విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల ఆర్థిక అవస్థలు
మూడు నెలలుగా బ్లాక్ గ్రాంట్ నిధులను నిలిపివేసిన ప్రభుత్వం
గత్యంతరం లేక అంతర్గత నిధుల నుంచి వర్సిటీల సర్దుబాటు
అగమ్యగోచరంగా పెన్షనర్ల పరిస్థితి
వర్సిటీల మనుగడపై విద్యావేత్తల ఆందోళన
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. ఆయన ఆర్భాటంగా ప్రకటించిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వర్సిటీ ఏర్పాటు మాట దేవుడెరుగు ఉన్న వర్సిటీల్లో పని చేస్తున్న ఆచార్యులకే జీతాలు అందని దుస్థితి నెలకొంది. వర్సిటీల్లో ఆచార్యులు, విశ్రాంత ఉద్యోగులకు గత మూడు నెలలకు పైగా ప్రభుత్వం నుంచి చెల్లింపులు నిలిచిపోవడంతో అంతర్గత నిధుల నుంచి అడ్వాన్స్‌ల రూపంలో ఒక నెల జీతాన్ని రెండు విడతలుగా తీసుకుంటున్న దుస్థితి నెలకొంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏకంగా రూ.1.19 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆచార్యులకు జీతాలను మాత్రం చెల్లించలేకపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వర్సిటీలు ఆర్థికంగా పతనమయ్యే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్‌గా విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న ఆచార్యులకు ప్రభుత్వం బ్లాక్‌గ్రాంట్ (సీఎఫ్‌ఎంస్) ద్వారా జీతాలు చెల్లించాలి.
అయితే మూడు నెలలుగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో చరిత్రలో తొలిసారిగా వర్సిటీలు తమ అంతర్గత నిధుల నుంచి అడ్వాన్స్ రూపంలో సగం జీతాలు తీసుకోవాల్సి దుస్థితి నెలకొంది. ‘గత ప్రభుత్వంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. కోవిడ్ సమయంలోనూ మా జీతాలు ఆలస్యం కాలేదు.
ఇప్పటికే మూడు నెలలుగా నిధుల విడుదల ఆపేశారు. మరో మూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే మురిగిపోతాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మా వర్సిటీపై రూ.12 కోట్లకుపైగా భారం పడుతుంది. ఇది విద్యార్థులు, ఉద్యోగుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని రాయలసీమలోని ఓ వర్సిటీ ఇన్‌చార్జీ వైస్ చాన్సలర్ ఆవేదన వ్యక్తం చేశారు.
» ఏయూలో నవంబర్, డిసెంబర్ జీతాలను వర్సిటీ నిధుల నుంచి అడ్వాన్స్‌గా సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది.
» ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోని ద్రవిడియన్ వర్సిటీలో గత త్రైమాసికంలో రూ.8 కోట్లు విడుదల చేయాల్సిన ప్రభుత్వం కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం.
ఇప్పటికీ డిసెంబర్ జీతాలు అందలేదు.
» ఆచార్య నాగార్జున వర్సిటీలో మూడు నెలలుగా ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో వర్సిటీ అంతర్గత నిధుల నుంచి సర్దుబాటు చేసుకుంటున్నారు.
» వైఎస్సార్ కడప జిల్లాలోని యోగి వేమన వర్సిటీలో గత మూడు నెలలుగా గ్రాంట్స్ విడుదల కాకపోవడంతో అంతర్గత నిధులను వినియోగిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు అందని దుస్థితి.
» తిరుపతి ఎస్వీ వర్సిటీలో చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రతి నెలా జీతాలు తీవ్ర ఆలస్యం అవుతున్నాయి. జూన్, జూలై జీతాలు ఆగస్టు 6న అందగా ఆగస్టు, సెప్టెంబర్ జీతాలు అక్టోబర్ 23న.. అక్టోబర్, నవంబర్ వేతనాలు డిసెంబర్ 5న చెల్లించారు. డిసెంబర్ జీతాలు ఇంకా ఇవ్వలేదు. uశ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోనూ 3 నెలలుగా అంతర్గత నిధులనే జీతాల కోసం వెచ్చిస్తున్నారు.
» అనంతపురంలోని జేఎన్‌టీయూలో నవంబర్ జీతాలను వర్సిటీ అంతర్గత నిధుల నుంచి జనవరి 3న సర్దుబాటు చేశారు. డిసెంబర్ జీతాలింకా ఇవ్వలేదు.
» కాకినాడ జేఎన్‌టీయూలోనూ డిసెంబర్ నెల జీతాల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు.
వర్సిటీల్లో వర్గ విభేదాలు..
రాజ్యాంగబద్ధంగా నియమితులైన వీసీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బలవంతంగా రాజీనామాలు చేయించింది. ఇన్‌చార్జీ వీసీల పాలనతో చాలా వర్సిటీల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. దీనికి తోడు గత ప్రభుత్వం నియమించిన చిరుద్యోగులను కూటమి సర్కారు పెద్ద ఎత్తున తొలగించింది. శ్రీకాకుళం అంబేడ్కర్ వర్సిటీలో 34 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అర్ధాంతరంగా పంపించేశారు.
ఇన్‌చార్జీ పాలనతో ఏయూ వందేళ్ల ఉత్సవాల్లో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ వర్సిటీలో పరీక్షల నిర్వహణ విభాగం పూర్తిగా అదుపు తప్పింది. మార్కుల లిస్టులు, ప్రొవిజినల్ సర్టిఫికెట్లు, కాన్వకేషన్ల కోసం నిత్యం వర్సిటీ చుట్టూ విద్యార్థులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.
ప్రణాళికలు తలకిందులు
ఉన్నత విద్యా మండలి పరిధిలోని వర్సిటీల్లో సుమారు 8 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరంతా పెన్షన్‌పైనే ఆధారపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ సకాలంలో అందట్లేదు. అక్టోబర్, నవంబర్ పెన్షన్‌ను ఈ నెల 2న ఇచ్చారు.
డిసెంబర్‌ది పెండింగ్‌లో ఉంది. విశ్రాంత జీవితంలో ఎన్నో ప్రణాళికలను మాకొచ్చే పెన్షన్‌తోనే నెరవేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ తలకిందులవుతున్నాయి. – శివప్రసాద్, ఏపీ వర్సిటీ పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment