
నాలుగు విభాగాల్లో నీతి ఆయోగ్ 80 సిఫారసులు
20 రాష్ట్రాల్లో అమలుకు వీసీల అంగీకారం
జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా మార్పులు.. శాస్త్రీయ పరిశోధనలు, స్టార్టప్స్‌కు ప్రాధాన్యం
డిజిటల్ లెర్నింగ్ తప్పనిసరి
ఐఐటీలతో తులతూగేలా వర్సిటీల్లో ప్రమాణాలు.. ప్రొఫెసర్ల నియామక ప్రక్రియలో సంస్కరణలు
ఉన్నత విద్యలో 81% మంది విద్యార్థులు స్టేట్ వర్సిటీల్లోనే.. వైఎస్సార్‌సీపీ హయాంలో ఇప్పటికే పలు సంస్కరణలు అమలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో (స్టేట్ యూనివర్సిటీలు) సంస్కరణలు అమలు చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా కరిక్యులమ్, పరీక్షల విధానంతో పాటు వర్సిటీల అక్రిడిటేషన్ ప్రక్రియ వరకు అన్నింటిలోనూ మార్పులు తేవాలని పేర్కొంది. జాతీయ పరిశోధన విధానాన్ని ప్రవేశపెట్టి మానవీయ శాస్త్రాలలో పరిశోధనలను ప్రోత్సహించాలని సిఫారసు చేసింది.
సెమిస్టర్ ప్రాతిపదికన బోధన నాణ్యతను లెక్కించడం నుంచి ఉన్నత విద్య రోడ్ మ్యాప్ రూపకల్పన వరకు నీతి ఆయోగ్ పలు సూచనలు చేసింది. ఈ మేరకు 20 రాష్ట్రాలకు చెందిన వర్సిటీల వైస్ చాన్సలర్ల ఆమోదంతో రూపొందించిన నివేదికను ఇటీవల విడుదల చేసింది.
ఆయా రాష్ట్రాలు తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో మెరుగైన సంస్కరణలకు లిఖిత పూర్వకంగా అంగీకారం తెలిపాయి. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడం, 2047 నాటికి కేంద్రం నిర్దేశించిన వికసిత్ భారత్ దార్శనికతలో భాగంగా నివేదికను తయారు చేసినట్లు నీతి ఆయోగ్ తెలిపింది
43 స్టేట్ వర్సిటీలతో కర్ణాటక టాప్..
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఉన్నత విద్యలో 81% విద్యార్థుల నమోదు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోనే ఉంది. 2025 జనవరి నాటికి దేశంలో 495 స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో 43 వర్సిటీలతో కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ 38 వర్సిటీలతో రెండో స్థానాల్లో నిలిచాయి. గత 14 ఏళ్లలో స్టేట్ వర్సిటీల వృద్ధి 50 శాతానికి పైగా ఉంది. వీటిలో విద్యార్థుల నమోదు 2011–12నుంచి 2021–22 మధ్య 38% పెరిగి దాదాపు 3.24 కోట్లకు చేరుకుంది.
పరిశోధనలు.. స్టార్టప్స్
విద్యలో నాణ్యతా ప్రమాణాలు, పాలన, నిధులు, ఉపాధి సామర్థ్యం అనే నాలుగు విభాగాలలో 80 సిఫార్సులతోపాటు పరిశోధన, బోధన, డిజిటలైజేషన్, అంతర్జాతీకరణ అనే కీలకమైన నాలుగు అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ నివేదికలో సూచనలు చేసింది. మానవీయ శాస్త్రాలు, ప్రాథమిక పరిశోధనలను ప్రోత్సహించడంతో పాటు పరిశోధనలను వాణిజ్యీకరణ చేయాలని, వర్సిటీల్లో స్టార్టప్‌లకు అవకాశం కల్పించాలని, ప్రముఖ పరిశోధన సంస్థలను ఇందులో భాగస్వాములుగా చేయాలని నివేదిక సూచించింది.
ఐఐటీలకు దీటుగా ఎదగాలి..
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దశాబ్ద కాలంలో (2011–12 నుంచి 2021–22 వరకు) విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) వృద్ధి పరంగా కేరళ, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్ టాప్ 10 రాష్ట్రాలుగా నిలిచాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు విద్యార్థి–టీచర్ నిష్పత్తి (పీటీఆర్)లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
లింగ సమానత్వ సూచిక (జీపీఐ)లో నాగాలాండ్, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, సిక్కిం, హరియాణా, రాజస్థాన్, త్రిపుర, తమిళనాడు టాప్ 10 రాష్ట్రాలుగా ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ ప్రమాణాలను అనుసరిస్తున్నాయని, ఆ స్థాయిలో మన స్టేట్ వర్సిటీలు కూడా ఉండాలని సూచించింది. దేశంలో ఐఐటీలు వంటి విద్యాసంస్థలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నత ప్రమాణాల కోసం కృషి చేయాలని పేర్కొంది.
గత సర్కారు హయాంలో పలు సంస్కరణలు అమలు..
నీతి ఆయోగ్ తాజాగా సిఫారసు చేసిన పలు సంస్కరణలను వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా ఏపీలోని వర్సిటీలు, కళాశాల విద్యలో గతంలోనే అమలు చేయడం గమనార్హం. కళాశాలలను కంపెనీల స్టార్టప్స్‌తో అనుసంధానించి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లను అకడమిక్‌లో భాగం చేసింది. మానవీయ శాస్త్రాలు అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేసింది.
అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ లాంటి అంతర్జాతీయ సంస్థ ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్‌పై శిక్షణను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ యూనివర్సిటీలు అందిస్తున్న నైపుణ్య కోర్సులను మన విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్ ఎడ్‌టెక్ సంస్థ ఎడెక్స్‌తో కలిసి 2 వేల అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్ కోర్సులను ఉచితంగా అందించింది.
ఏఐసీటీఈ ద్వారా ఏఐ, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి అంశాల్లో శిక్షణను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఒక్క 2023–24 విద్యా సంవత్సరంలోనే డిగ్రీ పూర్తయిన వెంటనే దాదాపు 2 లక్షల మందికిపైగా క్యాంపస్ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించారు.
ఇతర సిఫారసులివీ..
» విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు సెమిస్టర్ ప్రాతిపదికన బోధన నాణ్యతను లెక్కించాలి.
» డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లను బోధనతో అనుసంధానించాలి.
» ప్రొఫెసర్లు, విద్యార్థులకు ప్రపంచ దృక్పథాన్ని అలవరచేందుకు విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలి.
» ఉన్నత విద్య ఆర్థిక సంస్థ (హెచ్‌ఈఎఫ్‌ఏ) తరహాలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల కోసం మౌలిక సదుపాయాల ఆర్థిక సంస్థను నెలకొల్పాలి.
» ఆర్థిక సహాయం కోసం బలమైన పూర్వ విద్యార్థుల సంఘాలు, కార్పొరేట్ కార్యక్రమాలపై రాష్ట్ర విశ్వవిద్యాలయాలు దృష్టి పెట్టాలి.
» 2047 రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యా రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకోవాలి. ఉన్నత విద్యా మండళ్లకు అధికారాలు కల్పించి ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను సంస్కరించాలి.
» పాలక మండళ్లల్లో బోధనా బృందాలకు చోటు కల్పించాలి.
» రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా విభాగాల మధ్య సహకారాన్ని పెంచుతూ అక్రిడిటేషన్ ప్రక్రియను మార్చాలి.
» విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచేందుకు ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లపై దృష్టి పెట్టాలి. వారు ఉద్యోగాల
సృష్టికర్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలి.
Comments
Please login to add a commentAdd a comment