GHMC Commissioner Janardhan Reddy
-
హైదరాబాద్‌లో అవసరమైతే సైన్యం సాయం!
హైదరాబాద్: హైదరాబాద్‌ను ఎడతెరిపి లేని వర్షాలు బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో నగరంలోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డికి ఫోన్ చేసి.. నగరంలోని పరిస్థితిని ఆరా తీశారు. భారీ వర్షాలు, వరదల వల్ల పరిస్థితి తీవ్రంగా ఉంటే.. సైన్యం సహాయం తీసుకోవాలని సూచించారు. మరోవైపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలపై డీజీపీ అనురాగ్ గురువారం సమీక్ష నిర్వహించారు. వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పనిచేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు. ఛలాన్లు ఆపేసి.. ట్రాఫిక్ క్లియర్ చేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు భయపెడుతున్న సంగతి తెలిసిందే. గత రెండురోజులుగా కురిసిన వర్షాలకు నగరం అతలాకుతలమైంది. తాజాగా గురువారం మధ్యాహ్నం నుంచి పలుప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, ముషీరాబాద్, మూసాపేట్, బంజారాహిల్స్, తార్నాక, బర్కతపురా, అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, నిజాంపేట్, మియాపూర్, ఉప్పల్, మాదాపూర్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. మొన్న కురిసిన భారీ వర్షానికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు నిన్న వర్షం తెరపివ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు భారీ వర్షం ముంచెత్తడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వందలాది అపార్ట్ మెంట్ల సెల్లార్లలో భారీగా నీరు చేరింది. పలు చోట్ల చెరువులు నిండు కుండలా మారాయి. తాజా వర్షంతో నగరంలోని రహదార్లు చెరువులుగా మారుతున్నాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంపు ప్రాంతాల ప్రజలు నిత్యావసర వస్తువులు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నిజాంపేట బంగారీ లేఅవుట్ లో నీట మునిగిన అపార్ట్‌మెంట్స్‌లో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో దిక్కు తోచని స్థితిలో స్థానికులు ఉన్నారు. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి చార్మినార్ చుట్టూ భారీగా వరద నీరు చేరింది. దీంతో..స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొకాళ్ల లోతు నీటిలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
జీహెచ్ఎంసీ కమిషనర్‌కు కేసీఆర్ ఫోన్
హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డికి ఫోన్ కాల్ చేశారు. భారీ వర్షాల కారణంగా నగరంలో ఏర్పడ్డ పరిస్థితులపై ఆయన ఈ సందర్భంగా ఆరా తీశారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. అవసరం అయితే రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని సూచించారు. అలాగే హుస్సేన్ సాగర్ ద్వారా నీటి విడుదల సందర్భంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి, విద్యుత్, నీటి పారుదల శాఖ ఇతర ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచన చేశారు. అలాగే నగరంలోని చెరువులు, కుంటల్లోకి భారీ వరదనీరు వస్తున్నందున అవి తెగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. కాగా నగరంలో చేపట్టిన పునరావాస, సహాయ చర్యలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. -
'తొమ్మిదవ తరగతిలోనే కలెక్టర్ కావాలనుకున్నా'
► జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి హైదరాబాద్: ‘అందరూ తొలి రోజు బడికి వెళ్లేందుకు భయపడితే.. నేను మాత్రం నాకు వయసు రాకముందే బడిలోకి అడుగుపెట్టా. మా పెద్దక్క భారతి బడికి వెళుతుంటే నేను వెళతానని నిత్యం ఏడ్చే వాడిని.. దీంతో నాన్న బాల్‌రెడ్డి నా ఏడుపు భరించలేక మా సొంతూరు మహబూబ్‌నగర్ బాలానగర్‌లో నాలుగేళ్లకే.. ఐదేళ్ల వయస్సు అని రాసేసి జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్పించారని' జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే 'బడికైతే వెళ్లా కానీ అక్క పక్కనే కూర్చునేవాడిని.. కొన్ని రోజులకు హెడ్మాస్టర్ మౌలీసాహెబ్ బాయ్స్ లైన్లో కూర్చొబెట్టారు.. దీంతో మళ్లీ కొన్ని రోజులు ఏడుపు తప్పలేదు. ఆపై బడి, ఉపాధ్యాయులంటే గౌరవం ఎంతో పెరిగింది. ఏనాడూ ఆలస్యంగా పాఠశాలకు వెళ్లిన దాఖలాలు లేవు. 3వ తరగతి నుండి పీజీ పూర్తి చేసేంతవరకు నేను కేవలం ఐదంటే.. ఐదే రోజులు క్లాస్‌లకు గైర్హాజరైయ్యాను. ఇక మా పాఠశాలలో టీచర్లు మమ్మల్ని ఆప్యాయంగా చూసుకునేవారు. ఒకరోజు కబడ్డీ ఆడుతుండగా గాయమై రక్తం వచ్చింది..దీంతో మా పీఈటీ వెంటనే రక్తాన్ని కడిగి ప్రాథమిక చికిత్స చేసి గాయం మానేంత వరకు రోజూ పరిశీలించేవారు. ఓ రోజు నేను లంచ్ తీసుకుపోలేదు. మధ్యాహ్న సమయంలో గ్రౌండ్లో ఆడుతున్న విషయాన్ని గమనించిన హిందీ టీచర్ ప్రేమలత ఆమె భోజనాన్ని ఇచ్చి ఆత్మీయతను చాటుకుంది' 'మరో రోజు తెలుగు క్లాస్ అవుతుండగా.. మా టీచర్ హనుమయ్య సార్ నన్ను లేపి పోస్టాఫీస్‌కు వెళ్లి ఇన్‌ల్యాండ్ లెటర్ కొనుగోలు చేసి తీసుకురమ్మన్నాడు..క్లాస్ అవుతుంటే..నన్నే ఎందుకు పంపుతున్నాడని నసుక్కుంటూ..వేగంగానే వెళ్లి ఏడు నిమిషాల్లో తిరిగివచ్చా.. అప్పుడు ‘జనార్ధన్ వచ్చాడు..ఇక క్లాస్ మొదలు పెడదామా’ అంటూ హనుమయ్య సార్ అన్న మాటలు నన్ను ఎక్కడికో తీసుకువెళ్లాయి. తొమ్మిదవ తరగతిలోనే నేను కలెక్టర్ కావాలని నిర్ణయించుకున్నా.. ఆ దిశగా నాకు పాఠశాల –ఉపాధ్యాయుల తీరు నాకెంతో ఉపయోగపడింది. క్లాసులకు గైర్హాజరు లేకుండా చూడగలిగితే సాధారణ విద్యార్థులు సైతం ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అందుకు నేను కరీంనగర్,అనంతపూర్ జిల్లాల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు చేసిన కృషి సత్ఫలితాలనే ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నేటితో ప్రారంభం అవుతోంది.. పిల్లలూ.. సెంట్ పర్సెంట్ అటెండెన్స్ సాధించండి..' ఆల్ ది బెస్ట్. -
అత్యధిక పోలింగే లక్ష్యం...
♦ ఓటర్లలో చైతన్యానికి జీహెచ్ఎంసీ వినూత్న ప్రచారం ♦ నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీలు, ప్రదర్శనలు సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అత్యధిక పోలింగే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా సర్కిల్ కార్యాలయాల పరిధిలోని విద్యార్థులతో ర్యాలీలు చేపట్టనున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. ఓటర్ చైతన్యంపై పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేశారు. సర్కిళ్ల స్థాయిలో రెసిడెన్షియల్ వెల్పేర్ అసోసియేషన్ల సమావేశాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా స్లైడ్ ద్వారా థియేటర్లలోనూ ప్రదర్శన నిర్వహించనున్నారు. -
ఆధారాలతో వస్తే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు
జీహెచ్ఎంసీ కమిషనర్ హామీ ఇచ్చారని ఉద్యోగ నేతల వెల్లడి సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 2న జరిగే గ్రేటర్ ఎన్నికల విధులకు సంబంధించి టీచర్లు, ఉద్యోగుల్లో వికలాంగులు, మెటర్నటీ లీవ్‌లో ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే మినహాయింపు ఇస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు పీఆర్టీయూ-టీఎస్, పీఆర్టీయూ-తెలంగాణ సం ఘాల నేతలు వేర్వేరుగా పేర్కొన్నారు. సోమవారం ఆయా సంఘాల నేతలు పులి సరోత్తంరెడ్డి, నర హరి లక్ష్మారెడ్డి, జి.హర్షవర్ధన్‌రెడ్డి, చెన్నయ్య జనార్దన్‌రెడ్డిని కలసి వినతిపత్రాలు అందజేశారు. వికలాంగులు, మెటర్నటీ లీవ్‌లో ఉన్న వారిని ఎన్నికల విధులకు రావాలని ఆదేశాలిచ్చారని, వారికి మినహాయింపుపై నిర్ణయం తీసుకోవాలని జనార్దన్‌రెడ్డిని కోరారు. -
గ్రేటర్ అక్రమాల బూజు దులిపే ప్రయత్నాలు...
హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను కట్టడి చేయడానికి కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధానంగా రవాణా విభాగంలో చోటుచేసుకుంటున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ బి. జనార్ధన్‌రెడ్డి చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీలో చెత్తను తరలించడానికి వినియోగిస్తున్న భారీ వాహనాలకు అవసరమైన డీజిల్ విషయంలో కొన్నేళ్లుగా అడ్డగోలు లెక్కలతో దోచుకోవడానికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ఇకనుంచి ఆన్లైన్ పద్ధతిలో డీజిల్ అందించే ఏర్పాటు చేస్తూ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రయోగాత్మకంగా ఆన్లైన్ ద్వారా డీజిల్ అందించే పద్ధతి ప్రారంభించగా తద్వారా ప్రతి రోజూ దాదాపు 4 వేల లీటర్ల డీజిల్ ఆదా అవుతున్నట్టు తేల్చారు. 1.2 లక్షల లీటర్ల డీజిల్‌కుగాను ఒక నెలలో 60 లక్షల రూపాయలు కార్పొరేషన్‌కు ఆదా అవుతుందని అంచనా వేశారు. గతంలో ప్రతిరోజూ 32 వేల లీటర్ల డీజిల్‌ను కూపన్ల ద్వారా వినియోగిస్తుండగా, ఆన్లైన్ పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత 28 వేలకు తగ్గింది. నగరంలో జీహెచ్ఎంసీ ద్వారా చెత్త తరలించడానికి 500 వాహనాలు వాడుతున్నారు. దీనిలో డంపర్లు, జేసీబీలతో పాటు 25 టన్నులు, 10 టన్నులు, 6 టన్నుల సామర్థ్యం కలిగిన లారీలు ఉన్నాయి. వీటిల్లో 2 వందలకుపైగా వాహనాలు 15 ఏళ్ల సర్వీసు కూడా పూర్తయినవి ఉన్నాయి. వీటికి ప్రస్తుతం ప్రైవేటు బంకుల నుంచి తీసుకుంటున్న డీజిల్‌ను నేరుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి తీసుకోవడానికి వీలుగా ఐఓసీ అధికారులతో కమిషనర్ చర్చలు జరిపారు. ఇలా చేయడం వల్ల ప్రతి లీటర్‌పై 50 పైసలు ఆదా కానుంది. ఇకపోతే వాహనాల మరమ్మతులన్నీ ఇకనుంచి ఆర్టీసీకి అప్పగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగం ద్వారా మరమ్మతులు చేపడుతున్నారు. పారదర్శకత కోసం టీఎస్ఆర్టీసీ ద్వారా వాహనాల మరమ్మతుకు అనుమంతించాలని కమిషన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ విషయంపై మరో రెండు రోజుల్లో ఆర్టీసీ అధికారులతోనూ చర్చించి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. -
ఇకపై రెండు ఓట్లుంటే కేసులు
జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి * ఒక ఓటును తొలగించుకోవాలని సూచన * ఓటర్ల జాబితాలో పరిశీలన తప్పనిసరి * నోటిఫికేషన్ వరకు ఓటర్ల నమోదుకు అవకాశం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పురస్కరించుకుని బోగస్ ఓటర్లపై ఎన్నికల యంత్రాంగం కన్నెర్ర చేస్తోంది. గ్రేటర్ పరిధిలో ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉంటే వెంటనే వాటిని తొలగించుకోవాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. కొందరు ఓటర్లు రెండు సార్లు నమోదు చేసుకోవడాన్ని గుర్తించిన ఎన్నికల యంత్రాంగం చర్యలకు సిద్ధమవుతోంది. మరోవైపు గ్రేటర్ వాసులు ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నయా?, లేదా? అన్నది తెలుసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేకుంటే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. గైర్హాజరైన అధికారులపై చర్యలు: జీహెచ్ఎంసీ ఎన్నికలకు వార్డుల వారీగా నియామకం అయిన రిటర్నింగ్, అసిస్టెంట్ అధికారుల్లో కొందరు ఇప్పటి వరకు రిపోర్ట్ చేయకపోవడాన్ని కమిషనర్ జనార్దన్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఆదివారం బల్డియా ఎన్నికల నిర్వహణపై అడిషనల్ జోనల్, డిప్యూటీ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అధికారులుగా నియామకం అయిన వారిలో ఇప్పటి వరకు కొందరు రిపోర్టు చేయలేదన్నారు. వీరిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం అనుసరించి క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ హెచ్చరించారు. సోమవారం ఉదయంలోగా రిపోర్టు చేయని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎన్నికల విభాగం అధికారులకు సూచించారు. అదే విధంగా బీసీ ఓటర్ల ముసాయిదా జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని ఏ రోజుకారోజు పరిష్కరించాలన్నారు. వార్డుల వారీగా బీసీ ముసాయిదా జాబితాను రాజకీయ పార్టీలకు అందజేశామన్నారు..