బర్దిపూర్ పాఠశాలకు తాళం
♦ ఉపాధ్యాయుల మూకుమ్మడి సెలవులు
♦ చదువులకు దూరమవుతున్న చిన్నారులు
♦ ఆరుబయట కూర్చొని ఇళ్లకు..
♦ నిత్యం ఇదే తంతు అంటున్న గ్రామస్తులు
టేక్మాల్: విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు విధులకు ఎగనామం పెడుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థుల చదువులు సాగడం లేదు. విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఉపాధ్యాయులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారి ప్రభుత్వ లక్ష్యం గాడి తప్పుతోందని చెప్పడానికి ఓ ఉదాహరణగా నిలిచింది మండలంలోని బర్దిపూర్ ప్రాథమిక పాఠశాల.
వివరాల్లోకి వెళితే... టేక్మాల్ మండలంలోని బర్దిపూర్ ప్రాథమిక పాఠశాలలో ఒక హెచ్‌ఎం, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. కొన్ని నెలలుగా ఉన్నత చదువుల కోసం హెచ్‌ఎం సెలవులో ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయురాళ్లు ప్రసూతి సెలవు పెట్టారు. మరొక ఉపాధ్యాయురాలు తాత్కాలిక సెలవులపై పాఠశాలకు సరిగ్గా రావండం లేదు. పాఠశాలను నడిపించేందుకు రూ.1000 ఇస్తూ అద్దె బోధకుడిని నియమించుకున్నారు. వేతనం సరిపోవడంలేదని అతడు సైతం సరిగ్గా పాఠశాలకు రావడం లేదు. దీంతో పాఠాలు చెప్పేవారు లేక్ పోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లి ఆరుబయటే కూర్చుంటున్నారు.
శుక్రవారం సైతం ఉపాధ్యాయురాళ్లు ఎవరూ పాఠశాలకు రాకపోవడంతో బయటనే కూర్చుండి నిరసన వ్యక్తం చేశారు. నిత్యం ఇదేవిధంగా తయారైందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పాఠశాలకు వచ్చినా సమయపాలన సరిగ్గా పాటించడం లేదని మండిపడుతున్నారు. మండల స్థాయి అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగానే రెండు నెలలుగా విద్యాబోధన సక్రమంగా సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులందరికీ మూకుమ్మడిగా సెలవులను ఇవ్వడాన్ని చూస్తే మండల విద్యాధికారులు వి ద్యకు ఏమాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారో ఇట్టే తెలిసిపోతోంది.
ఈ విషయమై మండల విద్యాధికారి న ర్సింలు వివరణ కోరగా... ఉపాధ్యాయులు సె లవులో ఉన్నారని, మరో పాఠాశాల ఉపాధ్యాయుడిని వెళ్లమని చెప్పినా అనివార్య కారణాల వల్ల అతడు వెళ్లలేదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు.