ప్రభుత్వ బడుల్లో ఆయాల ఆకలికేకలు | The coalition government has not paid salaries for five months to the school workers | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లో ఆయాల ఆకలికేకలు

Published Sun, Dec 15 2024 5:47 AM | Last Updated on Sun, Dec 15 2024 5:47 AM

The coalition government has not paid salaries for five months to the school workers

45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 52 వేల మంది సేవలు 

రూ.6 వేల వేతనానికి పనిచేస్తున్న చిరుజీవులపై ప్రభుత్వ నిర్లక్ష్యం  

ఐదు నెలులుగా వేతనాలు ఇవ్వని కూటమి సర్కారు  

ఆర్థిక సమస్యల్లో కార్మికులు 

జూన్‌ నుంచి నెలకు 31.38 కోట్ల చొప్పున రూ.157 కోట్ల బకాయిలు 

గత టీడీపీ ప్రభుత్వంలోనూ 25 నెలల వేతనాలు ఎగ్గొట్టిన వైనం

కాకినాడ జిల్లా కత్తిపూడి మండలానికి చెందిన వెంకట దుర్గ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆయా (స్కావెంజర్‌)గా పనిచేస్తోంది. బడి ప్రాంగణాన్ని, గదులు, టాయిలెట్లు శుభ్రం చేస్తుంది. ఆమెకు ప్రభుత్వం ఇచ్చే వేతనం నెలకు రూ.6 వేలు. ఈ చిన్న మొత్తంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆమెకు గత ఐదు నెలలుగా వేతనం రాకపోవడంతో ఆర్థికంగా కష్టాలు పడుతోంది. 

రెండు నెలలు దుకాణాల్లో సరుకులు అరువు ఇచ్చారు. ఆ తర్వాత అరువు ఇవ్వబోమంటున్నారు. ఈ ఏడాది జూన్‌ వరకు ఠంచనుగా ఒకటో తేదీన వేతనం అందేది. ఇప్పుడు.. ‘నా జీతం ఎప్పుడు వస్తుంది సారూ..’ అంటూ ఆమె రోజూ స్కూల్లో హెచ్‌ఎంను దీనంగా అడుతోంది. ఒక్క వెంకటదుర్గదే కాదు.. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లల్లో ఆయాలు, నైట్‌వాచ్‌మెన్లుగా పనిచేస్తున్న దాదాపు 52 వేల మంది దుస్థితి ఇది.

సాక్షి, అమరావతి: స్కూలుకు ఉపాధ్యాయులు, విద్యార్థులకంటే ముందే వచ్చి ప్రాంగణాన్ని, తర­గతి గదులను ఊడ్చి శుభ్రం చేయడం మొదలు... టాయిలెట్లు శుభ్రం చేసి సాయంత్రం అందరికంటే చివరిగా వెళ్లే ఆయాలను చంద్రబాబు కూటమి సర్కారు అష్టకష్టాల పాలు చేస్తోంది. గత ఐదు నెలలుగా వారికిచ్చే రూ.6 వేల స్వల్ప వేతనాన్ని కూడా ఇవ్వకుండా వారి కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచనుగా జీతం అందుకున్న వీరికి... కూటమి సర్కారు ఏర్పడ్డాక వేతనాలు చెల్లించడం నిలిపివేసింది. 

రెండు నెలల క్రితం స్కావెంజర్లు, నైట్‌వాచ్‌మెన్ల వేతనాలకు  సుమారు రూ.180 కోట్లు విడుదల చేస్తున్నట్టు కాగితాలపైనే చూపించిన పాలకులు.. డబ్బు మాత్రం విడుదల చేయలేదు. దీంతో రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాలు, నైట్‌ వాచ్‌మెన్లుగా పనిచేస్తున్న దాదాపు 52 వేల మంది కుటుంబాలు ఆరి్థకంగా కుదేలైపోయాయి. రోజు గడవడమే కష్టమైపోతోందని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. రోజూ 10 గంటల పాటు శ్రమిస్తున్న వీరికి ప్రతి నెలా చెల్లించే రూ.31.39 కోట్లు లేవంటూ ప్రభుత్వం తప్పించుకుంటోంది. 

ఐదు నెలలుగా ప్రభుత్వం రూ.157 కోట్లు బకాలు పెట్టింది. రోజూ వేతనం కోసం స్కూల్లో హెచ్‌ఎంను అడగడం, తెలియదని వారి నుంచి సమాధానం రావడం పరిపాటిగా మారింది. గత టీడీపీ ప్రభుత్వంలోనూ అప్పట్లో రూ.2వేల వేతనంతో పనిచేసిన ఆయాలకు దాదాపు రెండేళ్ల వేతనాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇప్పుడూ అదే పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. 

52 వేల మంది కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం 
గత ఐదేళ్లు వైఎస్‌ జగన్‌  సర్కారు...  ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చిoది. పేద పిల్లలు చదువుకునే బడులను నాడు–నేడు పథకం కింద అద్భుతంగా తీర్చిదిద్దింది. 45 వేల స్కూళ్లలోను 11 రకాల సదుపాయాలు కలి్పంచింది. ఈ స్కూళ్లు, టాయిలెట్లను శుభ్రం చేసి, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు విద్యార్థుల సంఖ్యను బట్టి ఒకరు లేదా ఇద్దరు చొప్పున 47,261 మందిని నియమించింది. 

రాత్రివేళ కాపలా కోసం అవసరమైనచోట 5,053 మంది నైట్‌ వాచ్‌మెన్లను నియమించింది. వీరికి ప్రతినెలా రూ.6 వేలు చొప్పున వేతనం అందించేది. గత టీడీపీ ప్రభుత్వంలో కేవలం రూ.2 వేల వేతనంతో నియమితులైన వారికి వైఎస్‌ జగన్‌ రూ.6వేలకు పెంచడంతోపాటు చంద్రబాబు పెట్టిన 13 నెలల బకాయి­లను సైతం చెల్లించారు. 

మళ్లీ చంద్రబాబు  ప్రభు­త్వం రావడంతో వేతనాలు ఆగిపోయి ఈ కార్మి­కుల జీవనం దుర్భరంగా మారింది. పైగా కూటమి నేతలు రాజకీయ కక్షతో తొలగింపునకు పూనుకుంటున్నారు. ఉపాధ్యాయ సంఘాలు సైతం వీరి సమస్యను పట్టించుకోవడంలేదని టీచర్లే విమర్శిస్తున్నారు. 

ఆర్థికంగా కష్టాలు పడుతున్నాం 
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో 2016 నుంచి ఆయాగా పనిచేస్తున్నా. భర్త వ్యయసాయ కూలి.  మా ఇంటిని ఎంత శుభ్రంగా చూసుకుంటామో బడిలోనూ అలాగే పనిచేస్తాం. జగన్‌ సీఎం అయ్యాక మా వేతనం రూ.6 వేలు పెంచి ప్రతినెలా ఇచ్చేవారు. 

అంతకు ముందు నెలకు రూ.2 వేలు వేతనం ఆలస్యంగా ఇచ్చేవారు. పైగా 25 నెలల వేతనం ఇవ్వనే లేదు. జగన్‌ వచ్చాక వేతనం పెంచడంతో పాటు బకాయిలు సైతం ఇచ్చి ఆదుకున్నారు. లోన్‌ తీసుకుని బిడ్డకు పెళ్లి చేశా. ప్రతినెలా కిస్తీ కట్టాలి. డ్వాక్రా సంఘానికి డబ్బులు చెల్లించాలి. 5 నెలలుగా జీతం రాక అనేక కష్టాలు పడుతున్నాం. – పి.శిరీష, వెంకటాపురం, కృష్ణా జిల్లా  

జీతం రాక బతుకు కష్టంగా ఉంది 
కృష్ణా జిల్లా వక్కలగడ్డ ఎలిమెంటరీ స్కూల్లో 2015 నుంచి ఆయాగా పనిచేస్తున్నా. గతంతో పోలిస్తే ఇప్పుడు పని పెరిగింది. గ్రౌండ్‌ శుభ్రం చేయాలి, రోజూ నాలుగుసార్లు టాయిలెట్లు కడగాలి. మొక్కలకు నీళ్లు పెట్టాలి. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్కూల్లోనే పని.  సెలవులు కూడా ఉండవు. 

ఇన్ని పనులు చేసినందుకు నెలకు వచ్చే రూ.6 వేలే జీవనాధారం. ఐదు నెలలుగా అవీ ఇవ్వడంలేదు. 2019కి ముందు కూడా నాకు 20 నెలల జీతం ఇవ్వలేదు. ఇప్పుడూ అలాగే చేస్తారేమోనని భయంగా ఉంది.  జీవనం చాలా కష్టంగా ఉంది.     – మట్టా నాగమణి, వక్కలగడ్డ, కృష్ణా జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement