
చిన్నారుల వికాసానికి.. ‘వేసవి’
స్కూల్ ఎడ్యుకేషన్
వేసవి సెలవుల్లో చిన్నారులు ఏదో ఒకటి నేర్చుకునేలా తల్లిదండ్రులు దృష్టిసారించాలి. పిల్లల్లో సృజనాత్మకతను పెంచే పెయింటింగ్, డ్రాయింగ్ వంటివాటితోపాటు వారిలో ఉత్సాహాన్ని నింపే మ్యూజిక్, డ్యాన్స్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్ వంటివాటిని నేర్పించాలంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో పేరెంట్స్‌కు సూచనలు..
రెస్ట్‌తో పాటూ...
వేసవి సెలవుల్లో పూర్తిగా విశ్రాంతి తీసుకోనిద్దాం అని తల్లిదండ్రులు భావించవచ్చు. కానీ పిల్లలు ఏవైనా కొత్త అంశాలు నేర్చుకునేలా ప్రోత్సహించాలి. నిజానికి జీవితంలో ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకునే తత్వమే ఎవరి ఎదుగుదలనైనా నిర్ణయిస్తుంది. సమ్మర్‌లో టీవీ చూస్తూనో, వీడియోగేమ్‌లు ఆడుతూనో గడిపేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీనివల్ల ఇప్పటికే నేర్చుకున్న విషయాలు కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది.
అభిరుచిని గుర్తించి..
పిల్లలకు చదువే కాకుండా కొన్ని అంశాలపై ఆసక్తి ఉంటుంది. తల్లిదండ్రులు వారి అభిరుచిని గుర్తించి శిక్షణ ఇప్పించాలి. స్విమ్మింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, మ్యూజిక్, చెస్, స్పోర్ట్స్, హార్స్ రైడింగ్ వంటివాటితోపాటు అబాకస్, వేదిక్ మ్యాథ్స్, కంప్యూటర్ శిక్షణ వంటి విద్యా సంబంధిత అంశాలను కూడా నేర్చుకునేలా చూడాలి. వీటిలో కొన్ని మీ చిన్నారుల్లో సృజనాత్మకతను పెంచితే మరికొన్ని వారి చదువుకు ఉపయోగపడతాయి.
గుర్తింపు.. ఉత్సాహం...
‘మా పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నాం. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎందుకు?’ అని తల్లిదండ్రులు భావించకూడదు. ఆసక్తి ఉన్న ఒక అంశాన్ని నేర్చుకోవడం వల్ల నలుగురిలో మీ చిన్నారులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. భవిష్యత్తులో ఉరుకుల పరుగుల జీవనంలో విసిగిపోయినప్పుడు ఆసక్తులే వారికి కొత్త ఉత్సాహాన్నిస్తాయి. మీరు నేర్పించే సింగింగ్, డ్యాన్‌స, చెస్, స్విమ్మింగ్ వంటివాటిలోనే మీ పిల్లలు బాగా రాణించి భవిష్యత్తులో గొప్పపేరు తెచ్చుకోవచ్చు.
చిన్నపిల్లలు ఆడుతూ పాడుతూ..
సమ్మర్‌లో చిన్నారుల అల్లరే అల్లరి. అయితే ఆడుతూ పాడుతూ నేర్చుకునే అంశాలవైపు వారి దృష్టి మళ్లిస్తే.. కొత్త విషయాలు నేర్చుకుంటారు. వీటికోసం ఇంటర్‌నెట్‌లో ఎన్నో సైట్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో సైతం ఆయా అంశాల్లో శిక్షణనిచ్చే సంస్థలున్నాయి. వీటిని వినియోగించుకుంటే మీ చిన్నారుల మనోవికాసానికి బాటలు వేసినవారవుతారు.
గిటార్ నేర్పిస్తున్నా
నేనో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. నా కుమారుడికి గిటార్ నేర్పిస్తున్నా. రోజువారీ రొటీన్ జీవితంలో ఈ మ్యూజిక్ రిలీఫ్ ఇస్తుందని నా నమ్మకం.
- శశాంక్, పేరెంట్, హైదరాబాద్
ఖాళీగా ఉంచొద్దు
సమ్మర్‌లో పిల్లలను ఖాళీగా ఉంచకూడదు. దీనివల్ల వారు నేర్చు కున్న అంశాలు మర్చిపోతారు. కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించాలి.
- సరిత, ప్రిన్సిపల్,
అక్షర స్కూల్, నిజాంపేట్‌స