కుంభకోణం కేసులో దోషులకు ఊరట
కుంభకోణం కేసులో దోషులకు ఊరట
Published Fri, Aug 11 2017 12:09 PM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
చెన్నై: కుంభకోణం స్కూల్ పిల్లల సజీవ దహనం కేసులో దోషులకు ఊరట లభించింది. ఏడుగురి శిక్షలను రద్దు చేస్తూ గురువారం మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. మరో ఇద్దరికి విధించిన శిక్షలను జరిమానా రూపంలోకి మారుస్తూ ఆదేశాలు జారీచేసింది. కేసులో మొత్తం 21 మంది నిందితుల పేర్లను పోలీసులు ఛార్జీషీటులో చేర్చగా, జూలై 11, 2014న దిగువ న్యాయస్థానం 11 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ.. మిగతావారికి శిక్షలు ఖరారు చేసింది. పాఠశాల వ్యవస్థాపకుడు పులవార్ పళనీస్వామికి జీవితఖైదు, ఆయన భార్య సరస్వతికి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. సుమారు 13 ఏళ్లపాటు జరిగిన వాద, ప్రతివాదనల అనంతరం వంటమనిషి వాసంతికి మాత్రం శిక్షను ఖరారుచేస్తూ.. మిగతా 9మందిని మద్రాస్ హైకోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది.
'గుండెలు బద్ధలయిపోతున్నాయి. మా పిల్లల్ని పొట్టనబెట్టుకున్న హంతకులకు న్యాయస్థానం స్వేచ్ఛగా బయటకు వదిలేసింది. చనిపోయిన పిల్లల వయసు ఐదు నుంచి తొమ్మిదేళ్ల లోపలే వాళ్లే. ప్రభుత్వం దీనిపై అప్పీల్‌కు వెళ్తుంద'ని ఆశిస్తున్నట్టు ఆ ఘటనలో చనిపోయిన ఓ పిల్లాడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తంజావూర్ జిల్లాలోని కుంభకోణంలో జూలై 16, 2004న కృష్ణమూర్తి పాఠశాలలో వంటగదిలో అగ్నిప్రమాదం చెలరేగి పాఠశాల మొత్తానికి వ్యాపించింది. స్కూల్ మొత్తానికి ఒకే ద్వారం ఉండటంతో గందరగోళం నెలకొని 94 మంది విద్యార్థులు, ఒక టీచర్ సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పాఠశాలల భద్రతపై అప్పట్లో చర్చకు దారితీసింది.
Advertisement