సత్తా ఉన్న విధానమే కానీ... | Sakshi Guest Column On Country Education system | Sakshi
Sakshi News home page

సత్తా ఉన్న విధానమే కానీ...

Published Thu, Mar 27 2025 12:28 AM | Last Updated on Thu, Mar 27 2025 12:28 AM

Sakshi Guest Column On Country Education system

విశ్లేషణ

దేశ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) 2020 లక్ష్యం. ఈ నూతన విధానం గడచిన అయిదేళ్లలో అనేక విమర్శలు, ప్రతిఘటనలు ఎదుర్కొంది. బీజేపీ పాలిత ప్రాంతాలు అక్కున చేర్చుకుని అమలు చేస్తుండగా, తమిళనాడు వంటి ప్రతిపక్ష రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయి. స్వయంప్రతిపత్తి, సాంస్కృతిక అస్తిత్వం ప్రమాదంలో పడతాయని భావిస్తూ ఎన్‌ఈపీని తిరస్కరిస్తున్నాయి. ఎన్‌ఈపీ విజన్‌ పక్కాగా ఉన్నప్పటికీ, అమలులో దక్షత కొరవడింది. నిధులు, మౌలిక వసతులు, సమాఖ్య ఏకాభిప్రాయం వంటి అంశాల్లో పలు సమస్యలు ఎదుర్కొంటోంది.

ఇప్పుడున్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 మోడల్‌ ప్రవేశపెట్టడం ఎన్‌ఈపీ 2020 తెచ్చిన కీలక సంస్కరణ. చిన్నారుల ఆరంభ విద్యకు ఇది ప్రాధాన్యం ఇచ్చింది. అలాగే, ఉపాధికి ఉపకరించేలా 6వ తరగతి నుంచే వృత్తివిద్యను ప్రవేశపెట్టడం ముఖ్యమైన మార్పు. కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో బోధన ఉండాలన్నది మరో ముందాలోచన. బహుళ విద్యా విభాగాల ద్వారా ఉన్నత విద్య అభ్యసించే వీలు ఈ నూతన విధానం కల్పిస్తోంది. ఇది చెప్పుకోదగిన మార్పు. 

ఉన్నత విద్యను అంతర్జాతీయకరించే దిశగా విదేశీ విశ్వవిద్యాలయాలు దేశంలో ప్రవేశించడానికి మార్గం సుగమం చేసింది. డిజిటల్‌ డివైడ్‌ను అధిగమించే ధ్యేయంతో ‘నేషనల్‌ ఎడ్యు కేషనల్‌ టెక్నాలజీ ఫోరం’ (ఎన్‌ఈటీఎఫ్‌) ఏర్పాటు వంటి చర్యలు ప్రతిపాదించింది. డిజిటల్‌ క్లాస్‌ రూములు, ఆన్‌లైన్‌ వనరుల వాడకం వంటి ఆధునిక పద్ధతులను కర్ణాటక, మహారాష్ట్ర అమలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. దేశీ విద్యలో అంతర్జాతీయ ట్రెండ్‌ ప్రతిబింబించేందుకు ఇవన్నీ దోహదపడతాయి.   

లోటుపాట్లు
– ఎన్‌ఈపీ విజన్‌ ఎంతో స్పష్టంగా ఉన్నప్పటికీ అమలులో గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. 2025 నాటికి సార్వత్రిక అక్షరాస్యత సాధించాలన్నది విధాన లక్ష్యం. విద్యారంగంలో మౌలిక వసతుల కోసం చాలినన్ని నిధులు కేటాయించకుండా, తగినంత మంది ఉపాధ్యాయులు లేకుండా ఇదెలా సాధ్యం? 
– మూడు భాషల ఫార్ములా కాగితం మీద బాగానే ఉందని పిస్తుంది. వాస్తవంలో ఇది ఎంత రాజకీయ రగడ  సృష్టిస్తోందో చూస్తూనే ఉన్నాం. అమలు చేస్తున్న రాష్ట్రాల్లోనూ అస్పష్టత నెలకొని ఉంది. రెండు భాషల్లోనే ప్రావీణ్యం సాధించలేని విద్యార్థులు మూడు భాషలు ఎలా అభ్యసిస్తారో వాటికి అర్థం కావడం లేదు. పరభాషలు బోధించే సుశిక్షిత ఉపాధ్యాయుల లభ్యత గురించి ఎన్‌ఈపీ 2020 ప్రస్తావించలేదు.

– పాఠశాలల డిజిటలీకరణ కూడా ఇలాంటిదే. దీని వల్ల పట్టణ విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. అయితే గ్రామాల మాటే మిటి? ఇప్పటికీ 60 శాతం మంది గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. దీన్ని పూడ్చేలా గట్టి పెట్టుబడులు పెట్టకపోతే డిజిటల్‌ అంతరం మరింత పెరుగుతుంది.  
– అలాంటిదే వృత్తి విద్య. దీంతో ఎన్ని లాభాలున్నప్పటికీ ఆచరణలో దుర్వినియోగం అయ్యే ముప్పు ఉంది. ఇంటర్న్‌షిప్స్‌ మాటున పరిశ్రమలు ఇంటర్న్‌లను దోపిడీ చేసి లేబర్‌ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తాయి. ప్రభుత్వం ఆశించినట్లు అర్థవంతమైన నైపుణ్యాభివృద్ధి జరగకపోవచ్చు. 

– బహుశా నిధుల సమస్య ఎన్‌ఈపీ 2020 లోటుపాట్లలో అగ్రభాగాన నిలుస్తుంది. జీడీపీలో 6 శాతం విద్య మీద పెట్టుబడి పెడతామన్న ప్రభుత్వ వాగ్దానం శుష్కంగానే మిగిలిపోతోంది. ఇప్పటికీ ఇది 4–4.5 శాతం మించడం లేదు. రాష్ట్రాలకు సమగ్ర శిక్ష స్కీము కింద విడుదల చేసే కేటాయింపులను ఎన్‌ఈపీ అమలుతో ముడిపెట్టారు. కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య మీద ప్రాంతీయ స్థాయి నిర్ణయాధికారాన్ని లక్ష్యపెట్టకుండా తీసుకున్న నిర్ణయం ఇది. దీనికి అనుగుణంగా తమిళనాడుకు రూ. 2,150 కోట్లను తొక్కిపట్టడంతో సమాఖ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. 

ఏకాభిప్రాయమే శరణ్యం
బీజేపీ పాలిత రాష్ట్రాలు వీరావేశంతో ఎన్‌ఈపీని అమలు చేస్తుండగా, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలు తృణీక రిస్తున్నాయి. తాము అమలు చేస్తున్న రెండు భాషల ఫార్ములాకే కట్టుబడి ఉన్నామని తమిళనాడు తెగేసి చెప్పింది. స్కూళ్లలో చేరే పిల్లల స్థూల జాతీయ సగటు (గ్రాస్‌ ఎన్‌రోల్మెంట్‌ రేషియో– జీఈఆర్‌) 27.1 శాతం ఉండగా, తమ రాష్ట్రంలో అది అత్యధికంగా 51.4 శాతంగా నమోదైందనీ, తమ విధానం విజయవంతమైందని చెప్పడానికి ఇది నిదర్శనమనీ అంటోంది.

సీయూఈటీ వంటి కేంద్రీకృత ప్రవేశ పరీక్షలను ప్రవేశపెట్టడం రాష్ట్రాలకు మింగుడుపడని మరో ప్రధానాంశం. రాష్ట్ర బోర్డుల ద్వారా వచ్చే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఈ జాతీయ ప్రవేశ పరీక్షల్లో సీబీఎస్‌ఈ స్టూడెంట్స్‌ అధికంగా స్కోరు చేస్తారు. విద్యలో అసమానతలు పెరుగుతాయి. అందుకే కేరళ ఈ విధానాన్ని వ్యతిరేకించింది. 

అయితే ఎన్‌ఈపీ 2020 ఒక సఫల విధానమని కానీ లేదా ఫెయిల్యూర్‌ స్టోరీ అని కానీ చెప్పలేం. ఇది ఇంకా నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టు లాంటిది. నూతన విద్యావిధానం విజయవంతం కావాలంటే, అది వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చు కోగలగాలి. ఏకాభిప్రాయమే శరణ్యమని గుర్తించి అందుకు అవస రమైన చర్చలు జరపాలి. 

బలవంతంగా రుద్దాలని చూస్తే కుదరదు. భిన్న సంస్కృతుల సమాహారమైన భారత్‌ వంటి దేశంలో ఈ వైఖరి అసలే పనికి రాదు. రాష్ట్రాలకు వాటి సొంత మోడల్స్‌ విడిచిపెట్టకుండానే జాతీయ విధానంలోని ప్రధాన అంశాలు అమలు చేసే వెసులు బాటు ఉండాలి. తమిళనాడునే తీసుకుందాం. భాషల ఫార్ములా జోలికి పోకుండా వొకేషనల్‌ ట్రెయినింగ్, డిజిటల్‌ లెర్నింగ్‌ పద్ధతు లను అది అమలుచేయొచ్చు.

విద్యావ్యవస్థను మార్చగలిగే సత్తా
అదే సమయంలో, కేంద్రప్రభుత్వం ఎన్‌ఈపీ అమలుకు అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం తక్షణ అవసరం. 5+3+3+4 మోడల్‌కు మారుతున్నందున బోధనపరంగా కొత్త మార్పులు అవసరమవుతాయి. పెద్దపెట్టున శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనట్లయితే, నూతన విధానం సిద్ధాంతానికే పరిమితమవుతుంది. చిట్టచివరిగా, సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలను భాగస్వాములుగా అంగీకరించి వాటితో కలిసి పనిచేయాలి. విరోధ భావన విడనాడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతల ప్రమేయంతో జాతీయ స్థాయిలో చర్చ జరగాలి.

ఎన్‌ఈపీ 2020 సరైన దిశలో రూపొందించిన ఒక ఆశావహమైన విధానం. అయితే, విద్యాసంస్కరణలను హడావిడిగా బలవంతంగా తీసుకురాలేమన్నది ఈ అయిదేళ్లలో మనం నేర్చుకున్న పెద్ద పాఠం. వీటి అమలుకు ఎంతో సహనం, పరస్పర సహకారం అవసరం. ఎన్‌ఈపీ 2020కి దేశ విద్యావ్యవస్థను మార్చే సత్తా ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎటొచ్చీ రాజకీయాలకు అతీతంగా కార్య దక్షతతో సమస్యలు పరిష్కరించుకోవాలి. అందాకా ఇది భారత విద్యాసంస్కరణల చరిత్రలో ఒక అసంపూర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది.

ప్రొ‘‘ వి. రామ్‌గోపాల్‌ రావు
వ్యాసకర్త బిట్స్‌ పిలానీ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌
వైస్‌ చాన్స్‌లర్, ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement