సంస్కరణల పేరుతో...పాఠశాల విద్యకు తూట్లు! | Memo issued introducing new policies in school education | Sakshi
Sakshi News home page

సంస్కరణల పేరుతో...పాఠశాల విద్యకు తూట్లు!

Published Fri, Jan 10 2025 5:32 AM | Last Updated on Fri, Jan 10 2025 5:32 AM

Memo issued introducing new policies in school education

ప్రభుత్వం ఇచ్చిన 117 జీవోను వెనక్కి తీసుకుంటున్నట్టు డైరెక్టర్‌ మెమో

సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో సంస్కరణలు ప్రవేశపెడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 117ను ఉపసంహరిస్తున్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయ్‌ రామరాజు ప్రకటించారు. జీవోలో ఉన్న అంశాలకు భిన్నంగా కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నట్టు గురువారం మెమో జారీ చేశారు. 2022 జూన్‌లో జాతీయ విద్యావిధానాలకు అనుగుణంగా ప్రభుత్వ విద్యలో మార్పులు చేస్తూ గత ప్రభుత్వం జీవో 117ను జారీ చేసింది. 

ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలన్నా, రద్దు చేయాలన్నా తిరిగి ప్రభుత్వమే మరో జీవో ఇవ్వాల్సి ఉంది. కానీ పాఠశాల విద్య డైరెక్టర్‌ అందుకు భిన్నంగా జీవోను వెనక్కి తీసుకుంటున్నట్టు మెమో ఉత్తర్వులు విడుదల చేయడం చర్చనీయాంశమైంది. కొన్ని నెలలుగా గుర్తింపు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతున్న డైరెక్టర్, జీవో 117 రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. 

కానీ డైరెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న ఆయన ఈ నిర్ణయం ప్రకటించడం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నష్టం జరిగేలా మార్పులు చేయడంపై ఉపాధ్యాయుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేగాక గ్రామ పంచాయతీల్లో మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌ స్థాపనతో పాటు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్‌ పాఠశాలలు, మున్సిపల్‌ స్కూళ్లలో టీచింగ్‌ స్టాఫ్‌ విభజనపైనా మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే, జిల్లా పరిషత్‌ చట్టాలనే మున్సిపల్‌ టీచర్లకు కూడా వర్తించేలా ఉత్తర్వులు ఉండటంతో ఆ విభాగం టీచర్లు మండిపడుతున్నారు. 

ఇదిలా ఉంటే, గత ప్రభుత్వం తీసుకువచ్చిన స్కూలింగ్‌ విధానానికి పేర్లు మార్చడంతో పాటు 3–5 తరగతులకు అందిస్తున్న సబ్జెక్టు టీచర్‌ విధానాన్ని రద్దు చేయడం, ఆ తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయడంతో పాటు, గ్రామీణ పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హైసూ్కల్‌ ప్లస్‌ బోధనను కూడా రద్దు చేస్తున్నట్టు వివరించారు. అంతేగాక మున్సిపల్‌ స్కూళ్లకు కూడా ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ స్కూల్స్‌ నిబంధనలు వర్తింపజేయనున్నట్టు పేర్కొన్నారు.  

ఉపాధ్యాయులకు నష్టం జరిగేలా ఉత్తర్వులు 
పాఠశాల విద్యా విధానంలో కొత్త విధానం తీసుకొస్తూ విడుదలైన తాజా ఉత్తర్వులు ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం చేసేలా ఉన్నాయి. అన్ని పాఠశాలల్లోను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాలు రెండూ అందుబాటులోకి తెచ్చాకే జీవో 117ను రద్దు చేయాలి. సెక్షన్ల వారీగా కాకుండా విద్యార్థుల సంఖ్యను బట్టి స్టాఫ్‌ ప్యాట్రన్‌ నిర్ణయించాలి. 

ప్రతి మీడియంకు 75 మంది విద్యార్థులు ఉంటే 9 మంది పాఠశాల సిబ్బందిని ఇవ్వాలి. లోపభూయిష్టంగా ఉన్న తాజా ఉత్తర్వులను సవరించాలి. హైసూ్కల్‌ ప్లస్‌కు ప్రత్యామ్నాయంగా జిల్లా పరిషత్‌ జూనియర్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలి.   – సి.వి.ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీటీఎఫ్, అమరావతి  

మున్సిపల్‌ టీచర్లకు అన్యాయం 
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వులు మున్సిపల్‌ టీచర్లకు అన్యాయం చేసేలా ఉన్నాయి. ప్రభుత్వ విద్య, పంచాయతీరాజ్‌ టీచర్లకు మేలు చేస్తూ నిబంధనలు రూపొందించారు. పంచాయతీరాజ్‌ నిబంధనలనే మిగిలిన యాజమాన్యాల్లో ఉన్న పురపాలక, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ టీచర్లకు ఆపాదిస్తున్నారు. 

ప్రస్తుతం 14 వేలమంది పురపాలక టీచర్లు పట్టణాల్లో పనిచేస్తున్నారు. కానీ ప్రస్తుత నిబంధనలతో పురపాలక టీచర్లను గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేసే పరిస్థితి నెలకొంది. జీవో 84 రద్దు చేసి, నిబంధనను తక్షణమే సవరించాలి.   – ఎస్‌.రామకృష్ణ, అధ్యక్షులు, మున్సిపల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌

విద్యావిధానంలో మార్పులు
 ప్రస్తుతం జీవో 117 ప్రకారం... పాఠశాల విద్యలో ఆరు అంచెల పాఠశాలలు కొనసాగుతున్నాయి. 1.శాటిలైట్‌ ఫౌండేషనల్‌ స్కూల్‌ (పీపీ–1, పీపీ–2), 2.ఫౌండేషనల్‌ స్కూల్‌ (పీపీ–1 నుంచి రెండో తరగతి వరకు), 3. ఫౌండేషనల్‌ స్కూల్‌ ప్లస్‌ (పీపీ–1, 2తో పాటు 1 నుంచి 5వ తరగతి), 4. ప్రిహైసూ్కల్‌/ యూపీ స్కూల్‌ (3 నుంచి 8 తరగతులు), 5. హైసూ్కల్‌ (3–10 తరగతులు), 6. హైసూ్కల్‌ ప్లస్‌ (3 నుంచి ఇంటర్‌ వరకు) అమలు చేస్తున్నారు.  

కొత్త విధానం ప్రకారం.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు రకాల పాఠశాలల వ్యవస్థను 5 రకాల పాఠశాలల వ్యవస్థగా మార్పు చేస్తున్నారు. 
1.శాటిలైట్‌ ఫౌండేషనల్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2) మహిళా శిశు సంక్షేమశాఖ చూస్తుంది. ఫౌండేషనల్‌ స్కూల్‌ (పీపీ–1 టు 2వ తరగతి), ఫౌండేషనల్‌ స్కూల్‌ ప్లస్‌ స్థానంలో బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌గా మార్చి పాత విధానం అమలు చేస్తారు. ప్రిహైసూ్కల్‌ స్థానంలో మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ ప్రవేశపెట్టి బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌ బోధనను అందిస్తారు.హైస్కూల్స్‌లో 6 నుంచి 10 తరగతులు ఉంటాయి. 

హైస్కూల్  ప్లస్‌ను రద్దు చేస్తున్నారు. ఈ విధానంలో ప్రధానంగా 3–5 తగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్‌ విధానం, హైస్కూల్ ప్లస్‌లో ఇంటర్‌ విద్య రద్దవుతుంది. అయితే, హైస్కూల్ ప్లస్‌ రద్దు చేసిన వాటికి ప్రత్యామ్నాయంగా ఆయా పాఠశాలల స్థానంలో అనుబంధ జూనియర్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఎక్కడా చెప్పలేదు.  

ఒక నిబంధన.. అనేక అనుమానాలు
మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌లో విద్యార్థుల నమోదు 60 దాటితే తరగతికి ఒక టీచర్‌ను కేటాయిస్తామన్నారు. కానీ బేసిక్‌ ప్రైమరీ స్కూల్స్‌లో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉంటారు. ఈ రెండు స్కూలింగ్‌ విధానంలోనూ ఒకే తరహా తరగతులు కొనసాగుతాయి. కానీ నిబంధనలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి.

పాఠశాలల్లో 6, 7, 8 తరతుల్లో విద్యార్థుల సంఖ్య 30 లేదా అంతకంటే తక్కువుంటే ఆ పాఠశాల స్థాయిని బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌కు తగ్గించి ఆయా ఉన్నత తరగతుల విద్యార్థులను సమీపంలోని హైసూ్క­ల్‌లో చేరుస్తారు. అంటే విద్యార్థులకు అందుబాటులో ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల వ్యవస్థను రద్దు చేస్తున్నారు. దీంతో మూడు కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత తరగతుల చదువు అందే పరిస్థితి లేదు. దీంతో బాలికల ఉన్నత చదువుకు ఆటంకం ఏర్పడుతుంది.

ఉన్నత పాఠశాల వ్యవస్థలో 6 నుంచి 10 తరగతులకు సెక్షన్ల వారీగా ఉపాధ్యాయ సంఖ్యను నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 117 జీవో ప్రకారం 3–5 తరగతులను హైసూ్కల్స్‌లో కలపడంతో ఎనిమిది సెక్షన్లు వరకు కొనసాగుతున్నాయి. దీంతో బోధనకు రెండో స్కూల్‌ అసిస్టెంట్స్‌ను అందించారు. అయితే, 3–5 తరగతులను వెనక్కి తీసుకుపోవడంతో రాష్ట్రంలోని 60 శాతం పైగా హైసూ్కళ్లల్లో ఐదు సెక్షన్లు మాత్రమే మిగులుతాయి.

ప్రస్తుతం ఆయా హైసూ్కళ్లల్లో మ్యాథ్స్, ఇంగ్లిష్, సోషల్‌ బోధన అందిస్తున్న రెండు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో ఒక పోస్టు రద్దు కానుంది. ఈ చర్యతో వందలాది స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు మిగులు చూపనున్నారు.75 కంటే తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్ట్‌ ఇచ్చేది లేదని, వ్యాయామ ఉపాధ్యాయులు సైతం మిగులు ఉంటేనే ఆ పోస్టును కేటాయిస్తామన్నారు. అంటే ఇప్పుడున్న పీఈటీలను ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది.  

పై నిబంధనల అమలుకు క్లస్టర్‌ లెవెల్, మండల్‌ లెవెల్‌ కమిటీలను ఏర్పాటు చేస్తారు. దీంతో అధికారులపై ఒత్తిడి తప్పదు.ప్రస్తుతం హైస్కూల్  ప్లస్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఏం చేస్తారేది ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. దీంతో ఆయా ఉపాధ్యాయుల పరిస్థితి గందరగోళంగా మారనుంది. సర్‌ప్లస్‌ ఉపాధ్యాయులను ఎక్కడ సర్దుబాటు చేస్తారనేది అనుమానమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement