136 వివరాల నమోదుకు ఇబ్బందులు
20 శాతం మంది కూడా పూర్తిగా నమోదు చేయని వైనం
ఈ నెలాఖరు వరకు డెడ్‌లైన్..
ఆందోళనలో 1.87 లక్షల మంది ఉపాధ్యాయులు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల కోసం ఆన్‌లైన్‌లో వివరాల నమోదుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 1.87 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తమ సర్వీసు వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాల వారీగా ఈ నెలాఖరులోగా వివరాలను అప్‌లోడ్ చేయాలని చెప్పడంతో ఉపాధ్యాయులు అదే పనిలో ఉన్నారు.
అయితే, సాంకేతిక సమస్యలతో పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లోని టీచర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం (టీఐఎస్) పని చేయకపోవడంతో ఇప్పటివరకు 20 శాతం మంది ఉపాధ్యాయులు కూడా తమ వివరాలను అప్‌డేట్ చేయలేకపోయారు. మరోవైపు వెబ్‌సైట్‌లోకి వెళితే ఆరు నెలల క్రితం నమోదు చేసిన అంశాలు కూడా ఇప్పుడు కనిపించకుండా పోతున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దీంతో పాత వివరాలతోపాటు తాజా వివరాలను సైతం నమోదు చేద్దామంటే వెబ్‌సైట్ పనిచేయడం లేదని, సమస్యను పరిష్కరించి తమకు మరికొంత గడువు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లోని టీచర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం (టీఐఎస్)లో రాష్ట్రంలోని 1.87 లక్షల మంది ఉపాధ్యాయులు తమ సర్వీస్, విద్యార్హతలు, ఇప్పటి వరకు పొందిన పదోన్నతులు, బదిలీలు వంటి 136 వివరాలను నమోదు చేయాలి. అలాగే డిపార్ట్‌మెంటల్ టెస్టుల వివరాలను గెజిట్ నంబర్లతో సహా నమోదు చేయాలి. వీటి ఆధారంగానే వచ్చే ఏడాది పదోన్నతులు, బదిలీలు చేపడతారు. ఈ క్రమంలో తమ వివరాలు నమోదుకు మరికొంత గడువు పెంచాలని కోరుతున్నారు.
సర్వర్ సామర్థ్యం పెంచాలి
సాంకేతిక సమస్యలతో పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లోని టీచర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం (టీఐఎస్) పనిచేయడం లేదని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సర్విసు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు వీలుగా టీఐఎస్ సర్వర్ సామర్థ్యాన్ని పెంచాలని విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఒకేసారి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసేందుకు సన్నద్ధం కావడంతో సంబంధిత టైటిల్స్ తెరుచుకోవడం లేదన్నారు. ఒకవేళ వెబ్‌సైట్ తెరుచుకున్నా గతంలో నింపిన వివరాలు తొలగిపోకుండా చూడాలని కోరారు. టీచర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం కెపాసిటీని పెంచి వివరాల నమోదుకు గడువు పొడిగించాలని, అలాగే మొబైల్ వెర్షన్ కూడా తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment