పాఠశాల ఎన్నికలకు ‘పచ్చ’ జెండా..!
ఈ నెల 26వ తేదీ నుంచి పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు
ఓటర్ల జాబితాల తయారీలో ఉపాధ్యాయులు
ఓటర్ల జాబితాలు తమకు ఇవ్వాలంటూ అధికారపార్టీ నేతల ఆదేశాలు
పిఠాపురం/బాలాజీ చెరువు: పాఠశాలలకు సర్వశిక్షా అభియాన్ నుంచి నిధులతో భవనాలు నిర్మాణం మధ్యాహ్నభోజన నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో పాఠశాల యాజమాన్య కమిటీలకు గిరాకీ పెరిగింది. ఈనెల 26న ఈ కమిటీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా ఈ దఫా ఎన్నికలు నిర్వహించడానికి ఉపాధ్యాయులు సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలో పాఠశాలల్లో ఎన్నికల సందడి ప్రారంభమయింది. జిల్లాలో 4412 ప్రభుత్వ పాఠశాలల్లో 4.02 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఓటుహక్కును వినియోగించుకోడానికి ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని కమిటీలు తమ వారికే దక్కాలని తద్వారా పాఠశాలలపై అజమాయిషీ చేయాలన్న ఉద్దేశ్యంతో అధికారపార్టీ నేతలు ఉపాధ్యాయులు తయారు చేస్తున్న జాబితాలను తమకు పంపాలంటూ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
ఎన్నికల షెడ్యుల్
ఈ నెల 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు, అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. ఓటర్ల లిస్టుపై అభ్యంతరాలను ఈ నెల 29 సాయంత్రం 3 గంటల వరకు స్వీకరిస్తారు. 4 గంటలకు ఓటర్ల జాబితాను ఖరారు చేస్తారు. వచ్చే నెల 1న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చేతులు ఎత్తడం, అభిప్రాయాలు వ్యక్త పరచడం, రహస్య బ్యాలెట్ పద్దతుల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 4 గంటలకు తొలి పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం నిర్వహిస్తారు.