ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కతా: ‘జైశ్రీరామ్’ నినాదం వల్ల సమాజంపై పడుతున్న ప్రతికూల ప్రభావం గురించి రాయండి? ‘కట్ మనీ’ వల్ల సామాన్య ప్రజలకు జరిగే మేలు ఎలాంటిదో వివరించండి.. ఎంటివి అనుకుంటున్నారా. బెంగాల్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అడిగిన ప్రశ్నలివి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పైన పేర్కొన్న నినాదాలు ఎంత ప్రభావాన్ని చూపెట్టాయో తెలిసిందే. అప్పటి వరకు బెంగాల్‌లో నామమాత్రంగా ఉన్న బీజేపీ ఈ నినాదాలతో ఏకంగా 22 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అప్పటి నుంచి బెంగాల్‌లో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య రాజకీయాలు తీవ్ర స్థాయిలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హుగ్లీ జిల్లాలో అక్నా యూనియన్ హై స్కూల్ విద్యార్థులకు పై రెండు ప్రశ్నలతో ఈ నెల 5న పరీక్ష నిర్వహించారు.
ఈ విషయం తెలియడంతో స్థానిక బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబీర్ నాగ్ మాట్లాడుతూ.. ‘మా పార్టీ, విద్యను కాషాయీకరణ చేస్తుందని విమర్శించే వాళ్లు దీనికి ఏమని సమాధానం చెబుతారు. అధికార పార్టీకి డప్పు కొట్టే బాధ్యతను ఇప్పుడు ఉపాధ్యాయులు చేపట్టారని స్పష్టమైంది. రాష్ట్ర ప్రజలంతా ఈవిషయాన్ని గమనించాలని’ ఆయన కోరారు. చిన్న పిల్లల మెదళ్లలో ఇలాంటి విద్వేష భావాలను నింపుతున్న వారిని ఖండించడానికి బలమైన పదాలు దొరకడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ గతంలో సింగూర్‌లో టాటా నానో కారు ప్లాంటుకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని 2017లో పాఠ్యాంశంగా చేర్చడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ ఘటనపై ప్రిన్సిపాల్ రోహిత్ షైన్ స్పందిస్తూ ‘ఈ విషయంపై ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోయినా మేం నివారణ చర్యలు తీసుకొని ప్రశ్నలను రద్దు చేశాం. విద్యార్థులు వాటికి సమాధానం రాయకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఎవరైనా రాసుంటే మాత్రం పూర్తి మార్కులు ఇవ్వబడతాయి. ఈ ప్రశ్నలను రూపొందించిన ఉపాధ్యాయుడు ఇప్పటికే క్షమాపణ కోరాడు’ అని తెలిపారు. అంతేకాక ఈ ప్రశ్నలను స్థానిక దినపత్రిక కోసం రూపొందించామనడం కొసమెరుపు. ఈ ఘటనను స్థానిక టీఎంసీ నాయకులు కూడా సమర్థించడం లేదు. పాఠశాల స్థాయి పిల్లలకు ఇలాంటివి ఎందుకని వారు తిరిగి ప్రశ్నించారు. జిల్లా విద్యాధికారి గోపాల్‌రాయ్ మాత్రం భిన్నంగా స్పందించారు. ఇందులో వివాదాస్పదం ఏమీ లేదనీ, ఒక వర్గం వారు కావాలనే వివాదాన్ని రేకెత్తిస్తున్నారని అభిప్రాయపడ్డారు. మరోవైపు టీఎంసీ సీనియర్ నాయకులు ఎవరూ కూడా ఈ ఘటనపై స్పందించడానికి ఇష్టపడలేదు.
Comments
Please login to add a commentAdd a comment