crp
-
సీఆర్పీల ఉద్యమబాట!
ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్నా తగిన గుర్తింపు రావడం లేదని భావించిన సీఆర్పీలు ఉద్యమబాట పట్టారు. తమ సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టి సారించకపోవడంతో ఆందోళనలకు సిద్ధమయ్యారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బుధవారం నిర్వహించే ధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి తరలివెళ్లారు. కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం నూతన విద్యావిధానాలు అమలు చేస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో కీలకమైన విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీ(క్లస్టర్ రిసోర్స్ పర్సన్)ల సమస్యలను పట్టించుకోవ డం లేదు. పదేళ్లుగా విధుల్లో ఉన్నా ఉద్యోగ భద్రత లేకపోవడం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొత్త నియామకాలు లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఉపాధ్యాయ ఎన్నికల సమయంలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన మేరకు న్యాయం జరుగుతుందని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. 2021 జూన్ నుంచి పెంచిన వేతనాలు అమలు చేస్తున్నా సమాన పనికి సమాన వేతనం మాత్రం వారికి అందని ద్రాక్షగానే మిగిలింది. ఉమ్మడి జిల్లాలో 203 మంది.. జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు వా రధి ఉంటూ.. పాఠశాలలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు అనుసంధానంగా పనిచేసేందుకు వీలుగా సీఆర్పీలను ప్రభుత్వం నియమించింది. పదేళ్ల క్రితం రాత పరీక్షల ద్వారా ప్రతీ మండలానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ఎమ్మార్సీ కా ర్యాలయ పనులు, పాఠశాలల పర్యవేక్షణ పనులు అప్పగించారు. అయితే ఉపాధ్యాయులు కార్యాలయాల్లో పనిచేస్తే విద్యార్థులు నష్టపోతారనే ఉద్దేశంతో విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను అత్యవసర పరిస్థితులు, ఎన్నికల విధులు, జనాభా లెక్కల విధులకు మాత్రమే వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో 2011లో నూతన విధానం తీసుకువచ్చారు. దీనికి అనుగుణంగా టీటీసీ, బీఈడీ విద్యార్హతతో 2012లో రాత పరీక్షలు, ఇంటర్వూలు నిర్వహించి సర్వ శిక్ష కార్యక్రమం కింద కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక్కో కాంప్లెక్స్ పరిధిలో ఒక్కో సీఆర్పీని నియమించారు. ఇందులో కొంత మంది వ్యక్తిగత కారణాలతో ఉద్యోగాలు వదిలిపెట్టారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 232 కాంప్లెక్స్‌లకు 203 మంది సీఆర్పీలు విధులు నిర్వర్తిస్తున్నారు. 18కి పైగా విధులు ప్రస్తుతం సీఆర్పీలు క్షేత్రస్థాయిలో 18కి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాంప్లెక్స్ హెచ్ఎంలకు సహా యంగా ఉంటూనే బడిబయట పిల్లల గుర్తింపు, 18 నుంచి 25 పాఠశాలల పర్యవేక్షణ, ఎస్ఎంసీ సమావేశాల నిర్వహణ, కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విధులు, మధ్యాహ్న భోజన అమలు పరిశీలన, సమగ్ర శిక్ష కార్యక్రమాల నిర్వహణ, ఎమ్మార్సీ కార్యాలయం, పాఠశాలల మ ధ్య అనుసంధాన కర్త, విద్యార్థుల ఆధార్ నమోదు, ఎన్నికల విధులు, యూడైస్, చైల్డ్ ఇన్ఫోలో వివరాల నమోదు తదితర పనులు చేయాలి. వీటితోపాటు జిల్లాస్థాయి అధికారులు ఆదేశాల మేరకు పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇటీవల స్వచ్ఛ విద్యా పురస్కార్‌కు సంబంధించి ఫొటోలు తీసుకోవడం, ఉపాధ్యాయుల డేటా అప్డేట్ చేయడం వంటి బాధ్యతలను కూడా వీరికే అప్పగించారు. ఉద్యోగ భద్రత లేక.. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి పనికి తగిన వేతనం చెల్లించాలని సీఆర్పీలు డిమాండ్ చేస్తున్నారు. జాబ్‌చార్ట్ ప్రకారం వీరు 15 నుంచి 18 పాఠశాలలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే సిబ్బంది కొరతతో 18 నుంచి 25 స్కూళ్ల బాధ్యతలు అప్పగించారు. ఖాళీలను భర్తీచేసి పనిభారం తగ్గించాలని కోరుతున్నారు. ప్రస్తు తం వీరికి కేంద్ర ప్రభుత్వం 60, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భాగస్వామ్యంతో వేతనాలు చెల్లిస్తున్నారు. అంతకు ముందు వీరికి రూ.15వేలు చెల్లించగా, 2021 నుంచి 30 శాతం పెంచారు. దీని ప్రకారం రూ.19,500 అందాల్సి ఉన్నా రూ.150 కోత విధించారు. రెగ్యులర్ చేయాలి పదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అర్హతలు ఉన్నా ఉద్యోగ భద్రత కల్పించడం లేదు. వెంటనే సీఆర్పీలను రెగ్యులర్ చేయాలి. అప్పటివరకు స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో పేస్కేల్ అమలు చేయాలి. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమానికి అందరూ తరలిరావాలి. -
పని ఎక్కువ...జీతం తక్కువ
విద్యాశాఖలో ఉపాధ్యాయులు, సిబ్బందితో సమానంగా పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్స న్స్ (సీఆర్పీ)ను ప్రభుత్వం విస్మరిస్తోంది. మండల విద్యాశాఖాధికారుల పరిధిలో పనిచేసే సీఆర్పీలు రోజురోజుకూ పనిభారం పెరిగి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. స్కూల్ అసి స్టెంట్లతో సరిపోయే అర్హతలతో నియమితులైన సీఆర్పీలకు సమాన పనికి సమాన వేతనం అందని ద్రాక్షగానే మిగిలింది. డిగ్రీ, బీఎడ్, టెట్, పీజీ చేసిన వారు కూడా సీఆర్పీలుగా పనిచేస్తున్నా.. వారికి చాలీచాలని వేతనాలే అందుతున్నాయి. అరకొరగా ఇస్తున్న వేతనాలు రవాణా ఖర్చులకే సరిపోతుండడంతో జీవనోపాధికి నానాపాట్లు పడుతున్నారు. – సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నుంచి ఎర్ర శ్రీనివాస్ సీఆర్పీ వ్యవస్థ ఏర్పడిందిలా.. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి డిప్యూటేషన్‌పై ఎమ్మార్పీ (మండల రిసోర్స్ పర్సన్)లుగా నియమించే వారు. పాఠశాలలు దెబ్బతింటున్నాయనే ఉద్దే శంతో ఆ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్ట్ విధా నంలో ఆరేళ్ల క్రితం (2012లో) సీఆర్పీ వ్యవస్థ ను రూపొందించింది ప్రభుత్వం. డీఎస్సీ కమిటీ ఇంటర్వూ్యలు నిర్వహించి, అందులో ఉత్తీర్ణత, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్, మెరిట్ ప్రకారం సీఆర్పీలను నియమించారు. నియామక సమ యంలో రూ.5,500 వేతనం. అందులోనే టీఏ బిల్లు ఇచ్చేవారు. క్రమంగా.. 2013లో రూ. 7 వేలు, 2014లో 8,500 చెల్లించారు. ప్రస్తుతం రూ.15వేలు చెల్లిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2298 మంది సీఆర్పీలు పనిచేస్తున్నారు. ఇవీ డిమాండ్లు..: ఉద్యోగ భద్రత కల్పించాలి. వేతనం రూ. 28,940 స్కూల్ అసిస్టెంట్ పోస్టు కేటగిరి ప్రకారం ఇవ్వాలి. ఇన్సూరెన్స్, ఆరోగ్యకార్డులు, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఏడాదికి 22 సాధారణ సెలవులు ఇవ్వాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి. కేజీ నుంచి పీజీ విద్యలో భాగస్వాములను చేయాలి. వేతన వ్యత్యాసం వివిధ రాష్ట్రాలలో సీఆర్పీలకు ఇచ్చే వేతనాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే వేతనాలకు వ్యత్యాసం భారీగా ఉంది. ఉత్తరాఖండ్‌లో రూ. 75 వేలు, గుజరాత్లో రూ. 55,640, హర్యానాలో రూ.54వేలు, తమిళ నాడులో రూ. 51 వేలు, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ. 57,390, సిక్కింలో రూ. 60,500 చొప్పున చెల్లిస్తున్నారు. తెలంగాణలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా వేతనం కేవలం రూ.15 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇవీ సీఆర్పీల విధులు.. - సీఆర్పీలను స్కూల్ కాంప్లెక్స్‌లకు అనుసంధానించారు. ఒక్కో సీఆర్పీ దాదాపు 15 నుంచి 18 పాఠశాలలను పరిశీలించాల్సి ఉంటుంది. - ఏదో ఒక స్కూల్‌ను ప్రార్థన సమయంలో సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదు చేసుకొని వాట్సాప్‌లో అధికారులకు పంపాలి. - మండల వనరుల కేంద్రానికి, పాఠశాలలకు అనుసంధాన కర్తగా పని చేస్తూ సమాచారాన్ని అధికారులకు ఎప్పటికప్పుడు పంపుతూ ఉండాలి. - ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెడితే సీఆర్పీ విధులు నిర్వర్తించాలి. - కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణకు సహకరించాలి. - సర్వశిక్షా అభియాన్‌తోపాటు ఇతర విద్యాశాఖ కార్యక్రమాలను చేపట్టాలి. - మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించాలి. - బడి బయట పిల్లలను బడిలో చేర్పించడం, రెగ్యులర్‌గా రాని వారిని వచ్చేలా చేయడం వీరి విధి కూడా.. - పాఠశాలలో నిధుల వినియోగాన్ని సమీక్షించాలి. - క్లస్టర్ స్థాయిలో ఎగ్జిబిషన్ మేళాలు నిర్వహించడానికి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు సహకరించాలి. - వేసవి బడులను నిర్వహించాలి. -
సీఆర్పీల పాత్ర కీలకం
-కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో సీఆర్పీల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సీఆర్పీలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఓడీఎఫ్ గ్రామాల్లో సీఆర్పీలు విధిగా నివాసం ఉండాలన్నారు. గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో వీరు పనిచేయాలని సూచించారు. పనిచేసే కాలంలో ప్రతి సీఆర్పీకి భోజనం, ఇతర ఖర్చులకు రోజుకు రూ.100 ప్రకారం గ్రామైక్య సంఘాల ద్వారా చెల్లిస్తామని తెలిపారు. పూర్తి చేసే ప్రతి వ్యక్తిగత మరుగుదొడ్డికి ప్రోత్సాహకంగా రూ.100 చెల్లిస్తామని వివరించారు. సీఆర్పీలు తమకు కేటాయించిన గ్రామాల్లో కనీసం 15 రోజులు ఉండాలని తెలిపారు. పనిచేసిన రోజులకు ఏ అధికారి సంతకం లేకుండా నేరుగా గ్రామైక్య సంఘాలే హాజరు తీసుకొని వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీని ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై ఆసక్తిలేని మహిళలు సీఆర్పీలుగా పనిచేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సమావేశంలో డ్వామా పీడీ పుల్లారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ హరిబాబు, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సార్... ఆకలైతాంది
కామారెడ్డి : చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు ప్రభుత్వం వేసవి బడులను ప్రారంభించింది. జిల్లాలో సుమారు 125 బడులు నడుస్తున్నాయి. వీటిలో సుమారు ఆరు వేల మంది చదువుకుంటున్నారు. వీరు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు బడిలో ఉంటారు. వీరికి విద్యాబుద్ధులు నేర్పించే బాధ్యత సీఆర్పీలది. ఇంత వరకు బాగానే ఉన్నా వేసవి కాలం కావడంతో ఉదయమే బడికి వచ్చిన విద్యార్థులు ఆకలితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో బడికి వస్తూ 11 గంటల వరకు తరగతి గదిలోనే ఉంటున్నారు. ఒక వైపు ఎండ వేడి, మరోవైపు ఆకలి అవుతుండడంతో 10 కాగానే సార్... ఆకలవుతుందని అంటున్నారు. ఆ సమయంలో వారిని ఇంటికి పంపించకపోతే మరుసటి రోజు బడికి రావడం లేరని సీఆర్పీలు చెబుతున్నారు. బడి ప్రారంభమైనప్పుడు వచ్చిన విద్యార్థుల సంఖ్యకు ప్రస్తుతం ఉన్న సంఖ్యకు తేడా వచ్చిందని వారు వివరిస్తున్నారు. విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతూ బడికి రావడానికి మారాం చేస్తున్నారని వారు చెబుతున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నట్టుగానే వసతుల విషయంలోనూ అంతే శ్రద్ధ చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్పాహారమైనా పెట్టాలి ఎండ, ఆకలితో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు కనీసం ఏదైనా అల్పాహారం పెడితే బాగుండేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఏవేవో కార్యక్రమాలతో లక్షలు ఖర్చు చేసే అధికారులు వారికి అల్పాహారం అందిస్తే బాగుంటుందని వారు భావిస్తున్నారు. అధికారులు స్పందిం చి వేసవి బడులకు వచ్చే విద్యార్థుల సం ఖ్య తగ్గకుండా చూడాలని వేడుకుంటున్నారు. -
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
నిర్మల్ రూరల్ : వేసవి బడులకు హాజరయ్యే విద్యార్థులపై సీఆర్పీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆర్వీఎం పీవో డాక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని డీఆర్సీ భవనంలో ఆదివారం సీఆర్పీలకు వేసవి బడులపై శిక్షణ కార్యక్రమం రెండోరోజు కొనసాగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి ఆర్వీఎం పీవో డాక్టర్ విజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ఆసక్తి కలిగేలా పాఠాలు బోధించాలన్నారు. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, విద్యార్థి చదువులో ముందుండేలా చూడాలన్నారు. ప్రతీ స్కూల్ కాంప్లెక్స్‌కు ఓ పాఠశాలను ఎంపిక చేసి ఆ పాఠశాలలో వేసవి బడులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వేసవి బడులను నిర్వహిస్తున్న ఉద్దేశాన్ని సీఆర్పీలు నెరవేర్చాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులు పాఠశాల పునః ప్రారంభం నాటికి తిరిగి ఇతర విద్యార్థులతో సమానంగా రాణించేలా ఈ శిక్షణ ఇవ్వాలని కోరారు. ఎంఈవో పద్మ, రిసోర్స్‌పర్సన్స్ శ్రీకాంత్‌గౌడ్, ప్రకాశ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.