ప్రస్తుతం ఉన్న స్కూల్ కాంప్లెక్స్‌ల రద్దు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
5 వేల కాంప్లెక్స్‌ల స్థానంలో 4,034 క్లస్టర్ల ఏర్పాటు
ఎంఈవో అధికారాలు క్లస్టర్ హెచ్‌ఎంలకు బదలాయింపు!
800 మంది సీఆర్పిల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యా శాఖలో కీలకమైన స్కూల్ కాంప్లెక్స్‌ల స్థానంలో క్లస్టర్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సుమారు 5,200 స్కూల్ కాంప్లెక్స్‌ల స్థానంలో 4,034 క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయి. ప్రతి క్లస్టర్‌కు గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 కి.మీ. పరిధిలో ఉన్న 10 నుంచి 15 పాఠశాలలు, పట్టణ ప్రాంతాల్లో 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని 8 నుంచి 10 పాఠశాలలు అనుసంధానం చేశారు.
దీంతోపాటు క్లస్టర్‌లో 40 నుంచి 50 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా ఉంటారు. ఇకపై ప్రతి నెలా పాఠశాల కాంప్లెక్స్ సమావేశాలు కొత్త విధానంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ, పాఠశాలల మధ్య విద్య అనుసంధానం, విద్యా వనరుల సామగ్రి తయారీ, తనిఖీలు, విద్యావ్యవస్థ పర్యవేక్షణ తదితర కార్యక్రమాలు క్లస్టర్ కేంద్రంగా నిర్వహిస్తారు.
ఎంఈవో అధికారాలు క్లస్టర్ హెచ్‌ఎంకు..
కొత్త విధానంలో క్లస్టర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కీలకంగా మారనున్నారు. మండల యూనిట్‌లో ప్రస్తుతం డీడీవో అధికారాలు ఎంఈవోలకు ఉండగా.. ఇకపై ఈ విధానానికి స్వస్తి పలికి త్వరలో క్లస్టర్ హెచ్‌ఎంకు జీతాల పంపిణీ అధికారం బదలాయింపు చేయనున్నారు. ఎంఈవోలు కేవలం పరిపాలన సంబంధ అంశాలకు మాత్రమే పరిమితం కానున్నారు. క్లస్టర్ స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులపై ప్రస్తుతం ఉన్న రోజువారీ విధులకు అదనంగా క్లస్టర్ నిర్వహణ భారం పడడంతోపాటు ఎంఈవోలు నిర్వహిస్తున్న డీడీవో బాధ్యతలను కూడా క్లస్టర్ హెచ్‌ఎంకే ఇవ్వనున్నట్టు సమాచారం.
స్కూల్ కాంప్లెక్స్‌ను బలోపేతం చేయాలి
కొత్తగా పునర్వ్యవస్థీకరణ చేసిన స్కూల్ క్లస్టర్ కేంద్రాలను బలోపేతం చేస్తూ గ్రాంటు రూ.లక్ష వరకు విడుదల చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక డిజిటల్ అసిస్టెంట్, బోధనేతర సిబ్బందిని నియమించాలన్నారు. పాఠశాలల సంఖ్యను పెంచినందున ఇద్దరు చొప్పున సీఆర్పిలను కేటాయించాలని కోరారు.
800 మంది సీఆర్పిలపై ప్రభావం
ప్రభుత్వ స్కూళ్లలో బోధనా అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే స్కూల్ కాంప్లెక్స్‌లను తగ్గిస్తున్న ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ విభాగంలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను కూడా తగ్గిస్తోంది. రెండు దశాబ్దాలుగా పాఠశాల విద్యాశాఖలో 4,100 మంది సీఆర్పిలుగా పనిచేస్తుండగా.. ఇప్పుడు వీరిలో దాదాపు 800 మందిని తగ్గించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. స్కూల్ కాంప్లెక్స్‌ల పునరి్నర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వం జూలైలో పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. ఈ మేరకు కాంప్లెక్స్‌ల స్థానంలో క్లస్టర్ విధానం అమలు చేస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు.
ఇందులో భాగంగా ఒక్కో మండలంలో రెండు స్కూల్ కాంప్లెక్స్‌లను ఒక్కటిగా చేస్తున్నారు. ఈ క్రమంలో తగ్గిన కాంప్లెక్స్‌ల సంఖ్యకు అనుగుణంగా సీఆర్పిలు కూడా ఉద్యోగాలు కోల్పోనున్నారు. ప్రస్తుతం ఒక్కో మండలం పరిధిని బట్టి 8 నుంచి 10 స్కూళ్లకు కలిపి ఒక స్కూల్‌ను కాంప్లెక్స్‌గా, మండలంలో మొత్తం 4 నుంచి 6 కాంప్లెక్స్‌లు కొనసాగుతున్నాయి. ఆయా స్కూళ్ల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యా సంబంధ పథకాలు, విద్యా కేలండర్, ఉపాధ్యాయుల శిక్షణ తదితర అంశాలను సీఆర్పీలు పరిశీలించి ప్రభుత్వానికి ఎంఈవోల ద్వారా నివేదిక అందిస్తారు.
కాంట్రాక్టు విధానంలో నియమితులైన వీరంతా బీఈడీ అర్హత ఉండడంతో గత ప్రభుత్వం క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు (సీఆర్‌ఎంటీ)గా గుర్తింపు ఇవ్వడంతో పాటు మండలంలో ఎక్కడైనా ఉపాధ్యాయులు సెలవులో ఉన్నప్పుడు బోధనకు అంతరాయం లేకుండా వీరు అక్కడ పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు క్లస్టర్ విధానం అమలుతో సగం మందిని తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి మరో ప్రత్యామ్నాయం చూపుతారా లేదా అన్నదానిపై ఇప్పటి దాకా విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment