాయుడిపై, ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment