స్కూల్ గ్రౌండ్లో బాంబు పేలుడు
పశ్చిమ బెంగాల్: పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు శనివారం స్కూలుకు సెలవు కావడంతో పశ్చిమ బెంగాల్లోని ఓ స్కూలు విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణాల జిల్లా డమ్ డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రౌండ్లో శనివారం మద్యాహ్నం ఓ స్వల్ప తీవ్రతగల బాంబు పేలింది. సాయంత్రం ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహణకోసం సిబ్బంది గ్రౌండ్ను శుభ్రం చేస్తున్న సమయంలో బంతిలాంటి ఆకారంలో ఓ వస్తువు కనబడింది.
దాన్ని చేతిలోకి తీసుకున్న ఓ వ్యక్తి అదేమిటో అర్ధంకాక పక్కకు విసిరేశాడు. అంతే.. ఒక్కసారిగా శబ్ధం చేస్తూ బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడని బారక్పూర్ కమిషనర్ నీరద్ సింగ్ తెలిపారు. క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించామని, స్కూల్కు సెలవు కావడంతో పెను ముప్పు తప్పినట్లయిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు.