బడిబాట.. ఉత్తుత్తి మాట..!
- కనిపించని సర్కారు పాఠశాలల ప్రచారం
- తూతూ మంత్రంగా అధికారుల ప్రకటనలు
- ఒక్క రూపాయి కూడా విదల్చని విద్యా శాఖ
- బడి బాటకెళ్లని ఉపాధ్యాయులు
జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు పాత బస్టాండ్ సర్కిల్‌లోని ఓ టీ బంకు వద్ద శనివారం సాయంత్రం ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయుల మధ్య జరిగిన సంభాషణ ఇది. ఈ సంభాషణ ప్రభుత్వ అయ్యవార్ల బాధ్యతా రాహిత్యాన్ని బయట పెడుతున్నా.. ఈ యేడాది బడి బాట పూర్తిగా విఫలం కావడానికి విద్యాశాఖ నిర్లక్ష్యం కారణమనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో గత వారం రోజులుగా బడి బాట అంటూ అధికారులు హడావిడి చేస్తున్నా క్షేత్ర స్థాయిలో ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా స్పందించడం లేదు.
అధికారిక ఉత్తర్వులేవీ ఇవ్వకుండా ఉత్తుత్తి ప్రకటనలు చేస్తుండటంతో ఆ ప్రకటనలను ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవ్వరూ ఖాతరు చేయడం లేదు. లేదనకుండా కొన్ని చోట్ల మండల విద్యాశాఖాధికారులు ఒకరిద్దరు టీచర్లు, నలుగురైదుగురు విద్యార్థులను వెంట బెట్టుకొని నామమాత్రంగా ఫొటోలకు ఫోజులిచ్చి బడి బాట కార్యక్రమం చేపట్టామంటూ నివేదికలు పంపుతున్నారనే విమర్శలున్నాయి. ఇక పల్లెల్లో ర్యాలీలు, ప్రచారాలు ఏమాత్రం కనిపించలేదు. మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య నానాటికీ పెరిగి పోతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు ఈ యేడాది బడి బాట విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గత ఏడాదితో పోలిస్తే..
గత ఏడాది బడి బాటను మూడు విడతలుగా చేపట్టారు. జూన్ 2 నుంచి 11వ తేదీ వరకు మొదటి విడత, 12 నుంచి 20 వతేదీ వరకు రెండవ విడత, 21 నంచి 30 వ తేదీ వరకు మూడవ విడత... ఇలా పక్కా ప్రణాళికతో బడి బాటను చేపట్టారు. ఈ మూడు విడతల్లో కూడా ఉపాధ్యాయులు గ్రామాలకు వెళ్లి ఇంటింటి ప్రచారం, కర పత్రాల పంపిణీ, పెద్ద పెద్ద బ్యానర్లతో ర్యాలీలు నిర్వహించారు. జూన్ నెలంతా బడి బయటి పిల్లలను బడిలో చేర్చుకునేందుకు, చదువులో వెనుకబడిన విద్యార్థులకు సంసిద్ధతా కార్యక్రమాలు నిర్వహించిన ఉపాధ్యాయులు జులై నెల నుంచి బోధన మొదలు పెట్టారు. కానీ ఈ విద్యా సంవత్సరం ఆదిలోనే హంసపాదు ఎదురైంది.
విద్యాశాఖ నిర్లక్ష్యం..
గత ఏడాది మే నెలలో బడి బాటకు షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ ఆ మేరకు కావాల్సిన కరపత్రాలు, బ్యానర్లను ముద్రించి ఇతర ఖర్చుల కోసం నిధులు కూడా సమకూర్చి జూన్ మొదటి నాటికి క్షేత్ర స్థాయికి చేర్చింది. బడిబాటపై తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేసింది. అయితే ఈ యేడాది కరపత్రాలు, బ్యానర్ల మాట అటుంచితే బడి బాట కార్యక్రమానికి ఒక్క రూపాయి కూడా విదిలించలేదు సరికదా రాష్ట్ర స్థాయి ప్రణాళికను కూడా విడుదల చేయలేదు. దీనికితోడు అధికారులు ప్రకటనలకే పరిమితం కావడంతో అధికారులు స్పందించలేదు. వెరసి బడిబాట కార్యక్రమం విఫలమైందని చెప్పవచ్చు.
జూన్‌నెలలో బడిబాట పూర్తి చేయాలి
వేసవి సెలవులు ముగియకముందే బడి బాట కార్యక్రమం పూర్తి కావాలి. విద్యాశాఖ రాష్ట్ర స్థాయి షెడ్యూల్ విడుదల చేసి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా తాజా షెడ్యూల్ విడుదల చేసి జూన్ నెల లోపు బడి బాటను పూర్తి చేయాలి. లేదంటే రాజీవ్ విద్యా మిషన్ ద్వారా వచ్చే కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. - సి.వి.ప్రసాద్,
ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి