పాఠశాల విద్యా శాఖలో వింత పోకడ
రోజుకో సమాచారం కోరుతున్న అధికారులు
‘అర్జెంటు ఫైల్’.. వెంటనే పంపాలంటూ ఉపాధ్యాయులపై ఒత్తిడి
విద్యా బోధనకు సమయం ఉండటంలేదంటున్న టీచర్లు
సాక్షి, అమరావతి: ‘మీ పాఠశాలల్లో ఎస్సీ ఉపాధ్యాయులు ఎంత మంది ఉన్నారు? విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 2014–15 నుంచి 2023–24 విద్యా సంవత్సరం వరకు ఈ వివరాలు అర్జెంటుగా పంపించండి’.. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు అందిన ఆదేశం ఇది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు వెబెక్స్‌లో సమాచారం అందించి, సాయంత్రంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.
గత వారం ఉపాధ్యాయుల సర్వీసు సమాచారం వెంటనే అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. అంతకు ముందు అపార్.. పెన్.. ఇలా రోజుకో అంశంపై ఉపాధ్యాయులకు ‘అర్జెంట్ ఫైల్’ అంటూ ఆదేశాలు అందుతున్నాయి. దీంతో స్కూళ్లలో పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులకు సమయం ఉండటంలేదు. అధికారులు అడిగే సమాచారం అందించేందుకే సమయం సరిపోవడం లేదని, పాఠాలు చెప్పే సమయం ఎక్కడిదని టీచర్లు వాపోతున్నారు.
ఎప్పుడు ఏం అడుగుతారో తెలియడంలేదని, పైగా అర్జెంట్ అంటూ అప్పటికప్పుడు సమాచారం మొత్తం ఇచ్చేయాలని ఆదేశిస్తున్నారని, దీంతో టెన్షన్‌తో గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలవుల్లోనూ ప్రశాంతంగా ఉండలేకపోతున్నామని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వింత పోకడతో రాష్ట్రవ్యాప్తంగా విద్యా బోధన కుంటుపడింది.
దీంతో మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో సమస్యలు ఏర్పడ్డాయి. గత ప్రభుత్వంలో విద్యా శాఖలో చేపట్టే సంస్కరణలు, మార్పులపై అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించేవారని, కూటమి ప్రభుత్వంలో రిజిస్టర్డ్ సంఘాలకు అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేశారని టీచర్లు వాపోతున్నారు.
కొన్ని నెలలుగా సమావేశాలు జరగడమే గానీ సమస్యలు పరిష్కారం కాలేదని ఈ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఆందోళనలు, ధర్నాలకు సిద్ధమవుతున్నాయి. దీంతో పాఠశాల విద్య డైరెక్టర్ తాజాగా వారితోనూ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. అయితే, సమస్యలు విని పరిష్కరిస్తారా.. లేక ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరిస్తారా అనేది తేలాల్సి ఉంది.
చర్చలకు గుర్తింపు సంఘాలకే అనుమతి
కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత జూన్ నెలలో చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు రసాభాసగా మారింది. నేతల రికమండేషన్లు, ఒత్తిళ్లతో బదిలీ ప్రక్రియని గందరగోళంగా మార్చేశారు. ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత, పలుచోట్ల ఆందోళనల నేపథ్యంలో వారంలో పూర్తవ్వాల్సిన సర్దుబాటు రెండు నెలల పాటు సాగింది. అనంతరం ఉపాధ్యాయ సమస్యలపై కమిషనరేట్‌లో చర్చలకు శ్రీకారం చుట్టారు.
జీవో 117 రద్దు, ఇంగ్లిష్ మీడియం రద్దు, 3–5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం, టీచర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాల చెల్లింపు వంటి అంశాలపై పాఠశాల విద్య డైరెక్టర్ అధ్యక్షతన చర్చలు జరుగుతున్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్న ఈ చర్చలకు అన్ని సంఘాలను పిలవడంలేదు. కేవలం 9 గుర్తింపు సంఘాల నేతలను మాత్రమే ఆహ్వానిస్తున్నారు.
37 రిజిస్టర్డ్ సంఘాలను అస్సలు పట్టించుకోవడంలేదు. చివరకు గుర్తింపు సంఘాల సూచనలనూ పరిగణనలోకి తీసుకోవడంలేదు. దీంతో సమస్యలు కూడా పరిష్కారం కావడంలేదు. ముఖ్యంగా ఒకటో తేదీన వేతనాన్ని ఒక్క నెల మాత్రమే అమలు చేశారు. గత ఐదు నెలలుగా వారం తర్వాతే ఇస్తున్నారు.
పురపాలక సంఘాల్లోని పాఠశాలల్లో ఉన్న 14 వేల మంది ఉపాధ్యాయులకు చర్చల్లో కనీస ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఇతర సంఘాల నిర్ణయాలనే తమపై రుద్దుతున్నారని, ఇదెక్కడి న్యాయమని మున్సిపల్ ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment