లింగాపూర్‌లో బడిబయట పిల్లల సర్వే చేస్తున్న సీఆర్పీ (ఫైల్)
ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్నా తగిన గుర్తింపు రావడం లేదని భావించిన సీఆర్పీలు ఉద్యమబాట పట్టారు. తమ సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టి సారించకపోవడంతో ఆందోళనలకు సిద్ధమయ్యారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బుధవారం నిర్వహించే ధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి తరలివెళ్లారు.
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం నూతన విద్యావిధానాలు అమలు చేస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో కీలకమైన విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీ(క్లస్టర్ రిసోర్స్ పర్సన్)ల సమస్యలను పట్టించుకోవ డం లేదు. పదేళ్లుగా విధుల్లో ఉన్నా ఉద్యోగ భద్రత లేకపోవడం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
కొత్త నియామకాలు లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఉపాధ్యాయ ఎన్నికల సమయంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన మేరకు న్యాయం జరుగుతుందని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. 2021 జూన్ నుంచి పెంచిన వేతనాలు అమలు చేస్తున్నా సమాన పనికి సమాన వేతనం మాత్రం వారికి అందని ద్రాక్షగానే మిగిలింది.
ఉమ్మడి జిల్లాలో 203 మంది..
జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు వా రధి ఉంటూ.. పాఠశాలలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు అనుసంధానంగా పనిచేసేందుకు వీలుగా సీఆర్పీలను ప్రభుత్వం నియమించింది. పదేళ్ల క్రితం రాత పరీక్షల ద్వారా ప్రతీ మండలానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ఎమ్మార్సీ కా ర్యాలయ పనులు, పాఠశాలల పర్యవేక్షణ పనులు అప్పగించారు.
అయితే ఉపాధ్యాయులు కార్యాలయాల్లో పనిచేస్తే విద్యార్థులు నష్టపోతారనే ఉద్దేశంతో విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను అత్యవసర పరిస్థితులు, ఎన్నికల విధులు, జనాభా లెక్కల విధులకు మాత్రమే వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో 2011లో నూతన విధానం తీసుకువచ్చారు. దీనికి అనుగుణంగా టీటీసీ, బీఈడీ విద్యార్హతతో 2012లో రాత పరీక్షలు, ఇంటర్వూలు నిర్వహించి సర్వ శిక్ష కార్యక్రమం కింద కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక్కో కాంప్లెక్స్ పరిధిలో ఒక్కో సీఆర్పీని నియమించారు.
ఇందులో కొంత మంది వ్యక్తిగత కారణాలతో ఉద్యోగాలు వదిలిపెట్టారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 232 కాంప్లెక్స్‌లకు 203 మంది సీఆర్పీలు విధులు నిర్వర్తిస్తున్నారు.
18కి పైగా విధులు
ప్రస్తుతం సీఆర్పీలు క్షేత్రస్థాయిలో 18కి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాంప్లెక్స్ హెచ్‌ఎంలకు సహా యంగా ఉంటూనే బడిబయట పిల్లల గుర్తింపు, 18 నుంచి 25 పాఠశాలల పర్యవేక్షణ, ఎస్‌ఎంసీ సమావేశాల నిర్వహణ, కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విధులు, మధ్యాహ్న భోజన అమలు పరిశీలన, సమగ్ర శిక్ష కార్యక్రమాల నిర్వహణ, ఎమ్మార్సీ కార్యాలయం, పాఠశాలల మ ధ్య అనుసంధాన కర్త, విద్యార్థుల ఆధార్ నమోదు, ఎన్నికల విధులు, యూడైస్, చైల్డ్ ఇన్‌ఫోలో వివరాల నమోదు తదితర పనులు చేయాలి. వీటితోపాటు జిల్లాస్థాయి అధికారులు ఆదేశాల మేరకు పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇటీవల స్వచ్ఛ విద్యా పురస్కార్‌కు సంబంధించి ఫొటోలు తీసుకోవడం, ఉపాధ్యాయుల డేటా అప్‌డేట్ చేయడం వంటి బాధ్యతలను కూడా వీరికే అప్పగించారు.
ఉద్యోగ భద్రత లేక..
చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి పనికి తగిన వేతనం చెల్లించాలని సీఆర్పీలు డిమాండ్ చేస్తున్నారు. జాబ్‌చార్ట్ ప్రకారం వీరు 15 నుంచి 18 పాఠశాలలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే సిబ్బంది కొరతతో 18 నుంచి 25 స్కూళ్ల బాధ్యతలు అప్పగించారు. ఖాళీలను భర్తీచేసి పనిభారం తగ్గించాలని కోరుతున్నారు. ప్రస్తు తం వీరికి కేంద్ర ప్రభుత్వం 60, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భాగస్వామ్యంతో వేతనాలు చెల్లిస్తున్నారు. అంతకు ముందు వీరికి రూ.15వేలు చెల్లించగా, 2021 నుంచి 30 శాతం పెంచారు. దీని ప్రకారం రూ.19,500 అందాల్సి ఉన్నా రూ.150 కోత విధించారు.
రెగ్యులర్ చేయాలి
పదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అర్హతలు ఉన్నా ఉద్యోగ భద్రత కల్పించడం లేదు. వెంటనే సీఆర్పీలను రెగ్యులర్ చేయాలి. అప్పటివరకు స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో పేస్కేల్ అమలు చేయాలి. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమానికి అందరూ తరలిరావాలి.
Comments
Please login to add a commentAdd a comment