
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న నూతన విద్యా విధానం ముసాయిదా విడుదలైంది. కేంద్ర కేబినెట్ మాజీ సెక్రటరీ టి.ఎస్.ఆర్.సుబ్రమణియన్ నేతృత్వంలో ఏర్పాటైన నలుగురు సభ్యుల కమిటీ.. ప్రస్తుత తరానికి, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా కొత్త విద్యావిధానంలో అనుసరించాల్సిన పలు సిఫార్సులు చేసింది. ప్రీ-ప్రైమరీ నుంచి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వరకు.. అంగన్‌వాడీల నుంచి అంతర్జాతీయ విద్యావకాశాల వరకూ.. పలు సలహాలు ఇచ్చింది. మారిన సమకాలీన ప్రపంచంలో నాలెడ్జ్ బేస్డ్ సమాజంలో లైఫ్‌లాంగ్ లెర్నింగ్, ఇంటర్నేషనలైజేషన్, స్కిల్ డెవలప్‌మెంట్‌కు సిఫార్సుల్లో పెద్దపీట వేసింది. మరోవైపు కమిటీ సిఫార్సులపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. సుబ్రమణియన్ కమిటీ విద్యారంగ ప్రగతికి ఎలాంటి మార్పులు తీసుకురావాలో... ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్దిష్టంగా పేర్కొనలేదని కొంతమంది విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సుబ్రమణియన్ కమిటీ రూపొందించిన జాతీయ విద్యా విధానం 2016 ముసాయిదాపై నిపుణుల విశ్లేషణ..
ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్
కమిటీ సిఫార్సుల ప్రకారం.. ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యమివ్వాలి. ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానం లేదు. ద ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నారు. వీటిని బలోపేతం చేసి 4 నుంచి 5 ఏళ్ల వయసులోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రాష్ర్ట ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌కు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలి. అన్ని ప్రాథమిక పాఠశాలల్లోనూ ప్రీ-ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించేలా చర్యలు తీసుకోవాలి.
ఇందుకోసం అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాల ప్రాంగణంలోనో, లేదా పాఠశాలకు అత్యంత సమీపంలోనే ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించేందుకు ప్రత్యేకంగా నియంత్రణ, పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి. ప్రాథమిక విద్యలో లెర్నింగ్ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు విద్యార్థుల్లో ఎర్లీ గ్రేడ్ రీడింగ్, రైటింగ్, కాంప్రహెన్షన్, మ్యాథమెటికల్ స్కిల్స్ పెరిగేలా సంబంధిత ప్రోగ్రామ్‌లు నిర్వహించాలి. అలాగే ప్రత్యేక వర్గాలకు చెందిన వలస పిల్లలు, దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న పిల్లల కోసం అవసరమైతే ‘ఆల్టర్నేట్ స్కూల్స్’ను ఏర్పాటు చేయొచ్చని కమిటీ సిఫార్సు చేసింది.
సెకండరీ ఎడ్యుకేషన్ స్థాయిలో పాఠశాలలను, మూల్యాంకన విధానాలను పునస్సమీక్షించి పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల నైపుణ్యాలను మూల్యాంకన చేసే కోణంలో పరీక్షల్లో పలు అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని సూచించింది. ఎన్‌రోల్‌మెంట్ తక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించి.. వీలైతే వాటిని సమీపంలోని పాఠశాలల్లో కలిపేయాలి. దీనివల్ల మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, టీచింగ్-లెర్నింగ్ సాధ్యమవుతాయి. ఫలితంగా వన్ - క్లాస్, వన్ - టీచర్ లక్ష్యం చేరుకోవచ్చు. అలాగే కేంద్రీయ, జవహర్ నవోదయ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను పెంచాలి. డ్రాప్‌అవుట్స్ కోసం ఓపెన్ స్కూలింగ్ సౌకర్యం కల్పించాలి. విద్యార్థుల్లో నిజమైన ఆసక్తిని, సామర్థ్యాన్ని గుర్తించేందుకు ఆప్టిట్యూడ్ టెస్ట్‌లను నిర్వహించాలి. స్లో లెర్నర్స్‌కు సహకరించేందుకు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా కౌన్సిలర్లను నియమించాలి.
ఐదో తరగతి వరకే నో డిటెన్షన్
పాఠశాల విద్యకు సంబంధించి కమిటీ చేసిన ముఖ్య సిఫార్సు.. నో - డిటెన్షన్ విధానాన్ని సవరించడం. దీన్ని ఐదో తరగతి వరకే పరిమితం చేయాలని, ప్రాథమికోన్నత స్థాయిలో డిటెన్షన్ విధానం అమలు చేయాలని సూచించింది. కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్‌ను సమర్థంగా అమలు చేయాలి. తద్వారా అకడమిక్‌గా రాణించలేకపోతున్న వారిని గుర్తించొచ్చు.
