మాట తప్పడంపై మండిపాటు
రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు.. గెజిట్ ప్రతుల దహనం
సాక్షి నెట్‌వర్క్: గ్యారంటీడ్ పెన్షన్ స్కీం (జీపీఎస్)ను రద్దుచేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేరుస్తామని మాటిచ్చి ఇప్పుడు నాలుక మడతేయడంపై ఆయా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఎన్నికల ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా వ్యవహరిస్తున్న టీడీపీ–జనసేన–బీజేపీ ప్రభుత్వంపై అవి తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
దొడ్డిదారిన ఉత్తర్వులు జారీచేయడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగుతున్నాయి. జీపీఎస్ అమలుపై జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో శనివారం పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. విశాఖ నగరంలోని ఎన్ఏడీ సెంటర్‌లో గెజిట్ ప్రతులను దగ్ధం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
గత ప్రభుత్వాన్ని సీపీఎస్ రద్దుచేయాలని కోరితే జీపీఎస్ అమలుచేస్తామని చెప్పిందని, కానీ.. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పార్టీలు మాత్రం రద్దుచేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జీపీఎస్‌ను అమలుచేస్తూ రాజపత్రాన్ని విడుదల చేయటం.. అది కూడా 2023 అక్టోబరు నుంచి అమలుచేస్తున్నట్లు పేర్కొనడం ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేయడమేనని నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ గెజిట్‌ను తక్షణమే రద్దుచేయాలని, పాత పెన్షన్ విధానమే అమలుచేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. అల్లూరి జిల్లా చింతూరు, పాడేరుల్లోనూ ఉపాధ్యాయులు జీఓ కాపీని దగ్ధంచేశారు.
» కూటమి ప్రభుత్వం గురువులను మోసం చేసిందని విజయనగరం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ఆరోపించి గెజిట్ కాపీలను దగ్ధంచేశారు. పాత పెన్షన్ విధానాన్ని తమతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని ఆశించామని.. బాబు ఎప్పటిలాగే మోసం చేశారని మండిపడ్డారు.
» శ్రీకాకుళం జిల్లాలోనూ పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. సోంపేటలో గెజిట్ కాపీలు దగ్ధం చేశారు. రాజపత్రాన్ని విడుదల చేయటం దుర్మార్గమని నేతలన్నారు.
» ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా కూడా ఆందోళనలు జరిగాయి. అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి జీపీఎస్ గెజిట్ కాపీలను దగ్ధం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే పోరాటం చేయాల్సి వస్తోందన్నారు.
» ఏలూరులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతుంటే పాత తేదీతో జీఓ విడుదల చేయడం దుర్మార్గమన్నారు.
» కృష్ణాజిల్లా అవనిగడ్డలోని యూటీఎఫ్ కార్యాలయం ముందు నేతలు గెటిజ్ పత్రాలను దగ్ధం చేశారు. కూటిమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్ అమలుచేస్తామని చెప్పారని.. కానీ, ఇప్పుడిలా చేయడం చాలా దుర్మార్గమని నాయకులు ఫైర్ అయి పెద్దఎత్తున నినాదాలు చేశారు.
» గుంటూరు యూటీఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు జీఓ జీవో ప్రతులను దగ్ధంచేశారు. జీపీఎస్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు ఇందులో పాల్గొన్నారు.
» శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి గెజిట్ ప్రతులను దగ్ధంచేశారు. కూటమి ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని నేతలు డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చలేకుంటే ఇవ్వడం ఎందుకని వారు ప్రశ్నించారు.
» కర్నూలు కలెక్టరేట్, మహత్మగాం«ధీ విగ్రహం దగ్గర జీపీఎస్ గెజిట్ పత్రాలను యూటీఎఫ్ నాయకులు దగ్ధంచేశారు. సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఉద్యోగుల కోసం మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పిన వారు ఇప్పుడు మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. తక్షణమే జీపీఎస్ గెజిట్‌ను వెనక్కి తీసుకోవాలన్నారు. నంద్యాలలోనూ గెజిట్ పత్రాలను కాల్చివేశారు.
» వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోనూ పలుచోట్ల ఆందోళనలు చేశారు. కడపలోని కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ నాయకులు జీపీఎస్ రాజపత్రాలను దగ్ధం చేశారు. జీపీఎస్ అమలును నిలిపివేయకపోతే భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, ఇతర నేతలు హెచ్చరించారు.
» జీపీఎస్ గెజిట్ విడుదల దుర్మార్గమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ చిత్తూరులో ఆరోపించారు. ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment