కలలో... మళ్లీ బడికి!
ఎక్కువమందికి వచ్చే కలలలో ‘స్కూలు కల’ ఒకటి.ఆ కలలో మన చిన్నప్పటి రూపమే కనిపిస్తుంది. చిన్నప్పటి స్కూలే కనిపిస్తుంది. అయితే సహ విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రం ఎప్పుడూ చూడనివాళ్లు కనిపిస్తారు. మరి ఈ కల ఉద్దేశం ఏమిటి? అపురూప జ్ఞాపకాల్లో కొన్ని మళ్లీ మళ్లీ గుర్తుకు వచ్చి కలల రూపంలో దర్శనమిస్తాయి. ‘స్కూలు’ అనేది అపురూప జ్ఞాపకాల్లో ఒకటైనప్పటికీ... కలలో కనిపించే స్కూలు కేవలం దానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఆ కలకు విస్తృతార్థాలు ఉన్నాయి.ఒకే ఒక ముక్కలో చెప్పాలంటే, ‘స్కూలు’ అనేది మన నిత్యజీవిత వ్యవహారాలను ప్రతిబింబించే వేదిక. స్కూలుకు లేటయిందని, వేగంగా పరుగెత్తుకు వస్తుంటాం... టీచర్ తిడుతుందేమో అనే భయం దారి పొడుగున వెన్నంటే ఉంటుంది.
ఇక్కడ ‘ఆలస్యం’ అనేది అనేక విషయాలను సూచిస్తుంది. స్కూలు అనేది ఒక లక్ష్యం అనుకుంటే, ఆలస్యం కావడం అనేది... లక్ష్య సాధనలో జరిగే జాప్యాన్ని, అసహనాన్ని సూచిస్తుంది. చాలా కష్టపడి చదివినప్పటికీ... పరీక్షలో ఫెయిలయ్యి టీచర్ల చేత తిట్టించుకున్నట్లుగా కల వస్తుంది కొన్నిసార్లు.‘‘సార్... నేను చాలా కష్టపడి చదివాను’’ అంటామో లేదో పిల్లలందరూ ఎగతాళిగా నవ్వుతుంటారు.ఒక పనిని చాలా కష్టపడి, చిత్తశుద్ధితో చేసినప్పటికీ సరియైన ఫలితం కొన్నిసార్లు చేతికందదు. ప్రయత్న లోపం లేకపోయినప్పటికీ ఫలితం చేతికి అందకపోవడాన్ని సూచించే కల ఇది.
క్లాసు జరుగుతుంటే, వెనుక బెంచీలో కూర్చొని నిద్ర పోతున్నట్లు కూడా కొన్నిసార్లు కల వస్తుంది. ఏది జరిగినా... పట్టించుకోకుండా, ఎంత మాత్రం స్పందన లేకుండా ఉండే పరిస్థితిని ఇది ప్రతిబింబిస్తుంది. నిత్య జీవితంలో చోటు చేసుకునే... రకరకాల సంఘటనలు కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు... స్కూలుకు సంబంధించిన జ్ఞాపకాలతో మిళితమై కలలుగా వస్తుంటాయి.