కరిక్యులంలో మార్పులు
పాఠశాల స్థాయి నుంచే కరిక్యులంలో నిరంతర మార్పులు చేపట్టాలని కమిటీ సిఫార్సు చేసింది. పరమత సహనం, జాతీయ సమైక్యత, సమకాలీన సామాజిక పరిస్థితులపై అవగాహన కల్పించాలని పేర్కొంది. కరిక్యులం అవుట్‌కమ్ బేస్డ్‌గా ఉండాలని, లైఫ్ స్కిల్స్‌ను పెంపొందించేలా మార్పులు చేయాలని సూచించింది. బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలపై అవగాహన కల్పించాలని పేర్కొంది. కింది స్థాయి నుంచే కరిక్యులం, పెడగాజీల్లో నిరంతరం మార్పులు చేస్తూ విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం పెంపొందించాలి.
సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌లకు జాతీయ స్థాయిలో ఉమ్మడి కరిక్యులం రూపొందించాలి. ఐదో తరగతి నుంచే డిజిటల్ లిటరసీని కరిక్యులంలో పొందుపర్చాలి. ఆరో తరగతి నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)ని ఒక సబ్జెక్ట్‌గా రూపొందించాలి. లింగ, సామాజిక, సాంస్కృతిక, ప్రాంతీయ వివక్షతలకు తావివ్వని రీతిలో కరిక్యులం రూపొందించాలి. పౌరసత్వం, శాంతి, వ్యక్తిత్వం, న్యాయ, రాజ్యాంగం, ఆర్థికం, పర్యావరణ అంశాలపై అవగాహన ఉండాలి.
కోరుకుంటేనే బోర్డ్ పరీక్షలు
పరీక్ష విధానంలోనూ కమిటీ పలు మార్పులు సూచించింది. పరీక్షలు పూర్తిగా విస్తృత అవగాహనను, గ్రాహక శక్తిని, సమ స్య సాధన నైపుణ్యాలను పరీక్షించేలా ఉండాలని పేర్కొంది. కేవలం పాఠ్యపుస్తకాల్లోని అంశాలను తిరిగి పొందుపరిచే విధానానికి స్వస్తి పలకాలని సిఫార్సు చేసింది. పదో తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలవుతున్న సబ్జెక్ట్‌లు సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్. ఈ మూడు సబ్జెక్ట్‌ల పరీక్షలను పార్ట్-ఎ, పార్ట్-బి విధానంలో నిర్వహించాలి. ఉన్నత చదువుల కోణంలో ఈ మూడు సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకునేవారు పార్ట్-ఎ, పదో తరగతి తర్వాత ఒకేషనల్, ఇతర కోర్సులవైపు వెళ్లే విద్యార్థులు పార్ట్-బి స్థాయి పరీక్షలు రాస్తే సరిపోయేలా చూడాలి. అయితే పదో తరగతి పరీక్షలు రాయడం విద్యార్థులందరికీ తప్పనిసరి చేయాలి. దేశవ్యాప్తంగా వివిధ బోర్డులు, వేర్వేరు సిలబస్‌లు, పరీక్షలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అన్ని బోర్డ్‌ల విద్యార్థుల మార్కులను ఒక నిర్దిష్ట స్కేలింగ్ విధానంలో సమీకృతం చేయాలి లేదా జాతీయ స్థాయిలో పది, ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉమ్మడి పరీక్ష నిర్వహించాలి. మూడో ప్రత్యామ్నాయం ప్రతి బోర్డ్‌లో పర్సంటైల్ విధానాన్ని అమలు చేయడం.
బోధన మాధ్యమం
జాతీయ విద్యా విధానం-1986, 1992 ప్రకారం దేశంలో త్రిభాష సిద్ధాంతం అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే భిన్న సంస్కృతుల రాష్ట్రాలు ఉన్న కారణంగా ఈ విషయంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా త్రీ లాంగ్వేజ్ విధానంపైనా పలు సూచనలను ఈ కమిటీ నివేదించింది. వీటి ప్రకారం.. ఐదో తరగతి వరకు మాతృ భాషలో లేదా ప్రాంతీయ భాషలో బోధన ఉండాలి. రెండో లాంగ్వేజ్‌గా ఇంగ్లిష్‌ను అందించాలి. మూడో లాంగ్వేజ్ ఎంపికను విద్యార్థులు తమ ఆసక్తి మేరకు ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి. సంస్కృతానికి ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో పాఠశాల, యూనివర్సిటీ స్థాయిలో సంస్కృత బోధనకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి.
వ్యక్తిత్వ వికాసం..
ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగా, గేమ్స్- స్పోర్ట్స్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వంటి వాటిలో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలని కమిటీ పేర్కొంది. స్థానిక కళలు, సాహిత్యాలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల్లో ఆరోగ్య సంరక్షణ దిశగా ఆరోగ్య శాఖ సహకారంతో నిరంతరం పరీక్షలు నిర్వహించాలి.
విద్య, ఉద్యోగ సాధన నైపుణ్యాల కల్పన
యువతకు వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపట్టి, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంచాలని కమిటీ సూచించింది. ఎన్‌ఎస్‌డీసీ అంచనాల ప్రకారం- 2022 నాటికి 104.62 మిలియన్ల యువత జాబ్ మార్కెట్‌లోకి ప్రవేశించనున్నారు. ఇప్పటి నుంచే వారికి జాబ్ రెడీ స్కిల్స్ అందించాలి. ఎంప్లాయబిలిటీ, ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ లభించేలా స్కిల్ డవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలి. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత సర్టిఫికెట్ అందించాలి.
ఐసీటీకి ప్రాధాన్యం
అన్ని కోర్సులు, అన్ని స్థాయిల్లో అభ్యసనం పరంగా ఐసీటీని అంతర్గత విధానంగా రూపొందించే ఏర్పాట్లు చేయాలి. ఐసీటీ విధానాన్ని పెంపొందించేందుకు మూక్స్ (మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్)ను ప్రోత్సహించాలి. ఐసీటీ సమర్థ అమలుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి.
బోధన సిబ్బంది బలోపేతం
కమిటీ నివేదిక ప్రకారం సెకండరీ స్థాయిలో మ్యాథమెటిక్స్, సైన్స్, లాంగ్వేజ్ టీచర్ల కొరత అధికంగా నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో అధిక శాతం పాఠశాలల్లో పూర్తి స్థాయి బోధన సిబ్బంది లేరని కమిటీ పేర్కొంది. టీచర్ల నియామకం పరంగా రాష్ట్రాల స్థాయిలో టీచర్ రిక్రూట్‌మెంట్ కమిషన్లను ఏర్పాటు చేయాలి. ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీని ఆ ప్రాంతం వారితోనే చేపట్టాలి. ఉపాధ్యాయుల గైర్హాజరు, పాఠశాలల నిర్వహణకు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు నిర్ణయాధికారాలు ఇవ్వాలి.
ఉపాధ్యాయ విద్య కోర్సులు: జాతీయ స్థాయిలో టీచర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. రీజనల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌ను బలోపేతం చేయడంతోపాటు వాటిని యూనివర్సిటీ స్థాయికి పెంచాలి. బీఈడీ, డీఈడీ కోర్సుల కరిక్యులంలో మార్పులు చేయాలి. ఈ కోర్సులు అందించే సంస్థలకు గుర్తింపు తప్పనిసరి. టీచర్లకు ప్రతి మూడేళ్లకు ఓరియెంటేషన్స్ నిర్వహించాలి. ప్రభుత్వ, ప్రైవేటు టీచర్ల నైపుణ్యాల ఆధారంగా పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.
అన్ని వర్గాలకు విద్య అందేలా
గ్రామీణ విద్యార్థులు, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులు, గిరిజన ప్రాంత విద్యార్థులు.. ఇలా ప్రతి ఒక్కరికీ విద్యనందించే విధంగా చర్యలు తీసుకోవాలి. గిరిజన ప్రాంత విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు అందించాలి. గిరిజన విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలు పెంచేలా పాఠశాల తరగతులు ముగిసిన తర్వాత వృత్తి శిక్షణ తరగతులు నిర్వహించాలని కమిటీ సూచించింది. మాతృభాషలో బోధిస్తున్నప్పటికీ కొన్ని గిరిజన వర్గాలకు ఆ భాష అర్థం కావడం లేదు. ఇలాంటి వారికోసం బహుళ మాధ్యమ బోధన విధానాన్ని రూపొందించాలి.
ప్రత్యేకంగా నేషనల్ ఫెలోషిప్ ఫండ్
ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించేందుకు ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు నేషనల్ ఫెలోషిప్ ఫండ్ పేరుతో స్కాలర్‌షిప్ ప్రారంభించాలి. దీని ద్వారా ఏటా దేశవ్యాప్తంగా పది లక్షల మంది ఈబీసీ వర్గాల విద్యార్థుల ట్యూషన్ ఫీజు, ఇతర అభ్యసన సామగ్రికి సరిపడే మొత్తాన్ని అందించాలి. అన్ని వర్గాల్లోని ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు నేషనల్ టాలెంట్ స్కాలర్‌షిప్ ప్రారంభించాలి. అర్హులను ఎంపిక చేసేందుకు పదో తరగతి తర్వాత జాతీయ స్థాయిలో ఒక పరీక్ష నిర్వహించాలని కమిటీ సూచించింది.