'తొమ్మిదవ తరగతిలోనే కలెక్టర్ కావాలనుకున్నా'
► జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి
హైదరాబాద్: ‘అందరూ తొలి రోజు బడికి వెళ్లేందుకు భయపడితే.. నేను మాత్రం నాకు వయసు రాకముందే బడిలోకి అడుగుపెట్టా. మా పెద్దక్క భారతి బడికి వెళుతుంటే నేను వెళతానని నిత్యం ఏడ్చే వాడిని.. దీంతో నాన్న బాల్‌రెడ్డి నా ఏడుపు భరించలేక మా సొంతూరు మహబూబ్‌నగర్ బాలానగర్‌లో నాలుగేళ్లకే.. ఐదేళ్ల వయస్సు అని రాసేసి జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్పించారని' జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు.
ఆయన ఇంకా ఏం చెప్పారంటే 'బడికైతే వెళ్లా కానీ అక్క పక్కనే కూర్చునేవాడిని.. కొన్ని రోజులకు హెడ్మాస్టర్ మౌలీసాహెబ్ బాయ్స్ లైన్‌లో కూర్చొబెట్టారు.. దీంతో మళ్లీ కొన్ని రోజులు ఏడుపు తప్పలేదు. ఆపై బడి, ఉపాధ్యాయులంటే గౌరవం ఎంతో పెరిగింది. ఏనాడూ ఆలస్యంగా పాఠశాలకు వెళ్లిన దాఖలాలు లేవు. 3వ తరగతి నుండి పీజీ పూర్తి చేసేంతవరకు నేను కేవలం ఐదంటే.. ఐదే రోజులు క్లాస్‌లకు గైర్హాజరైయ్యాను. ఇక మా పాఠశాలలో టీచర్లు మమ్మల్ని ఆప్యాయంగా చూసుకునేవారు. ఒకరోజు కబడ్డీ ఆడుతుండగా గాయమై రక్తం వచ్చింది..దీంతో మా పీఈటీ వెంటనే రక్తాన్ని కడిగి ప్రాథమిక చికిత్స చేసి గాయం మానేంత వరకు రోజూ పరిశీలించేవారు. ఓ రోజు నేను లంచ్ తీసుకుపోలేదు. మధ్యాహ్న సమయంలో గ్రౌండ్‌లో ఆడుతున్న విషయాన్ని గమనించిన హిందీ టీచర్ ప్రేమలత ఆమె భోజనాన్ని ఇచ్చి ఆత్మీయతను చాటుకుంది'
'మరో రోజు తెలుగు క్లాస్ అవుతుండగా.. మా టీచర్ హనుమయ్య సార్ నన్ను లేపి పోస్టాఫీస్‌కు వెళ్లి ఇన్‌ల్యాండ్ లెటర్ కొనుగోలు చేసి తీసుకురమ్మన్నాడు..క్లాస్ అవుతుంటే..నన్నే ఎందుకు పంపుతున్నాడని నసుక్కుంటూ..వేగంగానే వెళ్లి ఏడు నిమిషాల్లో తిరిగివచ్చా.. అప్పుడు ‘జనార్ధన్ వచ్చాడు..ఇక క్లాస్ మొదలు పెడదామా’ అంటూ హనుమయ్య సార్ అన్న మాటలు నన్ను ఎక్కడికో తీసుకువెళ్లాయి. తొమ్మిదవ తరగతిలోనే నేను కలెక్టర్ కావాలని నిర్ణయించుకున్నా.. ఆ దిశగా నాకు పాఠశాల –ఉపాధ్యాయుల తీరు నాకెంతో ఉపయోగపడింది. క్లాసులకు గైర్హాజరు లేకుండా చూడగలిగితే సాధారణ విద్యార్థులు సైతం ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అందుకు నేను కరీంనగర్,అనంతపూర్ జిల్లాల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు చేసిన కృషి సత్ఫలితాలనే ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నేటితో ప్రారంభం అవుతోంది.. పిల్లలూ.. సెంట్ పర్సెంట్ అటెండెన్స్ సాధించండి..' ఆల్ ది బెస్ట్.