సీఆర్‌పీల పాత్ర కీలకం
-కలెక్టర్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో సీఆర్‌పీల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సీఆర్‌పీలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఓడీఎఫ్ గ్రామాల్లో సీఆర్‌పీలు విధిగా నివాసం ఉండాలన్నారు. గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో వీరు పనిచేయాలని సూచించారు. పనిచేసే కాలంలో ప్రతి సీఆర్‌పీకి భోజనం, ఇతర ఖర్చులకు రోజుకు రూ.100 ప్రకారం గ్రామైక్య సంఘాల ద్వారా చెల్లిస్తామని తెలిపారు. పూర్తి చేసే ప్రతి వ్యక్తిగత మరుగుదొడ్డికి ప్రోత్సాహకంగా రూ.100 చెల్లిస్తామని వివరించారు. సీఆర్‌పీలు తమకు కేటాయించిన గ్రామాల్లో కనీసం 15 రోజులు ఉండాలని తెలిపారు. పనిచేసిన రోజులకు ఏ అధికారి సంతకం లేకుండా నేరుగా గ్రామైక్య సంఘాలే హాజరు తీసుకొని వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీని ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై ఆసక్తిలేని మహిళలు సీఆర్‌పీలుగా పనిచేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సమావేశంలో డ్వామా పీడీ పుల్లారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ హరిబాబు, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.